రోమా 13
13
1ప్రతివాడును పై అధికారులకు లోబడియుండ .వలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి. 2కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. 3-4ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండ కోరితివా, మేలుచేయుము, అప్పుడు వారిచేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు; కీడుచేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారముచేయు దేవుని పరిచారకులు. 5కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షినిబట్టియు లోబడియుండుట ఆవశ్యకము. 6ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు. 7ఇందుకే గదా మీరు పన్ను కూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండవలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మాన ముండవలెనో వానియెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి.
8ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. 9ఏలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిల వద్దు, ఆశింపవద్దు అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్నయెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి. 10ప్రేమ పొరుగువానికి కీడుచేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.
11మరియు మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళ యైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వా సులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. 12రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకారక్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించు కొందము. 13అల్లరితోకూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు, కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము. 14మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచనచేసికొనకుడి.
Currently Selected:
రోమా 13: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.