సంఖ్యాకాండము 22
22
1తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి. 2సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. 3జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి; మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. 4మోయాబీయులు మిద్యాను పెద్దలతో –ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టు ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయు ననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. 5కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నదియొద్దనున్న పెతోరుకు దూతలచేత ఈ వర్తమానము పంపెను–చిత్తగించుము; ఒక జనము ఐగుప్తులోనుండి వచ్చెను; ఇదిగో వారు భూతలమును కప్పి నా యెదుట దిగియున్నారు. 6కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము; వారు నాకంటె బలవంతులు; వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో; అప్పుడు నేను ఈ దేశములోనుండి వారిని తోలివేయుదును; ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపించబడుననియు నేనెరుగుదును. 7కాబట్టి మోయాబు పెద్దలును మిద్యాను పెద్దలును సోదె సొమ్మును చేతపట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా 8అతడు వారితో–యీ రాత్రి ఇక్కడనే ఉండుడి; యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదననెను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నొద్ద బసచేసిరి. 9దేవుడు బిలామునొద్దకు వచ్చి–నీ యొద్దనున్న యీ మనుష్యులు ఎవరని అడుగగా 10బిలాము దేవునితో యిట్లనెను–సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు 11–చిత్తగించుము; ఒక జనము ఐగుప్తునుండి బయలుదేరి వచ్చెను; వారు భూతలమును కప్పుచున్నారు; నీవు ఇప్పుడేవచ్చి నా నిమిత్తము వారిని శపింపుము; నేను వారితో యుద్ధముచేసి వారిని తోలివేయుదునేమో అని వీరిచేత నాకు వర్తమానము పంపెను. 12అందుకు దేవుడు–నీవు వారితో వెళ్లకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాముతో చెప్పెను. 13కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో–మీరు మీ స్వదేశమునకు వెళ్లుడి; మీతోకూడ వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడనగా 14మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్లి–బిలాము మాతోకూడ రానొల్లడాయెననిరి. 15అయినను బాలాకు వారి కంటె బహు ఘనతవహించిన మరి యెక్కువ మంది అధికారులను మరల పంపెను. 16వారు బిలామునొద్దకు వచ్చి అతనితో–నీవు దయచేసి నాయొద్దకు వచ్చుటకు ఏమియు అడ్డము చెప్పకుము. 17నేను నీకు బహు ఘనత కలుగజేసెదను; నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసెదను గనుక నీవు దయచేసి వచ్చి, నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెననిరి. 18అందుకు బిలాము–బాలాకు తన యింటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్దిపనినైనను గొప్పపనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటిమాట మీరలేను. 19కాబట్టి మీరు దయచేసి యీ రాత్రి ఇక్కడ నుండుడి; యెహోవా నాతోనిక నేమి చెప్పునో నేను తెలిసికొందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను. 20ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకువచ్చి–ఆ మనుష్యులు నిన్ను పిలువవచ్చినయెడల నీవు లేచి వారితో వెళ్లుము; అయితే నేను నీతో చెప్పిన మాటచొప్పుననే నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చెను. 21ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతోకూడ వెళ్లెను. 22అతడు వెళ్లుచుండగా దేవుని కోపము రగులుకొనెను; యెహోవాదూత అతనికి విరోధియై త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితోకూడ నుండిరి. 23యెహోవాదూత ఖడ్గము దూసి చేతపట్టుకొని త్రోవలో నిలిచి యుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాని కొట్టగా 24యెహోవాదూత యిరుప్రక్కలను గోడలుగల ద్రాక్షతోటల సందులో నిలిచెను. 25గాడిద యెహోవాదూతను చూచి గోడమీదపడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాని మరల కొట్టెను. 26యెహోవాదూత ముందు వెళ్లుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని యిరుకు చోటను నిలువగా 27గాడిద యెహోవాదూతను చూచి బిలాముతోకూడ క్రింద కూలబడెను గనుక బిలాము కోపముమండి తన చేతి కఱ్ఱతో గాడిదను కొట్టెను. 28అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు నిచ్చెను గనుక అది–నీవు నన్ను ముమ్మారు కొట్టితివి; నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా 29బిలాము–నీవు నామీద తిరుగబడితివి; నాచేత ఖడ్గమున్నయెడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. 30అందుకు గాడిద– నేను నీదాననైనది మొదలుకొని నేటివరకు నీవు ఎక్కుచు వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైన నీకిట్లు చేయుట కద్దా? అని బిలాముతో అనగా అతడు–లేదనెను. 31అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక, దూసిన ఖడ్గము చేతపట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవాదూతను అతడు చూచి తలవంచి సాష్టాంగ నమస్కారముచేయగా 32యెహోవాదూత–యీ ముమ్మారు నీ గాడిదను నీవేల కొట్టితివి? ఇదిగో నా యెదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని. 33ఆ గాడిద నన్ను చూచి యీ ముమ్మారు నా యెదుటనుండి తొలిగెను; అది నా యెదుటనుండి తొలగని యెడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి యుందునని అతనితో చెప్పెను. 34అందుకు బిలాము–నేను పాపముచేసితిని; నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలి సినది కాదు. కాబట్టి యీ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్లెదనని యెహోవాదూతతో చెప్పగా 35యెహోవాదూత–నీవు ఆ మనుష్యులతోకూడ వెళ్లుము. అయితే నేను నీతో చెప్పు మాటయేకాని మరేమియు పలుకకూడదని బిలాముతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతోకూడ వెళ్లెను. 36బిలాము వచ్చెనని బాలాకు విని, ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరమునందలి మోయాబు పట్టణమువరకు అతనిని ఎదుర్కొన బయలువెళ్లగా 37బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీయొద్దకు దూతలను పంపియుంటిని గదా. నాయొద్దకు నీవేల రాకపోతివి? నిన్ను ఘనపరచ సమర్థుడను కానా? అనెను. 38అందుకు బిలాము–ఇదిగో నీయొద్దకు వచ్చితిని; అయిన నేమి? ఏదైనను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పెను. 39అప్పుడు బిలాము బాలాకుతోకూడ వెళ్లెను. వారు కిర్యత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు 40బాలాకు ఎడ్లను గొఱ్ఱెలను బలిగా అర్పించి, కొంతభాగము బిలాముకును అతనియొద్దనున్న అధికారులకును పంపెను. 41మరునాడు బాలాకు బిలామును తోడుకొనిపోయి, బయలుయొక్క ఉన్నతస్థలములమీదనుండి జనులను చివరవరకు చూడవలెనని అతనిని అచ్చోట ఎక్కించెను.
Currently Selected:
సంఖ్యాకాండము 22: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.