YouVersion Logo
Search Icon

మత్తయి 6:1-5, 7-34

మత్తయి 6:1-5 TELUBSI

మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి; లేనియెడల పర లోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యులవలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింప వద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియకయుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజమందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

మత్తయి 6:7-34 TELUBSI

మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు; మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగకమునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును; కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, –పర లోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖము లను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పై నను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై యుండును; నీలోనున్న వెలుగు చీకటియైయుండినయెడల ఆ చీకటి యెంతో గొప్పది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. అందువలన నేను మీతో చెప్పునదేమనగా–ఏమి తిందుమో యేమి త్రాగు దుమో అని మీ ప్రాణమునుగూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమునుగూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటె ప్రాణమును, వస్త్రము కంటె దేహమును గొప్పవి కావా? ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? వస్త్రములనుగూర్చి మీరు చింతింప నేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు అయినను తన సమస్త వైభవముతోకూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంక రించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి– ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.