YouVersion Logo
Search Icon

నెహెమ్యా 2

2
1అటుతరువాత అర్తహషస్త రాజు ఏలుబడికాలమున ఇరువదియవ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసికొని రాజునకు అందించితిని. అంతకు పూర్వము నేనెన్నడును అతనియెదుట విచారముగా ఉండలేదు. 2కాగా రాజు–నీకు వ్యాధిలేదు గదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయదుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా 3నేను మిగుల భయపడి–రాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి, దాని గుమ్మములును అగ్నిచేత కాల్చబడి యుండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. 4అప్పుడు రాజు –ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్నడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి 5రాజుతో–నీ సముఖమందు నేను దయపొందినయెడల, నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసితిని. 6అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చునియుండగా–నీ ప్రయాణము ఎన్నిదినములు పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చెదవని అడిగెను. నేను ఇంత కాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తముగలవాడాయెను. 7ఇదియుగాక రాజుతో నేనిట్లంటిని – రాజున కనుకూలమైతే యూదాదేశమున నేను చేరువరకు నన్ను దాటించునట్లుగా నది యవతలనున్న అధికారులకు తాకీదులను, 8పట్టణప్రాకారమునకును, మందిరముతో సంబంధించిన కోటగుమ్మములకును, నేను ప్రవేశింపబోవు ఇంటికిని, దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగితిని; ఆలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తముకొలది రాజు నా మనవి ఆలకించెను. 9తరువాత నేను నది యవతలనున్న అధికారులయొద్దకు వచ్చి వారికి రాజుయొక్క తాకీదులను అప్పగించితిని. రాజు నాతోకూడ సేనాధిపతులను గుఱ్ఱపురౌతులను పంపించెను.
10హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబీయా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి. 11అంతట నేను యెరూషలేమునకు వచ్చి మూడుదినములు అక్కడనేయుండి 12రాత్రియందు నేనును నాతోకూడ నున్న కొందరును లేచితిమి. యెరూషలేమునుగూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కియున్న పశువుతప్ప మరి యే పశువును నాయొద్ద ఉండలేదు. 13నేను రాత్రికాలమందు లోయద్వారముగుండ భుజంగపు బావియెదుటికిని పెంటద్వారము దగ్గరకును పోయి, పడద్రోయబడిన యెరూషలేముయొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి యుండెను. 14తరువాత నేను బుగ్గగుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్లితిని గాని, నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడము లేకపోయెను. 15నేను రాత్రియందు మడుగు దగ్గరనుండి పోయి ప్రాకారమును చూచినమీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో బడి తిరిగి వచ్చితిని. 16అయితే నేను ఎచ్చటికి వెళ్లినది యేమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకేగాని యాజకులకేగాని యజమానులకేగాని అధికారులకేగాని పనిచేయు ఇతరమైనవారికేగాని నేను ఆ సంగతి చెప్పి యుండలేదు. 17అయితే వారితో నేనిట్లంటిని–మనకు కలిగినశ్రమ మీకు తెలిసియున్నది, యెరూషలేము ఎట్లు పాడైపోయెనో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చ బడెనో మీరు చూచియున్నారు, మనకు ఇకమీదట నింద రాకుండ యెరూషలేముయొక్క ప్రాకారమును మరల కట్టుదము రండి. 18ఇదియుగాక నాకు సహాయముచేయు దేవుని కరుణాహస్తమునుగూర్చియు, రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నియు నేను వారితో చెప్పితిని. అందుకు వారు–మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి యీ మంచికార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. 19అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబీయా అనువాడును, అరబీయుడైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి–మీరు చేయుపనియేమిటి? రాజుమీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. 20అందుకు నేను–ఆకాశమందు నివాసియైన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము, యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనయైనను లేదని ప్రత్యుత్తరమిచ్చితిని.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in