మత్తయి 18
18
1ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, 2ఆయన యొక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచి, వారిమధ్యను నిలువబెట్టి యిట్లనెను 3–మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 4కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు. 5మరియు ఈలాటి యొక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చు కొనును. 6నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు. 7అభ్యంతరములవలన లోకమునకు శ్రమ; అభ్యంతరములు రాక తప్పవు గాని, యెవనివలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ 8కాగా నీ చెయ్యియైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచినయెడల, దానిని నరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు చేతులును రెండు పాదములును కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటె కుంటివాడవుగనో అంగహీనుడవుగనో జీవములో ప్రవేశించుట నీకు మేలు. 9నీ కన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు కన్నులు గలిగి అగ్నిగల నరకములో పడవేయబడుటకంటె ఒక కన్ను గలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. 10ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. 11-12మీకేమి#18:11-12 అనేక ప్రాచీన ప్రతులలోఏలయనగా తప్పిపోయినదానిని రక్షించుటకై మనుష్యకుమారుడు వచ్చెను అని కూర్చబడియున్నది. తోచును? ఒక మనుష్యునికి నూరు గొఱ్ఱెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల తొంబదితొమ్మిదింటిని కొండలమీద విడిచివెళ్లి తప్పిపోయినదానిని వెదకడా? 13వాడు దాని కనుగొనినయెడల తొంబదితొమ్మిది గొఱ్ఱెలనుగూర్చి సంతోషించు నంతకంటె దానినిగూర్చి యెక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 14ఆలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తముకాదు.
15మరియు నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసినయెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. 16అతడు విననియెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతనియొద్దకు పొమ్ము. 17అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. 18భూమిమీద మీరు వేటిని బంధింతురో, అవి పరలోకమందును బంధింపబడును; భూమిమీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 19మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనినిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నాతండ్రివలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను. 20ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.
21ఆ సమయమున పేతురు ఆయనయొద్దకు వచ్చి– ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసినయెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా? అని అడిగెను. 22అందుకు యేసు అతనితో ఇట్లనెను–ఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను. 23కావున పరలోకరాజ్యము, తన దాసులయొద్ద లెక్క చూచుకొన గోరిన యొక రాజును పోలియున్నది. 24అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు, అతనికి పదివేల తలాంతులు#18:24 ఒక తలాంతు ఇంచుమించు 3,600 రూపాయిలు కావచ్చును. అచ్చియున్న యొకడు అతనియొద్దకు తేబడెను. 25అప్పు తీర్చుటకు వానియొద్ద ఏమియు లేనందున, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి, అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. 26కాబట్టి ఆ దాసుడు అతని యెదుట సాగిలపడి మ్రొక్కి–నాయెడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా 27ఆ దాసుని యజమానుడు కనికర పడి, వానిని విడిచిపెట్టి, వాని అప్పు క్షమించెను. 28అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు దేనారములు#18:28 ఒక దేనారము ఇంచుమించు అర్ధరూపాయి కావచ్చును. అచ్చియున్న తన తోడిదాసులలో ఒకనినిచూచి, వాని గొంతుపట్టుకొని–నీవు అచ్చియున్నది చెల్లింపు మనెను 29అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి–నా యెడల ఓర్చుకొనుము, నీకు చెల్లించెదనని వానిని వేడుకొనెను గాని 30వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించువరకు వానిని చెరసాలలో వేయించెను. 31కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి, మిక్కిలి దుఃఖపడి, వచ్చి, జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. 32అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి –చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని; 33నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా అని వానితో చెప్పెను. 34అందుచేత వాని యజమానుడు కోపపడి, తనకు అచ్చియున్నదంతయు చెల్లించువరకు బాధపరచువారికి వాని నప్పగించెను. 35మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆప్రకారమే మీయెడల చేయుననెను.
Currently Selected:
మత్తయి 18: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.