YouVersion Logo
Search Icon

యిర్మీయా 16

16
శిక్ష-వాగ్దానం
1యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,
2“నువ్వు పెళ్లి చేసుకోవద్దు. ఈ స్థలంలో నీ కోసం కొడుకులనుగానీ కూతుళ్ళను గానీ కనొద్దు.”
3ఈ స్థలంలో పుట్టే కొడుకుల గురించి కూతుళ్ళ గురించి, వాళ్ళను కనిన తల్లులను గురించి, ఈ దేశంలో వాళ్ళను కనిన తండ్రులను గురించి యెహోవా ఇలా చెబుతున్నాడు.
4“వాళ్ళు ఘోరమైన చావు చస్తారు. వాళ్ళను గురించి ఎవ్వరూ ఏడవరు. వాళ్ళను పాతిపెట్టరు. వాళ్ళు భూమి మీద పెంటకుప్పలాగా పడి ఉంటారు. వాళ్ళు కత్తితో, కరువుతో నశిస్తారు. వాళ్ళ శవాలు రాబందులకూ భూజంతువులకూ ఆహారంగా ఉంటాయి.”
5యెహోవా ఇలా చెబుతున్నాడు. “నేను ఈ ప్రజలకు నా శాంతి, నా దయ, నా వాత్సల్యం తీసివేశాను, కాబట్టి విలపించే వాళ్ళ ఇంట్లోకి నువ్వు వెళ్లొద్దు. వాళ్ళను గురించి విలపించడానికి వెళ్ళవద్దు. ఎవరినీ ఓదార్చడానికి వెళ్ళవద్దు.” ఇది యెహోవా వాక్కు.
6ఈ దేశంలో గొప్పవాళ్ళు, సామాన్యులు అందరూ చస్తారు. వాళ్ళను ఎవ్వరూ పాతిపెట్టరు. వాళ్ళ గురించి ఎవరూ ఏడవరు. తమను తాము గాయపరచుకోరు. తలవెంట్రుకలు కత్తిరించుకోరు.
7చచ్చినవారి గురించి ప్రజలను ఓదార్చడానికి వారితో కలిసి తినే వాళ్ళెవరూ ఉండరు. ఒకరి నాన్న గానీ అమ్మ గానీ చనిపోతే కూడా ఎవరూ వారిని ఓదార్చేలా తాగడానికి ఏమీ ఇవ్వరు.
8విందు జరిగే ఇంట్లోకి నువ్వు వెళ్లొద్దు. వారితో కూర్చుని తిని తాగొద్దు.
9ఇశ్రాయేలు దేవుడు, సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. “మీ కళ్ళ ముందే మీ రోజుల్లోనే ఇక్కడే సంతోష ధ్వనినీ ఉత్సవ ధ్వనినీ పెళ్ళి కొడుకు, పెళ్లి కూతురు స్వరాలనూ ఆపబోతున్నాను.”
10నువ్వు ఈ మాటలన్నీ ఈ ప్రజలకు తెలియచేసిన తరువాత, వారు “యెహోవా మాకెందుకు ఈ ఘోర విపత్తు నిర్ణయించాడు? మా దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా మేము చేసిన దోషం, పాపం ఏమిటి?” అని నిన్ను అడుగుతారు.
11అప్పుడు నువ్వు వారితో ఇలా చెప్పు. “యెహోవా ఈ మాట చెబుతున్నాడు. మీ పూర్వీకులు నన్ను విడిచి వేరే దేవుళ్ళను అనుసరించి పూజించి వాటికి మొక్కారు. వాళ్ళు నన్ను వదిలేసి నా ధర్మశాస్త్రాన్ని పాటించలేదు.
12వినండి. మీరంతా నా మాట వినకుండా మీ చెడ్డ హృదయ కాఠిన్యం ప్రకారం నడుచుకుంటున్నారు. మీరు మీ పూర్వీకుల కంటే మరి ఎక్కువ దుర్మార్గం చేశారు.
13కాబట్టి నేను మీ పట్ల ఏమాత్రం దయ చూపను. ఈ దేశం నుంచి మీకు గానీ మీ పూర్వీకులకు గానీ తెలియని దేశంలోకి ఇక్కడ నుంచి మిమ్మల్ని విసిరివేస్తాను. అక్కడ మీరు రాత్రింబగళ్ళు ఇతర దేవుళ్ళను పూజిస్తారు.”
14యెహోవా తెలియజేసేదేమిటంటే “నేను వారి పూర్వీకులకు ఇచ్చిన దేశానికి వారిని మళ్ళీ రప్పిస్తాను. కాబట్టి రాబోయే రోజుల్లో ‘ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవం తోడు’ అని ఇకమీదట అనరు.
15కానీ ‘ఉత్తరదేశంలో నుంచి ఆయన వారిని తరిమిన దేశాలన్నిటిలో నుంచి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవం తోడు’ అని ప్రజలు ప్రమాణం చేస్తారు.”
16ఇదే యెహోవా వాక్కు. “వాళ్ళను పట్టుకోడానికి నేను చాలామంది జాలరులను పిలిపిస్తాను. తరువాత ప్రతి పర్వతం మీద నుంచి ప్రతి కొండ మీద నుంచి మెట్టల సందుల్లోనుంచి వారిని వేటాడి తోలివేయడానికి చాలామంది వేటగాళ్ళను పిలిపిస్తాను.
17ఎందుకంటే వారు వెళ్ళిన దారులన్నిటి మీద నా దృష్టి ఉంది. ఏదీ నాకు కనిపించకుండా పోలేదు. వారి దోషం నా కళ్ళకు తేటతెల్లమే.
18వాళ్ళు తమ నీచమైన విగ్రహాలతో నా సొత్తు నింపారు. నా దేశాన్ని అపవిత్రపరచారు. కాబట్టి నేను మొదట వారి దోషాన్ని బట్టి, వారి పాపాన్ని బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారం చేస్తాను.”
19యెహోవా, నువ్వే నా బలం. నా దుర్గం. దురవస్థలో ఆశ్రయంగా ఉన్నావు. ప్రపంచమంతటి నుంచి రాజ్యాలు నీ దగ్గరికి వచ్చి “మా పూర్వీకులు, వ్యర్ధాన్ని#16:19 వ్యర్ధాన్ని నీచమైన విగ్రహాలు స్వతంత్రించుకున్నారు. అవి వట్టివి విగ్రహాలు. అవి పనికిమాలినవి” అని చెబుతారు.
20మనుషులు తమకు దేవుళ్ళను కల్పించుకుంటారా? అయినా వారు దేవుళ్ళు కారు.
21కాబట్టి “నా పేరు యెహోవా” అని వారు తెలుసుకునేలా నేను ఈసారి వారికి నేర్పిస్తాను. నా బలం, నా శౌర్యం ఎంతటివో వారికి తెలియజేస్తాను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for యిర్మీయా 16