YouVersion Logo
Search Icon

కీర్తన 81

81
ప్రధాన సంగీతకారుని కోసం, గిత్తీతు రాగంతో పాడేది. ఆసాపు కీర్తన.
1మనకు బలం అయిన దేవునికి బిగ్గరగా పాడండి, యాకోబు దేవునికి ఉత్సాహంగా కేకలు వేయండి.
2పాట పాడి, కంజరి వాయించండి, మధురంగా తీగ వాయిద్యాలు వాయించండి.
3అమావాస్య రోజు, మన పండగ మొదలయ్యే పౌర్ణమి రోజు కొమ్ము ఊదండి.
4అది ఇశ్రాయేలీయులకు చట్టం. యాకోబు దేవుడు నిర్ణయించిన కట్టడ.
5ఆయన ఈజిప్టు దేశం మీదికి దండెత్తినప్పుడు యోసేపు సంతతికి దీన్ని శాసనంగా నియమించాడు. అక్కడ నేనెరగని భాష విన్నాను.
6వారి భుజాల నుంచి నేను బరువు దించాను, వారి చేతులు మోతగంపలు మోయకుండా విడుదల పొందాయి.
7నీ ఆపదలో నువ్వు మొరపెట్టావు. నేను నిన్ను విడిపించాను. ఉరిమే మబ్బుల్లోనుంచి నీకు జవాబిచ్చాను. మెరీబా నీళ్ళ దగ్గర నీకు పరీక్ష పెట్టాను. సెలా.
8నా ప్రజలారా, వినండి. ఎందుకంటే నేను మిమ్మల్ని హెచ్చరిస్తాను. అయ్యో ఇశ్రాయేలూ, నువ్వు నా మాట వింటే ఎంత బాగుండేది!
9ఇతర దేవుళ్ళు ఎవరూ మీ మధ్య ఉండకూడదు, వేరే దేవుళ్ళలో ఎవరినీ నువ్వు పూజించకూడదు.
10నేనే మీ దేవుణ్ణి, యెహోవాను. ఈజిప్టు దేశంనుంచి మిమ్మల్ని తెచ్చింది నేనే. నీ నోరు బాగా తెరువు. నేను దాన్ని నింపుతాను.
11అయితే నా ప్రజలు నా మాట వినలేదు, ఇశ్రాయేలీయులు నాకు లోబడలేదు.
12కాబట్టి వాళ్ళు తమ సొంత ఉద్దేశాలను అనుసరించనిచ్చాను. వారి హృదయకాఠిన్యానికి నేను వారిని అప్పగించాను.
13అయ్యో, నా ప్రజలు నా మాట వింటే ఎంత బాగుండేది! నా ప్రజలు నా విధానాలు అనుసరిస్తే ఎంత బాగుండేది!
14అప్పుడు నేను త్వరగా వారి శత్రువులను అణిచి వేసేవాణ్ణి. వాళ్ళను అణిచి వేసేవారి మీదికి నా చెయ్యి ఎత్తుతాను.
15యెహోవాను ద్వేషించేవాళ్ళు ఆయనకు భయంతో వినయంగా ఆయన ఎదుట ప్రణమిల్లుతారు. వాళ్ళు శాశ్వతంగా అవమానానికి గురి అవుతారు గాక!
16అతిశ్రేష్ఠమైన గోదుమలతో నేను ఇశ్రాయేలును పోషిస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in