YouVersion Logo
Search Icon

మత్తయి 20

20
1ఏలాగనగా–పరలోకరాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది. అతడు తన ద్రాక్షతోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి 2దినమునకు ఒక దేనారము#20:2 ఇది ఇంచుమించు అర్ధరూపాయి. చొప్పున పనివారితో ఒడబడి, తన ద్రాక్షతోటలోనికి వారిని పంపెను. 3తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి 4–మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి. 5దాదాపు పండ్రెండు గంటలకును, మూడు గంటలకును, అతడు మరల వెళ్లి, ఆలాగే చేసెను. 6తిరిగి దాదాపు అయిదు గంట లకు వెళ్లి, మరికొందరు నిలిచియుండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా 7వారు ఎవడును మమ్మును కూలికి పెట్టుకొన లేదనిరి. అందుకతడు మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడనెను. 8సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమానుడు తన గృహనిర్వాహకుని చూచి–పనివారిని పిలిచి, చివర వచ్చినవారు మొదలుకొని మొదట వచ్చిన వారివరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. 9దాదాపు అయిదు గంటలకు కూలికి కుదిరినవారు వచ్చి ఒక్కొక దేనారముచొప్పున తీసికొనిరి. 10మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకుననుకొనిరి గాని వారికిని ఒక్కొక దేనారముచొప్పుననే దొరకెను. 11-12వారది తీసికొని – చివర వచ్చిన వీరు ఒక్కగంట మాత్రమే పనిచేసినను, పగలంతయు కష్టపడి యెండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ యింటి యజమానునిమీద సణుగుకొనిరి. 13అందుకతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే; నీవు నాయొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసికొని పొమ్ము; 14నీ కిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది; 15నాకిష్టమువచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా#20:15 మూలభాషలో–నీ కన్ను చెడినదైయున్నదా. అని చెప్పెను. 16ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు.
17యేసు యెరూషలేమునకు వెళ్లనైయున్నప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులను ఏకాంతముగా తీసికొనిపోయి, మార్గమందు వారితో ఇట్లనెను. 18–ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; అక్కడ మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి 19ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవదినమున ఆయన మరల లేచును.
20అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయనయొద్దకు వచ్చి నమస్కారముచేసి యొక మనవి చేయబోగా 21–నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె నీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. 22అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు; నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగ గలరా? అని అడుగగా వారు–త్రాగగలమనిరి. 23ఆయన –మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా యెడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమునలేదు; నా తండ్రిచేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరకునని చెప్పెను. 24తక్కిన పదిమంది శిష్యులు ఈ మాట విని ఆ యిద్దరు సహోదరులమీద కోపపడిరి 25గనుక యేసు తనయొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారిమీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురనియు మీకు తెలియును. 26మీలో ఆలాగుండకూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను; 27మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను. 28ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.
29వారు యెరికోనుండి వెళ్లుచుండగా బహుజనసమూహము ఆయనవెంట వెళ్లెను. 30ఇదిగో త్రోవప్రక్కను కూర్చున్న యిద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్లు చున్నాడని విని ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలువేసిరి. 31ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకవేసిరి. 32యేసు నిలిచి వారిని పిలిచి– నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా 33వారు ప్రభువా, మా కన్నులు తెరవవలెననిరి. 34కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను; వెంటనే వారు దృష్టిపొంది ఆయన వెంట వెళ్లిరి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in