YouVersion Logo
Search Icon

సంఖ్యాకాండము 15

15
1మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను 2–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–నేను మీ కిచ్చుచున్న దేశనివాసములలో మీరు ప్రవేశించిన తరువాత 3యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోనిదానినేకాని, గొఱ్ఱె మేకలలోనిదానినేకాని, దహనబలిగానైనను, బలిగానైనను తెచ్చి, మ్రొక్కుబడి చెల్లించుటకనియో, స్వేచ్ఛార్పణగాననియో, నియామక కాలమందు అర్పించునదియనియో, దేనినైనను మీరు అర్పింపగోరినయెడల 4యెహోవాకు ఆ అర్పణము నర్పించువాడు ముప్పావు నూనెతో కలుపబడిన రెండు పళ్ల పిండిని నైవేద్యముగా తేవలెను. 5ఒక్కొక్క గొఱ్ఱెపిల్లతోకూడ దహనబలిమీదనేమి బలిమీదనేమి పోయుటకై ముప్పావు ద్రాక్షారసమును పానార్పణముగా సిద్ధపరచవలెను. 6పొట్టేలుతోకూడ పడి నూనెతో కలుపబడిన నాలుగు పళ్ల పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలెను. 7పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలెను; అది యెహోవాకు ఇంపైన సువాసన. 8మ్రొక్కుబడిని చెల్లించుటకైనను యెహోవాకు సమాధానబలి నర్పించుటకైనను నీవు దహనబలిగానైనను బలిగానైనను కోడెదూడను సిద్ధపరచినయెడల 9ఆ కోడెతోకూడ పడిన్నరనూనె కలుపబడిన ఆరుపళ్ల గోధుమపిండిని నైవేద్యముగా అర్పింపవలెను. 10మరియు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా 11పడిన్నర ద్రాక్షారసమును పానీయార్పణముగా తేవలెను; ఒక్కొక్క కోడెతోకూడను ఒక్కొక్క పొట్టేలుతోకూడను, గొఱ్ఱెలలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతోకూడను, ఆలాగు చేయవలెను. 12మీరు సిద్ధపరచువాటి లెక్కనుబట్టి వాటి లెక్కలో ప్రతిదానికిని అట్లు చేయవలెను. 13దేశములో పుట్టినవారందరు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమార్పణమును తెచ్చునప్పుడు ఆలాగుననే చేయవలెను. 14మీయొద్ద నివసించు పరదేశిగాని మీ తరతరములలో మీ మధ్యనున్నవాడెవడుగాని యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము అర్పింప గోరినప్పుడు మీరు చేయునట్లే అతడును చేయవలెను. 15సంఘమునకు, అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడ; అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ; యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశియు ఉండును. 16మీకును మీయొద్ద నివసించు పరదేశికిని ఒక్కటే యేర్పాటు, ఒక్కటే న్యాయవిధి యుండవలెను.
17యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము 18–నేను మిమ్మును కొని పోవుచున్న దేశములో మీరు ప్రవేశించిన తరువాత 19మీరు ఆ దేశపు ఆహారమును తినునప్పుడు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను. 20మీరు మీ మొదటి పిండిముద్ద రొట్టెను ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను; కళ్లపు అర్పణమువలె దాని అర్పింపవలెను. 21మీ తరతరములకు మీ మొదటి పిండిముద్దలోనుండి ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను.
22యెహోవా మోషేతో చెప్పిన యీ ఆజ్ఞలన్నిటిలో, అనగా 23యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైని మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించినవాటిలో పొరబాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు, అది సమాజమునకు తెలియ బడనియెడల 24సర్వసమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహనబలిగా ఒక కోడెదూడను, విధిచొప్పున దాని నైవేద్యమును దాని పానీయార్పణమును పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలెను. 25యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను; తెలియకయే దాని చేసెను గనుక క్షమింపబడును. వారు పొరబాటున చేసిన పాపములనుబట్టి తమ అర్పణమును, అనగా యెహోవాకు చెందవలసిన హోమమును పాపపరిహారార్థబలిని యెహోవా సన్నిధికి తీసికొని రావలెను. 26అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజమేమి, వారిమధ్యను నివసించు పరదేశియేమి క్షమాపణ నొందును; ఏలయనగా ప్రజలందరు తెలియకయే దాని చేయుట తటస్థించెను. 27ఒకడు పొరబాటున పాపము చేసినయెడలవాడు పాప పరిహారార్థబలిగా ఏడాది ఆడుమేక పిల్లను తీసికొని రావలెను. 28పొరబాటున యెహోవా సన్నిధిని దాని చేసెను గనుక తెలియకయే పాపముచేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును; వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలనవాడు క్షమాపణ నొందును. 29ఇశ్రాయేలీయులలో పుట్టినవాడేగాని వారిమధ్యను నివసించు పరదేశియేగాని పొరబాటున ఎవడైనను పాపము చేసినయెడల వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలెను. 30అయితే దేశమందు పుట్టినవాడేగాని పరదేశియేగాని యెవడైనను సాహసించి పాపముచేసినయెడల 31వాడు యెహోవాను తృణీకరించినవాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండ కొట్టి వేయబడును;వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును; వాని దోషశిక్షకు వాడే కారకుడు.
32ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతిదినమున కట్టెలు ఏరుట చూచిరి. 33వాడు కట్టెలు ఏరుట చూచినవారు మోషేయొద్దకును అహరోనునొద్దకును సర్వసమాజమునొద్దకును వానిని తీసికొని వచ్చిరి. 34వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. 35తరువాత యెహోవా–ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను. 36సర్వసమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాళెము వెలుపలికి వాని తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టెను.
37మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను 38–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. వారు తమ తర తరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసికొని అంచుల కుచ్చులమీద నీలిసూత్రము తగిలింపవలెను. 39-41మీరు నా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకముచేసికొని మీ దేవునికి ప్రతిష్ఠితులైయుండునట్లుమునుపటివలె కోరినవాటినిబట్టియు చూచినవాటినిబట్టియు వ్యభిచరింపక, దాని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకముచేసికొని వాటి ననుసరించుటకే అది మీకు కుచ్చుగానుండును. నేను మీకు దేవుడనై యుండునట్లుగా ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను; మీ దేవుడనైన యెహోవాను నేనే.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in