YouVersion Logo
Search Icon

లూకా 17

17
క్షమాపణ గురించిన ఉపదేశం
మత్తయి 18:7, 15
1ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, “ఆటంకాలు రాకుండా ఉండడం అసాధ్యం. కానీ అవి ఎవరి వల్ల వస్తాయో అతని స్థితి ఎంత భయానకమో! 2అలాంటి వ్యక్తి ఈ చిన్న బిడ్డల్లో ఎవరికైనా ఆటంకం కలగజేయడం కంటే అతడి మెడకు తిరగలి రాయి కట్టి సముద్రంలో పడవేయడం అతనికి మేలు.
3 మీ వరకూ మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే మీ సోదరుడు అపరాధం చేస్తే అతణ్ణి మందలించండి. తన అపరాధం విషయమై అతడు పశ్చాత్తాప పడితే అతణ్ణి క్షమించండి.
4 అతడు ఒకే రోజు మీకు వ్యతిరేకంగా ఏడు సార్లు అపరాధం చేసి అదే రోజు ఏడు సార్లు మీ దగ్గరికి వచ్చి, ‘పశ్చాత్తాప పడుతున్నాను’ అంటే మీరు అతణ్ణి క్షమించాలి.” 5అప్పుడు అపొస్తలులు, “ప్రభూ, మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యి” అన్నారు. 6ప్రభువు, “మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ మారేడు చెట్టును చూసి, ‘నీవు వేళ్లతో సహా పెళ్లగించుకుని పోయి సముద్రంలో నాటుకు పో’ అంటే అది మీరు చెప్పినట్టు చేస్తుంది.
ఉపచారం గురించిన ఉపమానం
7 “మీలో ఎవరి సేవకుడైనా పొలంలో భూమి దున్నుతూనో, మందను మేపుతూనో ఉండి ఇంటికి వస్తే యజమాని ‘నువ్వు వెంటనే వచ్చి భోజనానికి కూర్చో’ అంటాడా? అనడు. 8పైగా ‘నాకు భోజనం సిద్ధం చెయ్యి. తువ్వాలు కట్టుకుని నేను భోజనం చేసి ముగించే వరకూ నాకు సేవ చెయ్యి. ఆ తరువాత నువ్వు తినవచ్చు’ అంటాడు.
9 తాను ఆజ్ఞాపించిన పనులన్నీ ఆ పనివాడు చక్కగా చేశాడని యజమాని ‘నాపై దయ చూపించావు’ అని వాణ్ణి మెచ్చుకుంటాడా? 10అలాగే మీరు కూడా మీకు ఆజ్ఞాపించిన పనులన్నీ చేసిన తరువాత ‘మేము ఏ యోగ్యతా లేని సేవకులం. మేము చేయాల్సిందే చేశాం’ అని చెప్పాలి.”
పదిమంది కుష్టరోగుల స్వస్థత
11ఆయన యెరూషలేముకు ప్రయాణమై దారిలో సమరయ, గలిలయ ప్రాంతాల గుండా వెళ్తూ 12ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ కుష్టు రోగులు పదిమంది ఆయనకు ఎదురై దూరంగా నిలిచారు. 13“యేసూ, ప్రభూ, మాపై జాలి చూపు” అని గట్టిగా కేకలు వేశారు. 14ఆయన వారిని చూసి, “మీరు వెళ్ళి, యాజకులకు కనపడండి” అని చెప్పాడు. వారు వెళ్తుండగా కుష్టు రోగం నయమై శుద్ధులయ్యారు.
15వారిలో ఒకడు తన రోగం నయం కావడం చూసి 16బిగ్గరగా దేవుణ్ణి కీర్తిస్తూ, తిరిగి వచ్చి ఆయన పాదాల ముందు సాష్టాంగపడి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు. వాడు సమరయ ప్రాంతం వాడు. 17అందుకు యేసు, “పది మంది శుద్ధులయ్యారు కదా, తక్కిన తొమ్మిది మంది ఏరీ? 18దేవుణ్ణి కీర్తించడానికి ఈ విదేశీయుడు తప్ప ఇంకెవ్వరూ కనబడక పోవడం ఏమిటి?” అన్నాడు. 19“నువ్వు లేచి వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది” అని వాడితో చెప్పాడు.
రాజ్యం గురించిన ఆధ్యాత్మిక అంతరార్థం
లూకా 19:11, 12
20ఒకసారి పరిసయ్యులు, “దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది” అని ఆయనను అడిగారు. దానికి ఆయన, “దేవుని రాజ్యం అందరికీ కనిపించేలా రాదు. 21ఎందుకంటే దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది. కాబట్టి దేవుని రాజ్యం ఇదిగో ఇక్కడ ఉంది, అదిగో అక్కడ ఉంది అని చెప్పడానికి కుదరదు” అని వారికి జవాబిచ్చాడు.
యేసు తన రెండవ రాక విషయం వెల్లడించడం
22ఇంకా ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, “మనుష్య కుమారుడి రోజుల్లో ఒక రోజును చూడాలని మీరు ఎంతగానో కోరుకునే సమయం వస్తుంది. కానీ మీరు ఆ రోజును చూడరు. 23వారు, ‘ఇదిగో ఇక్కడుంది, అదిగో అక్కడుంది’ అంటారు. మీరు వెళ్ళవద్దు. అసలు వారిని అనుసరించవద్దు. 24ఆకాశంలో ఒక దిక్కున తళుక్కున మెరుపు మెరిసి ఆ వెలుగు మరో దిక్కు వరకూ ఎలా ప్రకాశిస్తుందో అలాగే ఆ రోజున మనుష్య కుమారుడు కూడా ఉంటాడు. 25అయితే దీనికి ముందుగా ఆయన అనేక హింసలు పొందాలి. ఈ తరం వారు ఆయనను పూర్తిగా నిరాకరించాలి.
26 “నోవహు రోజుల్లో జరిగినట్టు గానే మనుష్య కుమారుడి రోజుల్లో కూడా జరుగుతుంది. 27నోవహు ఓడలోకి వెళ్ళిన రోజు వరకూ ప్రజలు తినడం తాగడం పెళ్ళిళ్ళకు ఇవ్వడం పుచ్చుకోవడం చేస్తూ ఉన్నారు. అప్పుడు జలప్రళయం వచ్చి అందర్నీ నాశనం చేసింది.
28 లోతు రోజుల్లో జరిగినట్టుగా కూడా జరుగుతుంది. అప్పుడైతే ప్రజలు తింటూ తాగుతూ కొంటూ అమ్ముతూ నాట్లు వేస్తూ ఇళ్ళు కట్టుకుంటూ ఉన్నారు. 29అయితే లోతు సొదొమ విడిచి వెళ్ళిన రోజునే ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసి అందరూ నాశనం అయ్యారు.
30 “అలాగే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే రోజున కూడా జరుగుతుంది. 31ఆ రోజున మేడ మీద ఉండేవాడు ఇంట్లో సామాను తీసుకుపోవడం కోసం కిందకు దిగకూడదు. అలాగే పొలంలో పని చేస్తున్న వాడు ఇంటికి తిరిగి రాకూడదు. 32లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. 33తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు.
34 నేను చెప్పేదేమిటంటే ఆ రాత్రి ఒక మంచం మీద ఇద్దరు ఉంటే వారిలో ఒకరిని తీసుకుపోవడం, మరొకరిని విడిచి పెట్టడం జరుగుతుంది. 35ఇద్దరు స్త్రీలు తిరగలి విసరుతూ ఉంటారు. వారిలో ఒకామె వెళ్ళిపోవడం, మరొకామె ఉండిపోవడం జరుగుతుంది. ఇద్దరు పొలంలో పని చేస్తూ ఉంటారు. వారిలో ఒకడు వెళ్ళిపోతాడు. మరొకడు ఉండిపోతాడు.”
36అప్పుడు శిష్యులు, “ప్రభూ, ఇదంతా ఎక్కడ జరుగుతుంది” అని అడిగారు. 37దానికి జవాబుగా ఆయన, “శవం ఎక్కడ ఉంటే రాబందులు అక్కడ పోగవుతాయి” అన్నాడు.

Currently Selected:

లూకా 17: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in