YouVersion Logo
Search Icon

ద్వితీ 26

26
మొదట పండిన పంటలు, పదోవంతులు
1మీ దేవుడైన యెహోవా మీకు వారసత్వంగా అనుగ్రహించే దేశానికి మీరు చేరుకుని దాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసిస్తున్నప్పుడు 2మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న మీ భూమిలో నుంచి మీరు కూర్చుకొనే పంటలన్నిట్లో మొదట పండిన పంటలో కొంత భాగాన్ని తీసుకుని ఒక గంపలో ఉంచి, మీ దేవుడైన యెహోవా తనకు మందిరంగా ఏర్పరచుకొనే స్థలానికి తీసుకువెళ్ళాలి.
3ఆ సమయంలో సేవ జరిగిస్తున్న యాజకుని దగ్గరికి వెళ్లి “యెహోవా మన పితరులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి నేను వచ్చానన్న విషయాన్ని ఈ రోజు మీ దేవుడైన యెహోవా ముందు ఒప్పుకుంటున్నాను” అని అతనితో చెప్పాలి. 4యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుంచి తీసుకుని మీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట ఉంచాలి.
5మీ దేవుడైన యెహోవా ఎదుట నువ్వు ఇలా చెప్పాలి. “నా పూర్వీకుడు #26:5 ధ్వంసం చేస్తూ దోచుకుంటూ ఉండే.సంచారం చేసే అరామీ దేశస్థుడు. అతడు కొద్దిమందితో ఐగుప్తు వెళ్లి అక్కడ పరదేశిగా ఉండిపోయాడు. అతడు అక్కడికి వెళ్లి అసంఖ్యాకంగా వృద్ధి పొంది గొప్పదైన, బలమైన జనసమూహం అయ్యాడు. 6ఐగుప్తీయులు మనలను హింసించి, బాధించి మన మీద కఠినమైన దాస్యం మోపారు. 7మనం మన పూర్వీకుల దేవుడైన యెహోవాకు మొరపెట్టాం. యెహోవా మన మొర విని, మన బాధ, ప్రయాస, మనకు కలిగిన హింసను చూశాడు. 8యెహోవా తన బలిష్టమైన చేతితో, తన బలప్రదర్శనతో, తీవ్రమైన భయం కలిగించే కార్యాలతో, అద్భుతమైన సూచనలతో ఐగుప్తు నుంచి మనలను బయటకు రప్పించాడు. 9ఈ స్థలానికి మనలను రప్పించి #26:9 సారవంతమైనపాలు తేనెలు పారుతూ ఉన్న ఈ దేశాన్ని మనకిచ్చాడు.
10కాబట్టి యెహోవా, నువ్వే నాకిచ్చిన భూమి ప్రథమ ఫలాలు నేను తెచ్చి నీ ఎదుట ఉంచాను.” ఇలా చెప్పిదాన్ని మీ దేవుడైన యెహోవా ఎదుట ఉంచి ఆయనను ఆరాధించాలి. 11నీకూ, నీ ఇంటి వారికీ నీ దేవుడైన యెహోవా అనుగ్రహించిన మేలులన్నిటి గురించి నువ్వూ, లేవీయులూ నీ దేశంలో ఉన్న పరదేశులూ సంతోషించాలి.
12పదవ భాగమిచ్చే మూడవ సంవత్సరం నీ రాబడిలో పదవ వంతు చెల్లించి, అది లేవీయులకూ పరదేశులకూ, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ ఇవ్వాలి. వారు నీ ఊరిలో వాటిని తిని తృప్తి పొందిన తరువాత 13నువ్వు మీ యెహోవా దేవుని ఎదుట నువ్వు నాకాజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి ప్రకారం “నా ఇంటి నుంచి ప్రతిష్ట చేసిన వాటిని విభజించి లేవీయులకూ పరదేశులకు తండ్రి లేనివారికీ విధవరాళ్లకూ ఇచ్చాను. నీ ఆజ్ఞల్లో దేనినీ నేను మీరలేదు, దేనినీ మరచిపోలేదు. 14నా దుఃఖ సమయంలో దానిలో కొంచెమైనా నేను తినలేదు, అపవిత్రంగా ఉన్న సమయంలో దానిలో నుండి దేనినీ తీసివేయలేదు. చనిపోయిన వారి కోసం దానిలో నుండి ఏదీ ఇవ్వలేదు. నా దేవుడైన యెహోవా మాట విని, నువ్వు నా కాజ్ఞాపించినట్టు అంతా జరిగించాను. 15నువ్వు నివసించే నీ పరిశుద్ధ స్థలం, పరలోకం నుంచి చూసి, నీ ప్రజలైన ఇశ్రాయేలును దీవించు. పాలు తేనెలు ప్రవహించే దేశం అని నువ్వు మా పితరులతో ప్రమాణం చేసి, మాకిచ్చిన దేశాన్ని దీవించు” అని చెప్పాలి.
దేవుని ఆజ్ఞలను అనుసరించడం
16ఈ కట్టుబాట్లకు, ఆజ్ఞలకూ లోబడి ఉండాలని మీ దేవుడైన యెహోవా ఈనాడు మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి మీరు మీ హృదయ పూర్వకంగా మీ పూర్ణ మనసుతో వాటిని అనుసరించి నడుచుకోవాలి. 17యెహోవాయే మీకు దేవుడుగా ఉన్నాడనీ మీరు ఆయన మార్గాల్లో నడిచి, ఆయన చట్టాలనూ, ఆజ్ఞలనూ, విధులనూ అనుసరిస్తూ ఆయన మాట వింటామనీ ఈనాడు ఆయనకు మాట ఇచ్చారు. 18యెహోవా మీతో చెప్పినట్టు మీరే ఆయనకు సొంత ప్రజలుగా ఉంటూ ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొంటారని 19ఆయన సృజించిన అన్ని జాతుల ప్రజలందరి కంటే మీకు కీర్తి, ఘనత, పేరు కలిగేలా మిమ్మల్ని హెచ్చిస్తానని యెహోవా ఈనాడు ప్రకటించాడు. ఆయన చెప్పినట్టుగా మీరు మీ యెహోవా దేవునికి పవిత్ర ప్రజగా ఉంటారనీ ప్రకటించాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in