YouVersion Logo
Search Icon

మత్తయి 9

9
1తరువాత ఆయన దోనె యెక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా 2ఇదిగో జనులు పక్ష వాయువుతో మంచముపెట్టియున్న యొకని ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. యేసు వారి విశ్వాసముచూచి –కుమారుడా#9:2 మూలభాషలో–బిడ్డా. ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. 3ఇదిగో శాస్త్రులలో కొందరు–ఇతడు దేవ దూషణ చేయుచున్నాడని తమలోతాము అనుకొనగా 4యేసు వారి తలంపులు గ్రహించి–మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? 5నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా, లేచి నడువుమని చెప్పుట సులభమా? 6అయినను పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచి–నీవు లేచి నీ మంచ మెత్తికొని నీ యింటికి పొమ్మని చెప్పగా 7-8వాడు లేచి తన యింటికి వెళ్లెను. జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి.
9యేసు అక్కడనుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి–నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. 10ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా ఇదిగో సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయనయొద్దను ఆయన శిష్యులయొద్దను కూర్చుండిరి. 11పరిసయ్యులు అది చూచి–మీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి యెందుకు భోజనముచేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి. 12ఆయన ఆ మాటవిని రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యు డక్కరలేదు గదా. 13అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక–కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను.
14అప్పుడు యోహాను శిష్యులు ఆయనయొద్దకు వచ్చి–పరిసయ్యులును, మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు; దీనికి హేతువేమని ఆయనను అడుగగా 15యేసు–పెండ్లికుమారుడు తమతోకూడ నుండు కాలమున పెండ్లియింటివారు దుఃఖపడగలరా? పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉప వాసము చేతురు. 16ఎవడును పాత బట్టకు క్రొత్తబట్ట మాసిక వేయడు; వేసినయెడల ఆ మాసిక బట్టను వెలితిపర చును చినుగు మరి ఎక్కువగును. 17మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు; పోసినయెడల తిత్తులు పిగిలి, ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక యుండునని చెప్పెను.
18ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె యిప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమెమీద ఉంచుము, ఆమె బ్రదుకుననెను. 19యేసు లేచి అతని వెంట వెళ్లెను; ఆయన శిష్యులు కూడ వెళ్లిరి. 20ఆ సమయమున, ఇదిగో పండ్రెండు సంవత్సరములనుండి రక్తస్రావ రోగముగల యొక స్త్రీ. 21–నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని, ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. 22యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి –కుమారీ, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియనుండి ఆ స్త్రీ బాగు పడెను. 23అంతలో యేసు ఆ అధికారి యింటికి వచ్చి, పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి. 24–స్థలమియ్యుడి; ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. 25జనసమూహమును పంపివేసి, ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. 26ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను.
27యేసు అక్కడనుండి వెళ్లుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి–దావీదు కుమారుడా, మమ్మును కనిక రించుమని కేకలువేసిరి. 28ఆయన యింట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయనయొద్దకు వచ్చిరి. యేసు–నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని వారి నడుగగా 29వారు–నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి–మీ నమ్మికచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో 30వారి కన్నులు తెరువబడెను. అప్పుడు యేసు–ఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. 31అయినను వారు వెళ్లి ఆ దేశ మంతట ఆయన కీర్తి ప్రచురముచేసిరి.
32యేసును ఆయన శిష్యులును వెళ్లుచుండగా కొందరు, దయ్యముపెట్టిన యొక మూగవాని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. 33దయ్యము వెళ్లగొట్టబడిన తరువాత ఆ మూగ వాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి–ఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడును కనబడలేదని చెప్పు కొనిరి. 34అయితే పరిసయ్యులు–ఇతడు దయ్యముల అధిపతివలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి.
35యేసు వారి సమాజమందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతివిధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేసెను. 36ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెల వలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడి 37– కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు 38గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడు కొనుడని తన శిష్యులతో చెప్పెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in