YouVersion Logo
Search Icon

మత్తయి 12

12
యేసు తనను విశ్రాంతి దినానికి ప్రభువుగా ప్రకటించుకోవడం
మార్కు 2:23-28; లూకా 6:1-5
1ఆ రోజుల్లో యేసు ఒక విశ్రాంతి దినాన పంటచేలో పడి వెళ్తూ ఉంటే ఆయన శిష్యులకు ఆకలి వేసి కంకులు తుంచి తింటున్నారు. 2పరిసయ్యులు అది చూసి, “చూడు, విశ్రాంతి దినాన చేయకూడనిది నీ శిష్యులు చేస్తున్నారు” అని ఆయనతో అన్నారు. 3ఆయన వారితో, “దావీదుకూ అతనితో ఉన్న వారికీ ఆకలి వేస్తే అతడు చేసిన దాని గురించి మీరు చదవలేదా? 4అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, యాజకులే తప్ప తాను గానీ తనతో ఉన్నవారు గానీ తినకూడని సముఖపు రొట్టెలు తిన్నాడు.
5 విశ్రాంతి దినాన దేవాలయంలోని యాజకులు విశ్రాంతి దినాన్ని అతిక్రమించినా కూడా నిర్దోషులుగానే ఉన్నారని మీరు ధర్మశాస్త్రంలో చదవలేదా? 6దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెబుతున్నాను. 7‘కనికరాన్నే కోరుతున్నాను, బలిని కోరను’ అనే వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులుగా తీర్పు తీర్చరు. 8కాగా మనుష్యకుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువు” అన్నాడు.
విశ్రాంతి దినాన చెయ్యి చచ్చుబడిన వాణ్ణి బాగు చెయ్యడం
మార్కు 3:1-6; లూకా 6:6-11
9ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించాడు. అక్కడ చచ్చుబడిన చేతితో ఒకడు కనిపించాడు. 10పరిసయ్యులు ఆయన మీద నేరం మోపాలని, “విశ్రాంతి దినాన బాగు చేయడం న్యాయమా?” అని ఆయనను అడిగారు. 11అందుకాయన, “మీలో ఎవరికైనా ఒక గొర్రె ఉండి, అది విశ్రాంతి దినాన గుంటలో పడితే అతడు దాన్ని పైకి తీయడా? 12గొర్రె కంటే మనిషి ఎంతో విలువైన వాడు కాబట్టి విశ్రాంతి దినాన మంచి చేయడం న్యాయమే” అని చెప్పి 13ఆ మనిషితో, “నీ చెయ్యి చాపు” అన్నాడు. వాడు చెయ్యి చాపగానే అది రెండవ చెయ్యి లాగా బాగుపడింది. 14పరిసయ్యులు బయటికి పోయి, ఆయనను ఎలా చంపాలా అని ఆయనకి విరోధంగా ఆలోచన చేశారు.
యెషయా ప్రవచించిన సేవకుడు
మార్కు 3:7-12
15-16యేసు ఆ సంగతి తెలుసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. చాలా మంది ఆయనను వెంబడించగా ఆయన వారినందరినీ బాగు చేసి, తన గురించి ఎవరికీ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాడు. 17యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది. అదేమిటంటే,
18“ఈయన నా సేవకుడు. ఈయనను నేను ఏర్పరచుకున్నాను.
ఈయన నాకెంతో ప్రియమైన వాడు. ఈయన మీద నా ఆత్మను ఉంచుతాను.
ఈయన యూదేతరులకు న్యాయం ప్రకటిస్తాడు.
19ఈయన పోట్లాడడు, కేకలు వేయడు. ఈయన స్వరం వీధిలో వారికెవ్వరికీ వినిపించదు.
20న్యాయాన్ని గెలిపించే వరకూ,
ఈయన నలిగిన రెల్లును విరవడు.
ఆరిపోతున్న వత్తిని నలపడు.
21ఈయన నామంలో యూదేతరులకు నిరీక్షణ కలుగుతుంది” అనే ప్రవచనం.
దయ్యాన్ని వెళ్ళగొట్టడం
మార్కు 3:22-30; లూకా 11:14-23
22అప్పుడు దయ్యం పట్టిన ఒకణ్ణి యేసు దగ్గరికి తీసుకువచ్చారు. అతడు గుడ్డివాడు, మూగవాడు కూడా. ఆయన అతణ్ణి బాగుచేశాడు. అతనికి మాట, చూపు రెండూ వచ్చాయి. 23అందుకు ప్రజలందరూ ఆశ్చర్యపడి, “దావీదు కుమారుడు ఈయనే అయి ఉంటాడా” అని చెప్పుకున్నారు.
24పరిసయ్యులు ఆ మాట విని, “వీడు దయ్యాలరాజు బయెల్జెబూలు మూలంగానే దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, మరెవరి వలనా కాదు” అన్నారు. 25ఆయన వారి ఆలోచనలు గ్రహించి వారితో ఇలా అన్నాడు, “ఏ రాజ్యమైనా సరే, తనకు తానే వ్యతిరేకించి చీలిపోతే పాడైపోతుంది. తనకు తానే వ్యతిరేకించి చీలిపోయే ఏ పట్టణమైనా ఏ ఇల్లయినా నిలవదు.
26 ఒకవేళ సాతాను సాతానును వెళ్ళగొడితే, తనకు తానే వ్యతిరేకించి చీలిపోయినట్టు కదా. అలాగైతే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది? 27నేను బయెల్జెబూలు వలన దయ్యాలను వెళ్ళగొడుతుంటే మీ వారు ఎవరి వలన వెళ్ళగొడుతున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులవుతారు. 28దేవుని ఆత్మ వలన నేను దయ్యాలను వెళ్ళగొడుతుంటే కచ్చితంగా దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చినట్టే.
29 ఒకడు మొదట బలవంతుణ్ణి కట్టేయకుండా అతని ఇంట్లో చొరబడి అతని సామాను ఎలా దోచుకోగలడు? అలా బంధించ గలిగితేనే అతని ఇంట్లోనుంచి అతని సామాను దోచుకోగలడు. 30నా వైపున ఉండనివాడు నాకు విరోధే. నాతో కలిసి పోగు చెయ్యని వాడు చెదరగొట్టేవాడే.
క్షమాపణ లేని పాపం
మార్కు 3:29-30
31 “కాబట్టి నేను మీతో చెప్పేదేమిటంటే, మనుషులు చేసే ప్రతి పాపానికీ దూషణకూ క్షమాపణ దొరుకుతుందిగానీ దేవుని ఆత్మకు వ్యతిరేకమైన దూషణకు క్షమాపణ దొరకదు. 32మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ దొరుకుతుందిగానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి, ఈ లోకంలోగానీ రాబోయే లోకంలోగానీ క్షమాపణ ఉండదు.
మనిషి పలికే ప్రతి మాట
33 “చెట్టు మంచిదయితే దాని పండూ మంచిదవుతుంది. అలా కాక, చెట్టు చెడ్డదయితే దాని పండూ చెడ్డదవుతుంది. చెట్టు ఎలాటిదో దాని పండు వలన తెలుసుకోవచ్చు. 34విష సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా మాట్లాడగలరు? హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. 35మంచివాడు తన హృదయంలోని మంచి సంపదలో నుండి మంచి వాటిని బయటికి తెస్తాడు. చెడ్డవాడు తన హృదయంలోని చెడ్డ సంపదలో నుండి చెడ్డవాటిని బయటికి తెస్తాడు. 36మనుషులు అజాగ్రత్తగా పలికే ప్రతి మాటకూ తీర్పు రోజున లెక్క చెప్పవలసి ఉంటుందని మీతో చెబుతున్నాను. 37నీ మాటలను బట్టి నువ్వు నీతిపరుడివని తీర్పు పొందుతావు. నీ మాటలను బట్టే నీవు శిక్ష పొందుతావు.”
యోనా సూచన. యేసు తన మరణ పునరుత్థానాలను ప్రకటించడం
లూకా 11:24-26
38అప్పుడు ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యుల్లో కొందరు ఆయనకు జవాబిస్తూ, “బోధకుడా, నువ్వు ఒక సూచక క్రియ చేస్తే చూడాలని ఉంది” అన్నారు. ఆయన ఇలా అన్నాడు, 39“వ్యభిచారులైన ఈ దుర్మార్గపు తరం వారు సూచక క్రియ అడుగుతున్నారు. యోనా ప్రవక్త గురించిన సూచక క్రియ తప్ప ఏ సూచక క్రియా వారికి ఇవ్వబడదు.
40 యోనా మూడు రాత్రింబగళ్ళు పెద్ద చేప కడుపులో ఎలా ఉన్నాడో అలాగే మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు. 41నీనెవె ప్రజలు యోనా ప్రకటన విని పశ్చాత్తాప పడ్డారు కాబట్టి నీనెవె వారు ఈ తరం వారితో నిలబడి తీర్పు రోజున వారి మీద నేరం మోపుతారు. చూడండి, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
42 తీర్పు రోజున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరం మోపుతుంది. ఆమె సొలొమోను జ్ఞానం వినడానికి ఎంతో దూరం నుండి వచ్చింది. అయితే చూడండి, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
43 “అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి కోసం నీళ్ళు లేని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది. 44దానికి విశ్రాంతి దొరకదు. అప్పుడది ‘నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను’ అనుకుని వచ్చి, ఆ ఇంట్లో ఎవరూ లేక అది ఊడ్చి చక్కగా సర్దిపెట్టి ఉండడం చూస్తుంది. 45అప్పుడది వెళ్ళి తనకంటే చెడ్డవైన మరో ఏడు దయ్యాలను వెంటబెట్టుకుని వస్తుంది. అవన్నీ అక్కడే నివాసముంటాయి. అందుచేత ఆ వ్యక్తి చివరి స్థితి మొదటి దాని కంటే అధ్వాన్నం అవుతుంది. ఈ దుష్టతరం వారికీ అలాగే అవుతుంది.”
సరికొత్త సంబంధాలు
మార్కు 3:31-35; లూకా 8:19-21
46ఆయన ప్రజలతో ఇంకా మాట్లాడుతూ ఉండగా, ఆయన తల్లీ సోదరులూ ఆయనతో మాట్లాడాలని వచ్చి బయట నిలబడి ఉన్నారు. 47అప్పుడొకడు, “నీ తల్లీ నీ సోదరులూ నీతో మాట్లాడాలని బయట నిలబడి ఉన్నారు” అని ఆయనతో చెప్పాడు. 48అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూసి, “నా తల్లి ఎవరు? నా సోదరులెవరు?” అని చెప్పి 49తన శిష్యులవైపు చెయ్యి చాపి, “నా తల్లి, నా సోదరులు వీరే! 50నా పరలోకపు తండ్రి ఇష్టం చొప్పున చేసేవాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి” అన్నాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in