YouVersion Logo
Search Icon

సామెతలు 12

12
1శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు
గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు
2సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును
దురాలోచనలుగలవాడు నేరస్థుడని ఆయన తీర్పుతీర్చును.
3భక్తిహీనతవలన ఎవరును స్థిరపరచబడరు
నీతిమంతుల వేరు కదలదు
4యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము
సిగ్గు తెచ్చునది వాని యెముకలకు కుళ్లు.
5నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు
భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు.
6భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి
వంటివి
యథార్థవంతుల నోరు వారిని విడిపించును.
7భక్తిహీనులు పాడై లేకపోవుదురు
నీతిమంతుల యిల్లు నిలుచును.
8ఒక్కొక్క మనుష్యుడు తన వివేకముకొలది పొగడబడును
కుటిలచిత్తుడు తృణీకరింపబడును.
9ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకొను
వానికంటె
దాసుడుగల అల్పుడు గొప్పవాడు.
10నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో
చూచును
భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే.
11తన భూమిని సేద్యపరచుకొనువానికి ఆహారము సమృద్ధిగా కలుగును
వ్యర్థమైనవాటిని అనుసరించువాడు బుద్ధిలేనివాడు.
12భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడుసొమ్మును అపేక్షించుదురు
నీతిమంతుల వేరు చిగుర్చును.
13పెదవులవలని దోషము అపాయకరమైన ఉరి
నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును.
14ఒకడు తన నోటి ఫలముచేత తృప్తిగా మేలుపొందును
ఎవని క్రియల ఫలము వానికి వచ్చును.
15మూఢుని మార్గము వాని దృష్టికి సరియైనది
జ్ఞానముగలవాడు ఆలోచన నంగీకరించును.
16మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును
వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును.
17సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును
కూటసాక్షి మోసపు మాటలు చెప్పును.
18కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు
జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.
19నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై యుండును
అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును.
20కీడు కల్పించువారి హృదయములో మోసముకలదు
సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోష
భరితులగుదురు.
21నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు.
భక్తిహీనులు కీడుతో నిండియుందురు.
22అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు
సత్యవర్తనులు ఆయనకిష్టులు.
23వివేకియైనవాడు తన విద్యను దాచి పెట్టును
అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి
చేయుదురు.
24శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు
సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును.
25ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును
దయగల మాట దాని సంతోషపెట్టును.
26నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును
భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును.
27సోమరి వేటాడినను పట్టుకొనడు
చురుకుగా నుండుట గొప్ప భాగ్యము.
28నీతిమార్గమునందు జీవము కలదు
దాని త్రోవలో మరణమే లేదు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in