నెహెమ్యా 9
9
1ఈ నెల యిరువది నాలుగవ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకొని తలమీద ధూళి పోసికొని కూడి వచ్చిరి. 2ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలోనుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి, తమ పాపములను తమపితరుల పాపములను ఒప్పుకొనిరి. 3మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువ బడి, తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రగ్రంథమును చదువుచు వచ్చిరి, ఒక జాముసేపు తమ పాపములను ఒప్పు కొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. 4లేవీయులలో యేషూవ బానీ కద్మీయేలు షెబన్యా బున్నీ షేరేబ్యా బానీ కెనానీ అనువారు మెట్లమీద నిలువబడి, యెలుగెత్తి, తమ దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టిరి. 5అప్పుడు లేవీయులైన యేషూవ కద్మీయేలు బానీ హషబ్నెయా షేరేబ్యా హోదీయా షెబన్యా పెతహయా అనువారు–నిలువబడి, నిరంతరము మీకు దేవుడైయున్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగు స్తోత్రము చేసిరి–సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. 6నీవే, అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశసైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. 7దేవా యెహోవా, అబ్రామును ఏర్పరచుకొని, కల్దీయుల ఊరు అను స్థలము నుండి ఇవతలకు అతని రప్పించి అతనికి అబ్రాహామను పేరు పెట్టినవాడవు నీవే. 8అతడు నమ్మకమైన మనస్సుగల వాడని యెరిగి, కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు యెబూసీయులు గిర్గాషీయులు అనువారి దేశమును అతని సంతతివారికిచ్చునట్లు అతనితో నిబంధన చేసినవాడవు నీవే. 9నీవు నీతిమంతుడవై యుండి నీ మాటచొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందినశ్రమను నీవు చూచితివి, ఎఱ్ఱసముద్రమునొద్ద వారి మొఱ్ఱను నీవు వింటివి. 10ఫరోయు అతని దాసులందరును అతని దేశపు జనులందరును వారియెడల బహు గర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారియెదుట సూచకక్రియలను మహత్కార్యములను చూపించితివి. ఆలాగున చేయుటవలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధినొందితివి. 11మరియు నీ జనులయెదుట నీవు సముద్రమును విభాగించినందునవారు సముద్రము మధ్య పొడినేలను నడచిరి, ఒకడు లోతునీట రాయి వేసినట్లు వారిని తరిమినవారిని అగాధజలములలో నీవు పడవేసితివి. 12ఇదియుగాక పగటికాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును రాత్రికాలమందువారు వెళ్లవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్నిస్తంభములో ఉండినవాడవును అయి యుండి వారిని తోడుకొనిపోతివి. 13సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చి ఆకాశమునుండి వారితో మాటలాడి, వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలు కరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి. 14వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతిదినమును ఆచరింప నాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషేద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. 15వారి ఆకలి తీర్చుటకు ఆకాశమునుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండలోనుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణముచేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారికాజ్ఞాపించితివి. 16అయితే వారును మా పితరులును గర్వించి, లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గక పోయిరి. 17వారు విధేయులగుటకు మనస్సు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసికొనక తమ మనస్సును కఠినపరచుకొని, తాముండి వచ్చిన దాస్యపుదేశమునకు తిరిగి వెళ్లుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగు బాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడవునైయుండి వారిని విసర్జింపలేదు. 18వారు ఒక పోతదూడను చేసికొని–ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి, నీకు బహు విసుకు పుట్టించినను 19వారు ఎడారిలో ఉండగా నీవు బహువిస్తారమైన కృప కలిగినవాడవై వారిని విసర్జింపలేదు; మార్గముగుండ వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలు గిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపైనుండి వెళ్లిపోక నిలిచెను. 20వారికి బోధించుటకు నీ యుపకారాత్మను దయ చేసితివి, నీ విచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు; వారి దాహమునకు ఉదకమిచ్చితివి. 21నిజముగా అరణ్యములో ఏమియు తక్కువ కాకుండ నలువది సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకువాపు రాలేదు. 22ఇదియుగాక రాజ్యములను జనములను వారికప్పగించి, వారికి సరిహద్దులు ఏర్పరచితివి గనుక, వారు సీహోను అను హెష్బోను రాజుయొక్క దేశమును బాషానునకు రాజైన ఓగుయొక్క దేశమును స్వతంత్రించుకొనిరి. 23వారి సంతతిని ఆకాశపు నక్షత్రములంత విస్తారముగా చేసి, ప్రవేశించి స్వతంత్రించుకొనునట్లు వారి పితరులకు నీవు వాగ్దానముచేసిన దేశములోనికి వారిని రప్పింపగా 24ఆ సంతతివారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకొనిరి. నీవు కనానీయులను ఆ దేశవాసులను జయించి, తమకు మనస్సువచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశజనులను వారి చేతికి అప్పగించితివి. 25అప్పుడు వారు ప్రాకారములుగల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకొని, సకలమైన పదార్థములతో నిండియున్న యిండ్లను త్రవ్విన బావులను ద్రాక్షతోటలను ఒలీవతోటలను బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరచుకొనిరి. ఆలాగునవారుతిని తృప్తిపొంది మదించి నీ మహోపకారమునుబట్టి బహుగా సంతోషించిరి. 26అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటుచేసి, నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి, నీతట్టు తిరుగవలెనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుకు పుట్టించిరి. 27అందుచేత నీవు వారిని వారి శత్రువులచేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందువారు నీకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి, వారి శత్రువుల చేతిలోనుండి వారిని తప్పించుటకై నీ కృపాసంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి. 28వారు నెమ్మదిపొందిన తరువాత నీ యెదుట మరల ద్రోహులుకాగా నీవు వారిని వారి శత్రువులచేతికి అప్పగించితివి; వీరు వారిమీద అధికారము చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి నీ కృపచొప్పున అనేకమారులు వారిని విడిపించితివి. 29నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించినయెడల వాటివలనవాడు బ్రదుకునుగదా. వారు మరల నీ ధర్మశాస్త్రము ననుసరించి నడుచునట్లు నీవు వారిమీద సాక్ష్యము పలికినను, వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయములో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరచుకొని నీ మాట వినకపోయిరి. 30నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి, నీ ప్రవక్తలద్వారా నీ ఆత్మచేత వారిమీద సాక్ష్యము పలికితివిగాని వారు వినక పోయిరి; కాగా నీవు ఆయా దేశములలోనున్న జనులచేతికి వారిని అప్పగించితివి. 31అయితే నీవు మహోప కారివై యుండి, వారిని బొత్తిగా నాశనముచేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపాకనికరములుగల దేవుడవైయున్నావు. 32చేసిన నిబంధనను నిలు పుచు కృప చూపునట్టి మహాపరాక్రమశాలివియు భయంకరుడవునగు మా దేవా, అష్షూరు రాజుల దినములు మొదలుకొని యీ దినములవరకు మా మీదికిని మా రాజులమీదికిని ప్రధానులమీదికిని మా పితరులమీదికిని నీ జనులందరిమీదికిని వచ్చినశ్రమయంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండును గాక. 33మా మీదికి వచ్చినశ్రమ లన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడవే; నీవు సత్యము గానే ప్రవర్తించితివి కాని మేము దుర్మార్గులమైతిమి. 34మా రాజులుగాని మా ప్రధానులుగాని మా యాజకులుగాని మా పితరులుగాని నీ ధర్మశాస్త్రము ననుసరించి నడువలేదు. నీవు వారిమీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి. 35వారు తమ రాజ్య పరిపాలనకాలమందు నీవు తమ యెడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించియుండియు నిన్ను సేవింపకపోయిరి, తమ చెడు నడతలువిడిచి మారుమనస్సు పొందరైరి. 36చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము, దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించునట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమియందు మేము దాసులమై యున్నాము. 37మా పాపములనుబట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతివిస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరములమీదను మా పశువులమీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాల శ్రమలు కలుగుచున్నవి.
Currently Selected:
నెహెమ్యా 9: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.