YouVersion Logo
Search Icon

కీర్తన 147

147
1యెహోవాను స్తుతించండి. మన దేవుడైన యెహోవాను కీర్తిస్తూ గానం చేయడం మంచిది. అది మనోహరం. స్తోత్రగానం చేయడం ఎంతైనా తగినది.
2యెరూషలేమును కట్టేవాడు యెహోవాయే. చెదరిపోయిన ఇశ్రాయేలు ప్రజలను తిరిగి సమకూర్చేవాడు ఆయనే.
3గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు, వాళ్ళ గాయాలు నయం చేసేవాడు ఆయనే.
4ఆకాశంలో నక్షత్రాలను వాటి స్థానంలో ఆయనే నియమించాడు. వాటిన్నిటికీ పేర్లు పెట్టింది ఆయనే.
5మన ప్రభువు గొప్పవాడు. ఆయన గొప్ప శక్తి సామర్ధ్యాలు గలవాడు. ఆయన జ్ఞానం అమితమైనది.
6యెహోవా దీన స్థితిలో ఉన్నవారిని ఆదరిస్తాడు. ఆయన దుష్టులను నేలమట్టం చేస్తాడు.
7కృతజ్ఞతా స్తుతులతో యెహోవాను కీర్తించండి. తంతి వాయిద్యంతో మన దేవునికి స్తుతి గీతాలు పాడండి.
8ఆయన ఆకాశాన్ని మేఘాలతో నింపుతాడు. భూమి కోసం వర్షం సిద్ధం చేస్తాడు. కొండల మీద గడ్డి మొలిపిస్తాడు.
9పశువులకు, అరుస్తూ ఉండే కాకి పిల్లలకు ఆయన ఆహారం అనుగ్రహిస్తాడు.
10గుర్రాల బలం ఆయనకు సంతోషం కలిగించదు. మనుషుల శక్తి సామర్ధ్యాలను బట్టి ఆయనకు ఆనందం కలగదు.
11తన పట్ల భయభక్తులు ఉన్నవాళ్లంటే, తన అనుగ్రహం కోసం ఎదురు చూసే వాళ్ళంటే ఆయనకు ఆనందం.
12యెరూషలేమా, యెహోవాను ఘనపరచు. సీయోనూ, నీ దేవుణ్ణి కీర్తించు.
13ఆయన నీ ద్వారబంధాల గడులు దిట్టం చేశాడు. మీ నివాసాల మధ్య మీ పిల్లలను ఆశీర్వదించాడు.
14నీ పొలిమేరల్లో శాంతి సమాధానాలు నిలిచి ఉండేలా చేసేది ఆయనే. నీకు ఆహారంగా మంచి గోదుమ పంటను ఇచ్చి నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే.
15భూమికి ఆజ్ఞ జారీ చేసేవాడు ఆయనే. ఆయన వాక్కు భూమిపై చాలా వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్తుంది.
16గొర్రెబొచ్చు లాంటి తెల్లని మంచు కురిపించేవాడు ఆయనే. బూడిదలాంటి మంచు ముద్దలు చల్లేవాడు ఆయనే.
17వడగళ్ళు ముక్కలు ముక్కలుగా నేలపై విసిరేది ఆయనే. ఆయన చలి పుట్టించినప్పుడు ఎవరు తట్టుకోగలరు?
18ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవన్నీ కరిగిపోతాయి. ఆయన తన గాలి వీచేలా చేస్తే నీళ్లు ప్రవహిస్తాయి.
19తన వాక్కును యాకోబుకు తెలియజేశాడు. తన నియమనిబంధనలు, న్యాయ నిర్ణయాలు ఇశ్రాయేలుకు తెలియజేశాడు.
20మరి ఏ జనాంగం విషయంలోనూ ఆయన ఇలా చెయ్య లేదు. అయినా ఆయన న్యాయ నిర్ణయాలు వాళ్ళు గ్రహించలేదు. యెహోవాను స్తుతించండి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in