యెహె 20
20
ఇశ్రాయేలు మత భ్రష్టత్వం
1బబులోను చెరలో ఉన్న కాలంలో, ఏడో సంవత్సరం, ఐదో నెల, పదో రోజు ఇశ్రాయేలీయుల పెద్దల్లో కొంతమంది యెహోవాను యోచన అడగాలని ఆయన దగ్గరికి వచ్చి నా ఎదుట కూర్చున్నారు.
2అప్పుడు యెహోవా వాక్కు నాకు ఇలా వినిపించింది, 3“నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల పెద్దలతో నువ్వు ఇలా చెప్పు, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, నన్ను అడిగి తెలుసుకోడానికి మీరు వచ్చారా? నా జీవం తోడు, నానుంచి ఏ ఆలోచనా మీకు దొరకదు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
4“వాళ్లకు న్యాయం తీరుస్తావా? నరపుత్రుడా, వాళ్లకు న్యాయం తీరుస్తావా? వాళ్ళ పితరులు చేసిన అసహ్యమైన పనులు వాళ్ళకు తెలియజేయి. 5వాళ్ళతో చెప్పు, ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు, నేను ఇశ్రాయేలును ఎంపిక చేసుకున్న రోజు, యాకోబు సంతానానికి ప్రమాణం చేసిన రోజు, ఐగుప్తుదేశంలో నన్ను వాళ్లకు ప్రత్యక్షం చేసుకుని ప్రమాణం చేసి, నేను మీ దేవుడైన యెహోవానని నేను ప్రకటించిన కాలంలో, 6వాళ్ళను ఐగుప్తు దేశంలోనుంచి రప్పించి, వాళ్ళ కోసం నేను ఎంపిక చేసిన దేశం, పాలు తేనెలు ప్రవహించేది, అన్ని దేశాలకూ ఆభరణమైనది అయిన ఆ దేశంలోకి తీసుకు వెళ్తానని నేను ప్రమాణం చేశాను.
7అప్పుడు నేను వాళ్ళతో, నేను మీ దేవుడనైన యెహోవాను, మీలో ప్రతివాడూ అసహ్యమైన పనులు విడిచిపెట్టాలి, ఐగుప్తీయుల విగ్రహాలు విసిరేసి, వాటిని పూజించడం వల్ల మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకుండా ఉండాలి, అన్నాను.
8అయితే వాళ్ళు నా మాట వినకుండా నా మీద తిరుగుబాటు చేసి, అసహ్యమైన పనులు చెయ్యడం మానలేదు. ఐగుప్తీయుల విగ్రహాలు పూజించడం మానలేదు గనుక వాళ్ళు ఐగుప్తీయుల దేశంలో ఉండగానే నేను నా ఉగ్రత వాళ్ళ మీద కుమ్మరించి వాళ్ళ మీద నా కోపం తీర్చుకుంటానని అనుకున్నాను. 9ఏ అన్యదేశాల ఎదుట నన్ను నేను ప్రత్యక్షం చేసుకున్నానో, ఏ అన్యప్రజల మధ్య వాళ్లున్నారో, ఆ అన్యప్రజల్లో, వాళ్ళున్న అన్యప్రజల ఎదుట వాళ్లకు నన్ను ప్రత్యక్షం చేసుకున్నాను. నా పేరుకు దూషణ కలగకుండా ఉండాలని ఆ విధంగా చెయ్యకుండా, ఆ ప్రజలు చూస్తూ ఉండగా నా ఘన నామం కోసం నేను వాళ్ళను ఐగుప్తు దేశంలోనుంచి రప్పించాను.
10వాళ్ళను ఐగుప్తు దేశంలోనుంచి రప్పించి నిర్జన ప్రదేశంలోకి తీసుకొచ్చి, 11వాళ్లకు నా కట్టడలు నియమించి, నా విధులు వాళ్లకు తెలియజేశాను. ఎవడైనా వాటిని అనుసరిస్తే, వాటిని బట్టి బ్రతుకుతాడు. 12యెహోవానైన నేనే వాళ్ళను పవిత్రపరచే వాడినని వాళ్ళు తెలుసుకునేలా నాకూ, వాళ్ళకూ మధ్య నా విశ్రాంతి దినాలను నేను వాళ్లకు సూచనగా నియమించాను.
13అయితే ఎడారిలో ఇశ్రాయేలీయులు నామీద తిరుగుబాటు చేసి నా కట్టడలు అనుసరించకుండా, తాము అనుసరించి జీవించాలని నేనిచ్చిన విధులను తృణీకరించి, నేను నియమించిన విశ్రాంతి దినాలను అపవిత్రం చేసినప్పుడు, ఎడారిలో నా ఉగ్రత నేను వాళ్ళ మీద కుమ్మరించి, వాళ్ళను నాశనం చేద్దామనుకున్నాను. 14కాని నేను వాళ్ళను రప్పించినప్పుడు ఏ అన్యప్రజలు చూశారో, ఏ అన్యప్రజల్లోనుంచి నేను వాళ్ళను రప్పించానో, వాళ్ళ ఎదుట నా పేరుకు దూషణ కలగకుండా ఉండేలా నేను అనుకున్న ప్రకారం చెయ్యకుండా మానాను.
15తమకిష్టమైన విగ్రహాలను అనుసరించాలని కోరి, వాళ్ళు నా విధులను తృణీకరించి, నా కట్టడలను అనుసరించకుండా నేను నియమించిన విశ్రాంతి దినాలను అపవిత్రం చేసినప్పుడు, 16ఇస్తానని నేను చెప్పినదీ, పాలు తేనెలు ప్రవహించేదీ, అన్ని దేశాలకూ ఆభరణం అయిన ఆ దేశంలోకి వాళ్ళను తీసుకు రానని వాళ్ళు ఎడారిలో ఉండగానే నేను ప్రమాణం చేశాను. 17అయినా వాళ్ళు నశించిపోకుండా ఉండాలని వాళ్ళ మీద కనికరం చూపించి, ఎడారిలో నేను వాళ్ళను నాశనం చెయ్యలేదు.
18వాళ్ళు ఎడారిలో ఉండగానే వాళ్ళ పిల్లలతో నేను, మీరు మీ పితరులూ ఆచారాలు అనుసరించకుండా, వాళ్ళ పద్ధతుల ప్రకారం ప్రవర్తించకుండా, వాళ్ళు పెట్టుకున్న దేవుళ్ళను పూజించి మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోకుండా ఉండండి. 19మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను పాటించి, నేను నియమించిన విశ్రాంతి దినాలు ఆచరించండి. 20నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకునేలా ఆ విశ్రాంతిదినాలు నాకూ, మీకూ మధ్య సూచనగా ఉంటాయి.
21అయినా వాళ్ళ కొడుకులు, కూతుళ్ళు కూడా నా మీద తిరగబడి, తాము అనుసరించి జీవించాలని నేనిచ్చిన నా కట్టడలు అనుసరించకుండా, నా విధులను పాటించకుండా, నేను నియమించిన విశ్రాంతి దినాలను అపవిత్రం చేశారు గనుక, వాళ్ళు ఎడారిలో ఉండగానే నేను నా ఉగ్రత వాళ్ళ మీద కుమ్మరించి, వాళ్ళ మీద నా కోపం తీర్చుకోవాలని అనుకున్నాను. 22కాని నేను ప్రత్యక్షమైన అన్యప్రజల మధ్య నా పేరుకు అవమానం కలగకుండా ఉండేలా, ఏ ప్రజల్లోనుంచి వాళ్ళను రప్పించానో, ఆ ప్రజలు చూస్తూ ఉండగా నా చెయ్యి వెనక్కు తీసి నా వాగ్దానం నెరవేర్చాను.
23వాళ్ళు నా విధులు అనుసరించకుండా, నా కట్టడలు తృణీకరించి, నేను విధించిన విశ్రాంతిదినాలను అపవిత్రం చేసి, 24తమ పితరులు పెట్టుకున్న విగ్రహాలు పూజించాలని కోరుకున్నప్పుడు, అన్యప్రజల్లోకి వాళ్ళను చెదరగొట్టి, ప్రతి దేశంలోకీ వాళ్ళను వెళ్ళగొడతానని ప్రమాణం చేశాను.
25తరువాత నేను యెహోవానని వాళ్ళు తెలుసుకునేలా, మంచివి కాని కట్టడలు, బ్రతకడానికి అనుకూలం కాని విధులు వాళ్ళకు ఇచ్చాను. 26మొదట పుట్టిన పిల్లలను మంటల్లోనుంచి దాటించి బలి అర్పించడం ద్వారా తమ్మును తాము అపవిత్రం చేసుకోనిచ్చాను.”
27కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులతో మాట్లాడి, ఇలా ప్రకటించు. “ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, మీ పితరులు నా పట్ల అతిక్రమం చేసి, నన్ను దూషించి, 28వాళ్లకు ఇస్తానని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశంలోకి నేను వాళ్ళను రప్పించిన తరువాత, ఒక ఎత్తయిన కొండను గాని, ఒక దట్టమైన చెట్టును గాని వాళ్ళు చూసినప్పుడెల్లా బలులు అర్పిస్తూ, అర్పణలు అర్పిస్తూ, అక్కడ పరిమళ ధూపం వేస్తూ, పానార్పణలు చేస్తూ, నాకు కోపం పుట్టించారు.” 29అప్పుడు నేను వాళ్ళతో “మీరు బలులు తీసుకొస్తున్న ఈ ఉన్నత స్థలాలు ఏంటి?” అని అడిగాను. కాబట్టి దానికి “బామా” అనే పేరు ఈ రోజు వరకూ వాడుకలో ఉంది.
తీర్పు, పునరుద్ధరణ
30కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటించు. “ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, మీ పితరుల విధానంలోనే మీరూ అపవిత్రులు అయ్యారు. వాళ్ళు పెట్టుకున్న విగ్రహాలను అనుసరిస్తూ మీరూ వ్యభిచారులయ్యారు. 31ఈనాటి వరకూ మీరు అర్పణలు అర్పించి మీ కొడుకులను అగ్నిగుండా దాటించేటప్పుడు మీరు పెట్టుకున్న విగ్రహాలన్నిటికీ పూజ చేసి అపవిత్రులయ్యారు. ఇశ్రాయేలీయులారా, మీరు నా దగ్గరికి వచ్చి నన్ను యోచన అడుగుతున్నారా? నా జీవం తోడు, నానుంచి మీకు ఏ ఆలోచనా దొరకదు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 32‘అన్యప్రజలు, భూమి మీద ఇతర జాతులూ చేస్తున్నట్టు మేము కూడా కొయ్యకూ, రాళ్లకూ పూజిస్తాం’ అని మీరు అనుకుంటున్నారు. మీ మనస్సులో ఏర్పడుతున్న ఈ ఆలోచన ఎన్నటికీ నెరవేరదు.
33నా జీవం తోడు, నా బలమైన చేతితో, ఉగ్రతతో, ఎత్తిన చేతితో నీ మీద రాజ్యపాలన చేస్తాను. 34నేను ఉగ్రత కుమ్మరిస్తూ, బలమైన చేతితోనూ, ఎత్తిన చేతితోనూ మిమ్మల్ని చెదరగొట్టిన అనేక దేశాల్లోనుంచ, ప్రజల్లోనుంచి నేను మిమ్మల్ని సమకూర్చి 35జనాలున్న ఎడారిలోకి మిమ్మల్ని రప్పించి, అక్కడ ముఖాముఖిగా మీకు తీర్పు చెబుతాను. ఇదే యెహోవా వాక్కు.
36ఐగుప్తీయుల దేశపు ఎడారిలో నేను మీ పితరులకు తీర్పు చెప్పినట్టు మీకూ తీర్పు చెబుతాను.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 37“నా చేతి కర్ర కింద మిమ్మల్ని దాటించి నిబంధన ఒడంబడికలోకి మిమ్మల్ని తీసుకొస్తాను. 38నా మీద తిరుగుబాటు చేసేవాళ్ళనూ, దోషం చేసేవాళ్ళనూ, మీలో ఉండకుండాా ప్రక్షాళన చేస్తాను. వారు కాపురమున్న దేశంలో నుంచి వాళ్ళను రప్పిస్తాను గాని, నేను యెహోవానని మీరు తెలుసుకునేలా, వారు ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించరు.”
39ఇశ్రాయేలు ఇంటివారలారా, ప్రభువైన యెహోవా మీతో చెప్పేదేమంటే “మీరు నామాట వినకపోతే, మీరు పెట్టుకున్న విగ్రహాలు మీ కిష్టమైనట్టుగా పూజించుకోండి, కాని మీ అర్పణల వల్ల, మీ విగ్రహాల వల్ల, నా పవిత్రమైన పేరును అపవిత్రం చెయ్యొద్దు.”
40ఇది ప్రభువైన యెహోవా వాక్కు. “ఇశ్రాయేలీయుల ఎత్తయిన నా పవిత్ర పర్వతం మీద దేశంలో ఉన్న ఇశ్రాయేలీయుల ఇంటి వాళ్ళందరూ నన్ను ఆరాధిస్తారు. అక్కడ నేను వాళ్ళ పట్ల సంతోషిస్తాను. అక్కడ మీ ప్రతిష్ఠిత అర్పణలు, మీ ప్రథమ ఫలదానాలూ, ప్రతిష్ఠిత కానుకలన్నీ నేను అంగీకరిస్తాను. 41దేశాల్లో నుంచి నేను మిమ్మల్ని రప్పించేటప్పుడు, మిమ్మల్ని చెదరగొట్టిన అనేక దేశాల్లో నుంచి మిమ్మల్ని సమకూర్చేటప్పుడు, ఒక పరిమళ ధూపంగా మిమ్మల్ని అంగీకరిస్తాను. అన్యప్రజల ఎదుటా, మీ మధ్యలోనూ, నన్ను నేను పవిత్రం చేసుకుంటాను.
42మీ పితరులకు ఇస్తానని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశానికి, అంటే ఇశ్రాయేలీయుల దేశానికి నేను మిమ్మల్ని రప్పించేటప్పుడు, నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. 43అక్కడ చేరి, మీ ప్రవర్తనను, మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకున్న మీ పనులన్నిటినీ గుర్తు చేసుకుని మీరు చేసిన చెడుపనులన్నిటిని బట్టి మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు. 44ఇశ్రాయేలీయులారా, మీ దుర్మార్గతను బట్టి, మీ చెడు చేష్టలను బట్టి కాక నా పేరును బట్టి మాత్రమే నేను మీ పట్ల ఈ విధంగా చేసినప్పుడు, నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.”
దక్షిణ దేశం పై ప్రవచనం
45ఇదే యెహోవా వాక్కు. యెహోవా వాక్కు మళ్ళీ నాకు వినిపించింది. 46“నరపుత్రుడా, నీ ముఖం దక్షిణం వైపు తిప్పుకుని దక్షిణ దేశానికి ప్రకటించు, దక్షిణ దేశపు ఎడారి అరణ్యాన్ని గూర్చి ప్రవచించి ఇలా చెప్పు, 47దక్షిణ దేశమా, యెహోవా మాట ఆలకించు, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, నీలో అగ్ని రగిలిస్తాను. అది నీలో ఉన్న పచ్చని పళ్ళ చెట్లన్నిటినీ, ఎండిన చెట్లన్నిటినీ కాల్చేస్తుంది. అది ఆరిపోదు. దక్షిణం మొదలుకుని ఉత్తరం వరకూ భూతలమంతా ఆ భీకరమైన అగ్ని దహిస్తుంది.
48అది ఆరిపోకుండా ఉండగా యెహోవానైన నేను దాన్ని రగిలించానని మనుషులందరూ చూస్తారు.” 49అప్పుడు నేను ఇలా అన్నాను “అయ్యో ప్రభూ, యెహోవా, వాళ్ళు నా గురించి, ‘వీడు కేవలం ఉపమానాలు చెప్పేవాడేగదా?’ అంటున్నారు.”
Currently Selected:
యెహె 20: IRVTel
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.