YouVersion Logo
Search Icon

రూతు 3

3
బోయజు, రూతు బార్లీ గింజలు పొలంలో
1తరువాత రూతుతో నయోమి ఇలా చెప్పింది. “అమ్మా, నువ్వు స్థిరపడేలా ఏదైనా ఏర్పాటు చెయ్యాలి కదా. నీకు క్షేమం చేకూరేలా నేను చూడాలి. 2ఎవరి పనికత్తెల దగ్గర నువ్వు ఉన్నావో ఆ బోయజు మనకు బంధువు. విను, ఈ రాత్రి అతడు తన పొలంలో బార్లీ గింజలు తూర్పారబట్టబోతున్నాడు. 3నువ్వు స్నానం చేసి సువాసన నూనె రాసుకుని బట్టలు మార్చుకుని ఆ పొలానికి ధాన్యం చెరిగించే కళ్లం దగ్గరికి వెళ్ళు. అతని భోజనం ముగించి నిద్రపోయేంత వరకూ అతనికి కనిపించవద్దు. 4నిద్రపోయిన తరువాత ఎక్కడ పడుకున్నాడో చూడు. ఆ చోటికి నువ్వూ వెళ్ళగలిగేలా దాన్ని గుర్తు పెట్టుకో. తరువాత అక్కడికి వెళ్ళి అతని కాళ్ళపై ఉన్న దుప్పటి తీసి అక్కడ పడుకో. ఆ తరువాత జరగాల్సిందంతా అతనే చెబుతాడు.” 5అప్పుడు రూతు “నువ్వు చెప్పినట్టే చేస్తాను” అంది.
6ఆమె ధాన్యం చెరిగించే కళ్లం దగ్గరికి వెళ్ళి తన అత్త తనకు చెప్పినట్లు చేసింది. 7బోయజు భోజనం చేసి ద్రాక్షారసం తాగి మనస్సులో ఉల్లాసంగా పోయి ధాన్యం కుప్ప దగ్గర పడుకున్నాడు. అప్పుడు రూతు నెమ్మదిగా వెళ్ళి అతని కాళ్ళ పైన ఉన్న దుప్పటి తీసి పడుకుంది. 8అర్థరాత్రి సమయంలో బోయజు ఉలిక్కిపడి లేచి చూస్తే ఒక స్త్రీ తన కాళ్ళ దగ్గర పడుకుని ఉండటం కనిపించింది. 9అతడు, “ఎవరు నువ్వు?” అని అడిగాడు. ఆమె “నేను రూతు అనే నీ దాసిని. నువ్వు నన్ను విడిపించగల సమీప బంధువువి. నాపై నీ కొంగు కప్పు#3:9 నాపై నీ కొంగు కప్పు నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నది” అంది. 10అతడు “అమ్మాయీ, నిన్ను యెహోవా దీవించాడు. పేదవారు, ధనికులు అయిన యువకులపై నువ్వు మోజు పడలేదు. అందుకని గతంలో నీ ప్రవర్తన కంటే ఇప్పటి నీ ప్రవర్తన మరింత యోగ్యంగా ఉంది. 11అమ్మాయీ, ఇప్పుడిక భయపడవద్దు. నీకు నేను చెప్పేదంతా తప్పక నెరవేరుస్తాను. నువ్వు చాలా యోగ్యురాలివి అని ప్రజలందరికీ తెలుసు. 12నేను నిన్ను విడిపించగలను అనే మాట నిజమే. కానీ నీకు నాకంటే దగ్గర బంధువు ఒకడున్నాడు. 13ఈ రాత్రి ఉండు. ఉదయాన్నే ఆ వ్యక్తి నీకు బంధువుగా ధర్మం జరిపి నిన్ను విడిపించవచ్చు. నీకు బంధువు ధర్మం జరపడం అతనికి ఇష్టం లేకపోతే నేనే బంధువుగా ఆ ధర్మాన్ని జరిగిస్తానని యెహోవా తోడుగా ప్రమాణం చేస్తున్నాను. తెల్లవారే వరకూ నిద్రపో” అన్నాడు.
14కాబట్టి ఆమె తెల్లారే వరకూ అతని కాళ్ళ దగ్గర పడుకుని ఇంకా తెల్లవారకముందే లేచింది. అప్పుడు అతడు “ఆమె ధాన్యం చెరిగించే కళ్ళం దగ్గరికి వచ్చిన విషయం ఎవరికీ చెప్పవద్దు” అని తన సేవకులకు చెప్పాడు. 15తరువాత అతడు “నువ్వు కప్పుకున్న దుప్పటి పట్టు” అనగా ఆమె దాన్ని పట్టింది. అతడు ఆరు కొలతల#3:15 ఆరు కొలతల ఆరు కిలోగ్రాములు బార్లీ గింజలు కొలిచి ఆమె భుజానికెత్తాడు. ఆమె ఊళ్లోకి వెళ్ళిపోయింది.
16రూతు తన అత్త నయోమి దగ్గరికి వచ్చినప్పుడు నయోమి “అమ్మాయ్, ఏమైంది?” అని అడిగింది. రూతు అతడు తనకు చేసినదంతా వివరించింది. 17“అతడు నువ్వు వట్టి చేతులతో మీ అత్త ఇంటికి వెళ్ళవద్దు అని ఈ ఆరు కొలతల బార్లీ గింజలు ఇచ్చాడు” అంది. 18అప్పుడు ఆమె అత్త “అమ్మా, అతడు ఈ రోజే ఈ విషయం తేల్చేవరకూ ఊరుకోడు. కాబట్టి ఇది ఎలా జరుగుతుందో తెలిసేంత వరకూ ఇక్కడే ఉండు” అని చెప్పింది.

Currently Selected:

రూతు 3: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in