YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 6

6
ప్రథమ సంఘ పరిచారకులు
1ఆ రోజుల్లో శిష్యుల సంఖ్య పెరుగుతున్నపుడు రోజువారీ భోజనాల వడ్డనల్లో తమలోని విధవరాళ్ళను చిన్నచూపు చూస్తున్నారని గ్రీకు భాష మాట్లాడే యూదులు హీబ్రూ భాష మాట్లాడే యూదుల మీద ఫిర్యాదు చేశారు.
2అప్పుడు పన్నెండుమంది అపొస్తలులు శిష్యుల సమూహాన్ని తమ దగ్గరికి పిలిచి, “మేము దేవుని వాక్యాన్ని బోధించడం మాని భోజనాలు వడ్డించడం మంచిది కాదు. 3కాబట్టి సోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండిన వారై, మంచి పేరున్న ఏడుగురిని మీలో ఏర్పరచుకోండి. మేము వారిని ఈ పనికి నియమిస్తాం. 4మేము మాత్రం ప్రార్థనలోనూ, వాక్య పరిచర్యలోనూ కొనసాగుతూ ఉంటాం” అన్నారు.
5ఈ మాట అందరికీ నచ్చింది. కాబట్టి, వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండి ఉన్న స్తెఫను, ఇంకా ఫిలిప్పు, ప్రొకొరు, నీకానోరు, సీమోను, పర్మెనాసు, యూదామతంలోకి మారిన అంతియొకయ నివాసి నీకొలాసు అనేవారిని ఎంచుకున్నారు. 6వారిని అపొస్తలుల ముందుంచారు. అపొస్తలులు ప్రార్థన చేసి వారిమీద చేతులుంచారు.
7దేవుని వాక్కు అంతకంతకూ వ్యాపించి శిష్యుల సంఖ్య యెరూషలేములో పెరిగిపోయింది. యాజకుల్లో కూడా చాలామంది విశ్వసించారు.
మూడవ హింసాకాండ: మహాసభ ఎదుట స్తెఫను
8స్తెఫను కృపతో, బలంతో నిండి ప్రజల మధ్య అద్భుతాలనూ గొప్ప సూచక క్రియలనూ చేస్తున్నాడు. 9అయితే ‘స్వతంత్రుల సమాజం’ అనే చెందినవారూ, కురేనీయులూ, అలెగ్జాండ్రియా వారు, కిలికియ, ఆసియాకు చెందిన కొంత మందీ వచ్చి స్తెఫనుతో తర్కించారు గాని 10అతని మాటల్లోని తెలివినీ, అతనిని ప్రేరేపించిన ఆత్మనూ వారు ఎదిరించలేక పోయారు.
11అప్పుడు వారు ‘వీడు మోషే మీదా దేవుని మీదా దూషణ మాటలు పలుకుతుంటే మేము విన్నాము’ అని చెప్పడానికి రహస్యంగా కొంతమందిని కుదుర్చుకున్నారు. 12ప్రజలను, పెద్దలను, ధర్మ శాస్త్ర పండితులనూ రేపి అతని మీదికి వచ్చి అతణ్ణి పట్టుకుని మహాసభ ఎదుటికి తీసుకు పోయారు. 13అబద్ధ సాక్షులను నిలబెట్టారు. వారు, “ఈ వ్యక్తి ఎప్పుడూ ఈ పరిశుద్ధ స్థలానికీ మన ధర్మశాస్త్రానికీ విరోధంగా మాట్లాడుతున్నాడు. 14నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారాలను మారుస్తాడని వీడు చెప్పగా మేము విన్నాము” అని చెప్పారు.
15సభలో కూర్చున్న వారంతా అతని వైపు తేరి చూసినపుడు అతని ముఖం దేవదూత ముఖంలా వారికి కనబడింది.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in