YouVersion Logo
Search Icon

ఫిలిప్పీ పత్రిక 4

4
ఆందోళనలో విశ్వాసి ఆనందించడానికి బలం క్రీస్తు
(1) ఐక్యత, ఆనందాలకై హెచ్చరిక
1కాబట్టి నా ప్రియ సోదరులారా, మీరంటే నాకెంతో ఇష్టం. మిమ్మల్ని చూడాలని చాలా ఆశగా ఉంది. నా ఆనందం, నా కిరీటంగా ఉన్న నా ప్రియ మిత్రులారా, ప్రభువులో స్థిరంగా ఉండండి. 2ప్రభువులో మనసు కలిసి ఉండమని యువొదియను, సుంటుకేను బ్రతిమాలుతున్నాను. 3అవును, నా నిజ సహకారీ, నిన్ను కూడా అడుగుతున్నాను. ఆ స్త్రీలు క్లెమెంతుతో, నా మిగతా సహకారులతో సువార్త పనిలో నాతో ప్రయాసపడ్డారు కాబట్టి వారికి సహాయం చెయ్యి. వారి పేర్లు జీవ గ్రంథంలో రాసి ఉన్నాయి. 4ఎప్పుడూ ప్రభువులో ఆనందించండి. మళ్ళీ చెబుతాను, ఆనందించండి.
(2) దేవుని శాంతి రహస్యం
5మీ సహనం అందరికీ తెలియాలి. ప్రభువు దగ్గరగా ఉన్నాడు. 6దేన్ని గూర్చీ చింతపడవద్దు. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. 7అప్పుడు సమస్త జ్ఞానానికీ మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది.
(3) శాంతి ప్రదాత దేవుని సన్నిధి
8చివరికి, సోదరులారా, ఏవి వాస్తవమో ఏవి గౌరవించదగినవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి మంచి పేరు గలవో ఏవి నైతికంగా మంచివో మెచ్చుకోదగినవో అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి. 9మీరు నా దగ్గర ఏవి నేర్చుకుని అంగీకరించారో నాలో ఉన్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూచారో, వాటిని చేయండి. అప్పుడు శాంతికి కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.
(4) ఆందోళనలపై విజయం
10నా గురించి మీరు ఇప్పటికైనా మళ్ళీ శ్రద్ధ వహించారని ప్రభువులో చాలా సంతోషించాను. గతంలో మీరు నా గురించి ఆలోచించారు గానీ మీకు సరైన అవకాశం దొరకలేదు. 11నాకేదో అవసరం ఉందని నేనిలా చెప్పడం లేదు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. 12అవసరంలో బతకడం తెలుసు, సంపన్న స్థితిలో బతకడం తెలుసు. ప్రతి విషయంలో అన్ని పరిస్థితుల్లో కడుపు నిండి ఉండడానికీ ఆకలితో ఉండడానికీ సమృద్ధి కలిగి ఉండడం, లేమిలో ఉండడం నేర్చుకున్నాను. 13నన్ను బలపరచే వాడి ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను.
14అయినా నా కష్టాలు పంచుకోవడంలో మీరు మంచి పని చేశారు. 15ఫిలిప్పీయులారా, నేను సువార్త బోధించడం మొదలుపెట్టి మాసిదోనియ నుంచి బయలుదేరినప్పుడు మీ సంఘమొక్కటే నాకు సహాయం చేసి నన్ను ఆదుకున్నది. ఈ సంగతి మీకే తెలుసు. 16ఎందుకంటే తెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికీ నా అవసరం తీర్చడానికి సహాయం చేశారు.
17నేను బహుమానాన్ని ఆశించి ఇలా చెప్పడం లేదు, మీకు ప్రతిఫలం అధికం కావాలని ఆశిస్తూ చెబుతున్నాను. 18నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు ద్వారా అందాయి. నాకు ఏమీ కొదువ లేదు. అవి ఇంపైన సువాసనగా, దేవునికి ఇష్టమైన అర్పణగా ఉన్నాయి. 19కాగా నా దేవుడు తన ఐశ్వర్యంతో క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్నీ తీరుస్తాడు.
20ఇప్పుడు మన తండ్రి అయిన దేవునికి ఎప్పటికీ మహిమ కలుగు గాక. ఆమేన్‌.
21పవిత్రులందరికీ క్రీస్తు యేసులో అభివందనాలు చెప్పండి. నాతో పాటు ఉన్న సోదరులంతా మీకు అభివందనాలు చెబుతున్నారు. 22పవిత్రులంతా, ముఖ్యంగా సీజర్ చక్రవర్తి ఇంట్లో ఉన్న పవిత్రులు మీకు అభివందనాలు చెబుతున్నారు.
23ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండు గాక.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in