YouVersion Logo
Search Icon

ప్రకటన 9

9
1అయిదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశమునుండి భూమిమీద రాలిన యొక నక్షత్రమును చూచితిని. అగాధముయొక్క తాళపుచెవి అతనికి ఇయ్యబడెను. 2అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలోనుండి లేచు పొగవంటి పొగ ఆ అగాధములోనుండి లేచెను; ఆ అగాధములోని పొగచేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను. 3ఆ పొగలోనుండి మిడతలు భూమి మీదికి వచ్చెను, భూమిలోఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. 4మరియు నొసళ్లయందు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. 5మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని అయిదు నెలలవరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటివలన కలుగు బాధ, తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధవలె ఉండును. 6ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు; చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారియొద్దనుండి పారిపోవును. 7ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుఱ్ఱములను పోలి యున్నవి. బంగారమువలె మెరయు కిరీటములవంటివి వాటి తలలమీద ఉండెను; వాటి ముఖములు మనుష్య ముఖములవంటివి, 8స్త్రీల తలవెండ్రుకలవంటి వెండ్రు కలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరలవలె ఉండెను. 9ఇనుప మైమరువులవంటి మైమరువులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తు నట్టి విస్తారమైన గుఱ్ఱపు రథముల ధ్వనివలె ఉండెను. 10తేళ్లతోకలవంటి తోకలును కొండ్లును వాటికుండెను. అయిదు నెలలవరకు వాటి తోకలచేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను. 11పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను.#9:11 అనగా–నాశము చేయువాడు.
12మొదటి శ్రమ గతించెను; ఇదిగో మరి రెండు శ్రమలు ఇటుతరువాత వచ్చును.
13-14ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవునియెదుట ఉన్న సువర్ణ బలిపీఠముయొక్క కొమ్ములనుండి యొక స్వరము –యూఫ్రటీసు అను మహానదియొద్ద బంధింపబడియున్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని యున్న ఆయారవ దూతతో చెప్పుట వింటిని. 15మనుష్యులలో మూడవభాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడియుండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్ట బడిరి. 16గుఱ్ఱపురౌతుల సైన్యముల లెక్క యిరువది కోట్లు; వారి లెక్క యింత అని నేను వింటిని. 17మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని. ఆ గుఱ్ఱములకును వాటి మీద కూర్చుండియున్నవారికిని, నిప్పువలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధకవర్ణముల మైమరువు లుండెను. ఆ గుఱ్ఱముల తలలు సింహపు తలలవంటివి, వాటి నోళ్లలోనుండి అగ్ని ధూమగంధకములు బయలు వెడలుచుండెను. 18ఈ మూడు దెబ్బలచేత, అనగా వీటి నోళ్లలోనుండి బయలువెడలుచున్న అగ్ని ధూమగంధకములచేత, మనుష్యులలో మూడవభాగము చంపబడెను, 19ఆ గుఱ్ఱముల బలము వాటి నోళ్లయందును వాటి తోకలయందును ఉన్నది, ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటిచేత అవి హాని చేయును. 20ఈ దెబ్బలచేత చావక మిగిలిన జనులు, దయ్యములను, చూడను వినను నడువను శక్తిలేనివై, బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్త కృతములైన విగ్రహములను పూజింపకుండ విడిచిపెట్టునట్లు మారుమనస్సు పొందలేదు. 21మరియు తాము చేయుచున్న నరహత్యలును మాయమంత్రములును జారచోరత్వములును చేయకుండునట్లువారు మారుమనస్సు పొందినవారు కారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in