YouVersion Logo
Search Icon

మార్కు 2

2
పక్షవాత రోగిని బాగు చెయ్యడం
మత్తయి 9:1-8; లూకా 5:18-26
1కొద్ది రోజుల తరువాత యేసు కపెర్నహూము పట్టణానికి తిరిగి వచ్చాడు. 2ఆయన ఇంట్లో ఉన్నాడని ప్రజలకు తెలిసింది. చాలా మంది అక్కడ గుమికూడారు. తలుపు దగ్గర కూడా చోటు లేకపోయింది. యేసు వారికి ఉపదేశం చేయసాగాడు.
3నలుగురు మనుషులు ఒక పక్షవాత రోగిని మోసుకుంటూ అక్కడికి తెచ్చారు. 4ప్రజలంతా గుమికూడిన కారణంగా రోగిని ఆయనకు దగ్గరగా తీసుకురాలేకపోయారు. అందువల్ల వారు ఆయన ఉన్న గది పైకప్పు ఊడదీసి, సందుచేసి, ఆ పక్షవాత రోగిని అతని పరుపుతో సహా యేసు ముందు దించారు. 5యేసు వారి విశ్వాసం చూసి, “కుమారా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు.
6అక్కడ ఉన్న కొందరు ధర్మశాస్త్ర పండితులు తమలో తాము ఇలా ఆలోచించారు, 7“అతడీ విధంగా ఎలా మాట్లాడగలడు? దైవదూషణ చేస్తున్నాడు గదా. దేవుడు తప్ప పాపాలు క్షమించ గలవారెవరు?” 8వారు లోలోపల ఇలా ఆలోచిస్తున్నారని యేసు అంతరాత్మలో గ్రహించి, వారితో ఇలా అన్నాడు, “మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? ఏది తేలిక? 9ఈ పక్షవాత రోగితో, ‘నీ పాపాలకు క్షమాపణ దొరికింది’ అనడమా? లేక ‘లేచి నీ పడక ఎత్తుకుని నడువు’ అనడమా? 10భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి” అని చెప్పి 11ఆ పక్షవాత రోగిని చూసి, “నువ్వు లేచి నీ పడక తీసుకుని ఇంటికి వెళ్ళమని నేను నీతో చెబుతున్నాను” అన్నాడు. 12వెంటనే ఆ పక్షవాత రోగి లేచి పడక ఎత్తుకుని, అందరూ చూస్తూ ఉండగా నడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. ఇది చూసి వారంతా విస్మయం చెంది, “మనం ఇంతవరకూ ఇలాంటిది చూడలేదే” అని దేవుణ్ణి స్తుతించారు.
లేవీ (మత్తయి) కి పిలుపు
మత్తయి 9:9-13; లూకా 5:27-32
13యేసు మళ్లీ గలిలయ సముద్ర తీరానికి వెళ్ళాడు. అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన వారికి ఉపదేశం చేశాడు. 14ఆయన నడుస్తుండగా, దారిలో అల్ఫయి కుమారుడు లేవీని చూశాడు. అతడు పన్ను వసూలు చేసే చోట కూర్చుని ఉన్నాడు. యేసు అతనితో, “నా వెంట రా!” అని పిలిచాడు. అతడు లేచి ఆయన వెంట వెళ్ళాడు. 15యేసు లేవి ఇంట్లో భోజనం చేస్తున్నపుడు పన్ను వసూలు చేసేవారు, పాపులు, చాలామంది ఆయనతో, ఆయన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఆయనను వెంబడిస్తున్నారు.
16అది చూసి ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు ఆయన శిష్యులతో, “ఈయన పాపులతో, పన్ను వసూలు చేసేవారితో కలిసి భోజనం చేస్తున్నాడేమిటి?” అన్నారు. 17యేసు ఈ మాట విని వారితో, “ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుని అవసరం లేదు. రోగులకే వైద్యుడు అవసరం. నేను నీతిపరులను పిలవడానికి రాలేదు, పాపాత్ములను పిలవడానికే వచ్చాను” అని అన్నాడు.
18యోహాను శిష్యులు, పరిసయ్యులు ఉపవాసం చేస్తారు. వారు వచ్చి, “యోహాను శిష్యులూ, పరిసయ్యుల శిష్యులూ ఉపవాసం చేస్తారు గాని నీ శిష్యులు ఉపవాసం చెయ్యరేమిటి?” అని ఆయనను అడిగారు. 19యేసు, “పెళ్ళికొడుకు తమతో ఉన్న సమయంలో పెళ్లి వారు ఉపవాసం చేస్తారా? అతడు ఉన్నంత కాలం వారు ఉపవాసం చేయరు. 20పెళ్ళికొడుకును వారి దగ్గర నుండి తీసుకు వెళ్ళే సమయం వస్తుంది. ఆ రోజుల్లో వారు ఉపవాసం ఉంటారు.
గుడ్డ మాసిక, ద్రాక్ష తిత్తుల ఉపమానం
మత్తయి 9:16-17; లూకా 5:36-39
21 “పాత బట్ట చిరుగుకు కొత్త బట్టతో ఎవరూ మాసిక వేయరు. అలా చేస్తే కొత్తది పాత దాన్ని గుంజి, చినుగు పెద్దదవుతుంది. 22పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం ఎవరూ పోయరు. అలా పోస్తే కొత్త ద్రాక్షరసం వల్ల ఆ తిత్తులు చినిగిపోతాయి. కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తుల్లోనే పోయాలి” అని వారితో అన్నాడు.
యేసు సబ్బాతుకు కూడా ప్రభువు
మత్తయి 12:1-8; లూకా 6:1-5
23విశ్రాంతి దినాన ఆయన పంట చేలలో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు తాము తినడానికి కొన్ని ధాన్యం కంకులను తుంచారు. 24పరిసయ్యులు, “చూడు, నీ శిష్యులు విశ్రాంతి దినాన చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు?” అని ఆయనను అడిగారు. 25అందుకాయన వారితో ఇలా అన్నాడు, “దావీదు, అతనితో ఉన్నవారు అవసరంలో ఆకలిగా ఉన్నప్పుడు అతడు చేసింది మీరు చదవలేదా? 26అబ్యాతారు ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు దావీదు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరెవ్వరూ తినకూడని సన్నిధి రొట్టెలు తిని తనతో ఉన్నవారికి పెట్టలేదా?” అన్నాడు.
27ఆయన మళ్ళీ వారితో ఇలా అన్నాడు, “విశ్రాంతి దినం మనుషుల కోసమేగాని మనుషులు విశ్రాంతి దినం కోసం కాదు. 28అందుచేత మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి కూడా ప్రభువే!” అని వారితో చెప్పాడు.

Currently Selected:

మార్కు 2: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in