YouVersion Logo
Search Icon

యిర్మీయా 18

18
కుమ్మరి, కుండ ఉపమానం
1యెహోవా దగ్గర నుంచి యిర్మీయాకు వచ్చిన సందేశం.
2“నువ్వు లేచి కుమ్మరి యింటికి వెళ్ళు. అక్కడ నా మాటలు నీకు చెబుతాను.”
3నేను కుమ్మరి ఇంటికి వెళితే అతడు తన సారె మీద పని చేస్తున్నాడు.
4అయితే కుమ్మరి బంకమట్టితో చేస్తున్న కుండ అతని చేతిలో విడిపోయింది. అందుచేత అతడు తన మనస్సు మార్చుకుని తనకిష్టమైనట్టు మరో కుండ చేశాడు.
5అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు,
6“ఇశ్రాయేలు ప్రజలారా! ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా?” ఇది యెహోవా వాక్కు. “బంక మట్టి కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా చేతిలో ఉన్నారు.
7దాన్ని వెళ్ళగొడతాననీ పడదోసి నాశనం చేస్తాననీ ఒక దేశం గురించి గానీ రాజ్యం గురించి గానీ నేను చెబుతున్నాను.
8ఏ రాజ్యం గురించి నేను చెప్పానో ఆ రాజ్యం దుర్మార్గం చేయడం మానితే నేను వారి మీదికి రప్పిస్తానని నేననుకున్న విపత్తు విషయం నేను జాలిపడి దాన్ని రప్పించను.
9ఒక దేశం గురించి గానీ రాజ్యం గురించి గానీ ‘నేను కడతాను, లేకపోతే సుస్థిరం చేస్తాను’ అని చెప్పినప్పుడు,
10ఆ ప్రజలు నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేస్తే దానికి చేయదలచిన మేలు చేయకుండా ఆపుతాను.”
11కాబట్టి నువ్వు వెళ్లి యూదావారితో యెరూషలేము నివాసులతో ఇలా చెప్పు. “యెహోవా ఇలా చెబుతున్నాడు, మీ మీదికి విపత్తు రప్పించబోతున్నాను. మీకు విరోధంగా ఒక ఆలోచన చేస్తున్నాను. మీరంతా ఒక్కొక్కరు మీ దుర్మార్గాన్ని విడిచి మీ విధానాలనూ ప్రవర్తననూ మార్చుకోండి.”
12అందుకు వాళ్ళు “మేము తెగించాము. మేము మా సొంత ఆలోచనల ప్రకారం ప్రవర్తిస్తాం. మేము ఒక్కొక్కరం మా హృదయంలోని దుర్మార్గం ప్రకారం ప్రవర్తిస్తాం” అంటారు.
13కాబట్టి యెహోవా ఇలా చెబుతున్నాడు, రాజ్యాలను అడిగి తెలుసుకోండి. ఇలాంటిది ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? ఇశ్రాయేలు కన్య చాలా ఘోరమైన పని చేసింది.
14లెబానోను పర్వతం మీద బండలపై మంచు లేకుండా పోతుందా? దూరం నుంచి పారే చల్లని వాగులు ఇంకిపోతాయా?
15నా ప్రజలైతే నన్ను మర్చిపోయారు. పనికిమాలిన విగ్రహాలకు వాళ్ళు ధూపం వేశారు. వాళ్ళ తమ మార్గాల్లో తడబాటు చెందారు. పురాతన దారులను విడిచిపెట్టి డొంక దారుల్లో నడవాలనుకుంటున్నారు.
16వాళ్ళ దేశం పాడైపోతుంది. అది ఎప్పటికీ ఎగతాళికి గురి అవుతుంది. ఆ దారిన వెళ్లేవాళ్ళంతా వణికిపోతూ తమ తలలూపుతారు.
17తూర్పుగాలి చెదరగొట్టినట్టు నేను వాళ్ళ శత్రువుల ఎదుట వాళ్ళను చెదరగొడతాను.
18అప్పుడు ప్రజలు ఇలా అన్నారు. “యిర్మీయా మీద కుట్ర పన్నుదాం రండి. యాజకులు ధర్మశాస్త్రం వినిపించకుండా ఉండరు. తెలివిగలవాళ్ళు సలహాలివ్వకుండా ఉండరు. ప్రవక్తలు సందేశాలు వినిపించకుండా ఉండరు. అతడు ప్రకటించే మాటలేమీ పట్టించుకోకుండా మన మాటలతో అతన్ని ఎదుర్కొందాం రండి.”
19యెహోవా, నా మొర విను. నా విరోధుల రభస విను.
20వాళ్ళు నా ప్రాణం తీయాలని గుంట తవ్వారు. వాళ్లకు నేను చేసిన మేలుకు బదులు వాళ్ళు నాకు భయంకరమైన కీడు చేయాలా? వాళ్ళ క్షేమం కోసం వాళ్ళ మీదనుంచి నీ కోపం తప్పించడానికి నీ ఎదుట నేను నిలబడి వాళ్ళ గురించి మాట్లాడిన సంగతి గుర్తుంచుకో.
21కాబట్టి వాళ్ళ పిల్లలను కరువుపాలు చెయ్యి. వాళ్ళను కత్తికి అప్పగించు. వాళ్ళ భార్యలు సంతానాన్ని కోల్పోయేలా వితంతువులయ్యేలా చెయ్యి. వాళ్ళ పురుషులు చావాలి. వాళ్ళ యువకులు యుద్ధంలో కత్తితో చావాలి.
22నన్ను పట్టుకోడానికి వాళ్ళు గొయ్యి తవ్వారు. నా కాళ్లకు ఉచ్చులు వేశారు. వాళ్ళ మీదికి నువ్వు అకస్మాత్తుగా దండెత్తే వాళ్ళను రప్పించడం వలన వారి ఇళ్ళలోనుంచి కేకలు వినబడాలి.
23యెహోవా, నన్ను చంపడానికి వాళ్ళు చేసిన కుట్ర అంతా నీకు తెలుసు. వాళ్ళ అపరాధాలనూ పాపాలనూ క్షమించవద్దు. వాళ్ళ పాపాలు నువ్వు తుడిచి వేయవద్దు. వాళ్ళు నీ ఎదుట కూలిపోవాలి. నీ ఉగ్రత కురిపించే సమయంలో వారికి తగిన శాస్తి చెయ్యి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for యిర్మీయా 18