ఫిలిప్పీయులకు 2:12-30
ఫిలిప్పీయులకు 2:12-30 TELUBSI
కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులై యున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాల మందును, భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖైమెన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి. అట్టి జనముమధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్‌ప్రయోజనము కాలేదనియు క్రీస్తుదినమున నాకు అతిశయకారణము కలుగును. మరియు మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేనానందించి మీ యందరితోకూడ సంతోషింతును. ఇటు వలెనే మీరును ఆనందించి నాతోకూడ సంతోషించుడి. నేనును మీ క్షేమము తెలిసికొని ధైర్యము తెచ్చు కొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీయొద్దకు పంపు టకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమవిషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడెవడును నాయొద్ద లేడు. అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని, యేసు క్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడేలాగు సేవచేయునో ఆలాగే అతడు నాతోకూడ సువార్తవ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవింపనైయున్నదో చూచినవెంటనే అతనిని పంపవలెనని అనుకొనుచున్నాను. నేనును శీఘ్రముగా వచ్చెదనని ప్రభువునుబట్టి నమ్ము చున్నాను. మరియు నా సహోదరుడును, జతపనివాడును, నాతోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించినవాడునైన ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగియాయెనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరిని చూడ మిగుల అపేక్షగలవాడై విచారపడు చుండెను. నిజముగా అతడు రోగియై చావునకు సిద్ధమై యుండెను గాని దేవుడతనిని కనికరించెను; అతనిమాత్రమే గాక నాకు దుఃఖముమీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరల సంతోషించునిమిత్తమును నా కున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా యెడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తుయొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమైయుండెను గనుక పూర్ణా నందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి.