YouVersion Logo
Search Icon

లూకా 16

16
న్యాయం తప్పిన మేనేజర్ ఉపమానం
1ఆయన తన శిష్యులకు ఇలా చెప్పాడు, “ఒక ధనవంతుడి దగ్గర ఒక అధికారి ఉన్నాడు. అతడు ఆ ధనవంతుని ఇంటి ఆర్ధిక వ్యవహారాలు చూసేవాడు. అతడు తన ఆస్తిని పాడు చేస్తున్నాడనే ఫిర్యాదు ధనవంతుడికి వచ్చింది.
2 అతడు ఆ అధికారిని పిలిపించి, ‘నీ గురించి నేను వింటున్నదేమిటి? నీ పనికి సంబంధించిన లెక్క అంతా అప్పగించు. ఇక పైన నువ్వు నిర్వహణాధికారిగా ఉండడానికి వీల్లేదు’ అన్నాడు. 3అప్పుడతడు ‘యజమాని నన్ను నిర్వహణ పనిలో నుండి తీసివేస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? తవ్వకం పని నాకు చేతకాదు. భిక్షమెత్తాలంటే అవమానం. 4నన్ను ఈ నిర్వాహకత్వపు పని నుండి తొలగించిన తరువాత నలుగురూ తమ ఇళ్ళలోకి నన్ను ఆహ్వానించాలంటే ఎలా చేయాలో నాకు తెలుసులే’ అనుకున్నాడు.
5 ఆ తరువాత అతడు తన యజమానికి బాకీ ఉన్న వారందరినీ పిలిపించాడు. ఒకడితో, ‘నా యజమానికి నువ్వు ఎంత బాకీ ఉన్నావు?’ అని అడిగాడు. 6‘మూడు వేల లీటర్ల నూనె’ అని అతడు జవాబిచ్చాడు. ఈ అధికారి ఆ వ్యక్తితో, ‘నీ పత్రంలో పదిహేను వందల లీటర్లని రాసుకో’ అన్నాడు. 7‘నువ్వు ఎంత బాకీ ఉన్నావు?’ అని మరొకణ్ణి అడిగితే అతడు, ‘వంద మానికల గోదుమలు’ అని చెప్పాడు. నిర్వహణాధికారి అతనితో, ‘నీ పత్రంలో ఎనభై మానికలని రాసుకో’ అన్నాడు. 8న్యాయం తప్పి వ్యవహరించిన ఆ అధికారి తెలివైన పని చేశాడని యజమాని అతణ్ణి మెచ్చుకున్నాడు. ఈ లోక సంబంధులు తమ వారి విషయంలో ఎంతో తెలివిగా వ్యవహరిస్తారు. ఈ విషయంలో వారు దేవుని ప్రజల కంటే తెలివైన వారు.
9 అన్యాయమైన ధనంతో స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకంటే ఆ ధనం మిమ్మల్ని వదిలి పోయినప్పుడు వారు తమ శాశ్వతమైన నివాసాల్లో మిమ్మల్ని చేర్చుకుంటారని మీతో చెబుతున్నాను. 10చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండేవాడు పెద్ద విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటాడు. చిన్న విషయాల్లో అన్యాయంగా ఉండేవాడు పెద్ద విషయాల్లో కూడా అన్యాయంగానే ఉంటాడు. 11కాబట్టి మీరు అన్యాయమైన ధనం విషయంలోనే నమ్మకంగా లేకపోతే, ఇక నిజమైన ధనం మీకెవరిస్తారు? 12మీరు ఇతరుల ధనం విషయంలో నమ్మకంగా లేకపోతే మీ సొంతమైనది మీకు ఎవరిస్తారు?
13 ఏ సేవకుడూ ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. అతడు ఒకరిని ద్వేషించి రెండవ యజమానిని ప్రేమిస్తాడు. లేదా ఒకరికి కట్టుబడి ఉండి మరొకర్ని చిన్న చూపు చూస్తాడు. మీరు దేవుణ్ణీ సిరినీ సేవించలేరు.”
పరిసయ్యులకు యేసు జవాబు
14డబ్బును ప్రేమించే పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను ఎగతాళి చేశారు. 15ఆయన వారితో ఇలా అన్నాడు. “మీరు మనుషుల దృష్టిలో నీతిమంతులని అనిపించుకునేవారే గానీ దేవునికి మీ హృదయాలు తెలుసు. మనుషులు ఘనంగా ఎంచేది దేవునికి అసహ్యం.
16 బాప్తిసమిచ్చే యోహాను వచ్చేంతవరకూ ధర్మశాస్త్రమూ ప్రవక్తల బోధలూ ఉన్నాయి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటన జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరూ ఆ రాజ్యంలో బలవంతంగా చొరబడుతూ ఉన్నారు. 17ధర్మశాస్త్రంలో ఒక పొల్లయినా తప్పిపోవడం కంటే ఆకాశం, భూమీ నశించి పోవడమే తేలిక.
విడాకులు
మత్తయి 5:31, 32; 19:3-11; మార్కు 10:2-12; 1కొరింతీ 7:10-15
18 “భార్యకు విడాకులు ఇచ్చి మరో స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. అలాగే విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.
ధనికుడు, లాజరు
19 “ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు ఊదారంగు బట్టలు, ఖరీదైన బట్టలూ ధరించేవాడు. ప్రతి రోజూ విలాసంగా జీవించేవాడు. 20లాజరు అనే నిరుపేద కూడా ఉండేవాడు. ఇతనికి ఒంటినిండా కురుపులుండేవి. ఇతడు ధనవంతుని ఇంటి గుమ్మం ముందు పడి ఉండేవాడు. 21ధనవంతుని భోజన బల్ల పైనుంచి కింద పడే రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చుకోడానికి ప్రయత్నం చేసేవాడు. అంతేకాకుండా వీధి కుక్కలు వచ్చి అతని కురుపులు నాకేవి. 22ఆ నిరుపేద చనిపోయాడు. దేవదూతలు వచ్చి అతణ్ణి అబ్రాహాముకు సన్నిహితంగా ఉండడానికి తీసుకు వెళ్ళారు. తరువాత ధనవంతుడు కూడా చనిపోయాడు. అతణ్ణి పాతిపెట్టారు.
23 “అతడు పాతాళంలో యాతనపడుతూ పైకి తేరి చూసి దూరంగా ఉన్న అబ్రాహామునూ అతనికి సన్నిహితంగా ఉన్న లాజరునూ చూసి. 24‘తండ్రీ అబ్రాహామూ, నన్ను కరుణించు. నేను ఈ మంటల్లో అల్లాడిపోతూ ఉన్నాను. లాజరు తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకపై చల్లడానికి అతణ్ణి పంపు’ అని కేకలు పెట్టాడు.
25 దానికి జవాబుగా అబ్రాహాము, ‘నాయనా, గుర్తుందా? నువ్వు జీవించి ఉన్నప్పుడు నీకిష్టమైన వాటిని నువ్వు అనుభవించావు. అప్పుడు లాజరు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇప్పుడు ఇక్కడ అతడు సేద దీరుతున్నాడు. నువ్వు యాతన పడుతున్నావు. 26అదీగాక ఇక్కడ నుండి మీ దగ్గరికి రావాలనుకునే వారు రాలేకుండా అక్కడి వారు మా దగ్గరికి రాకుండా మీకూ మాకూ మధ్య పెద్ద అగాధం ఉంది,’ అన్నాడు.
27-28 అప్పుడతడు, ‘అలాగైతే తండ్రీ, నాకు ఐదుగురు సోదరులున్నారు. వారు కూడా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా సాక్ష్యం ఇవ్వడానికి లాజరును మా ఇంటికి పంపించమని నిన్ను వేడుకుంటున్నాను’ అన్నాడు. 29అందుకు అబ్రాహాము, ‘వారి దగ్గర మోషే, ప్రవక్తలూ ఉన్నారు. నీ సోదరులు వారి మాటలు వినాలి’ అన్నాడు. 30అతడు, ‘తండ్రీ, అబ్రాహామూ అలా అనకు, చనిపోయిన వారిలో నుండి ఎవరైనా వెళ్తే వారు తప్పక పశ్చాత్తాపపడతారు’ అన్నాడు. 31అందుకు అబ్రాహాము అతనితో, ‘మోషే, ప్రవక్తలూ చెప్పిన మాటలు వారు వినకపోతే చనిపోయిన వారిలో నుండి ఎవరైనా సజీవంగా లేచి వెళ్ళినా నమ్మరు’” అన్నాడు.

Currently Selected:

లూకా 16: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in