మత్తయి 15
15
1ఆ సమయమున యెరూషలేమునుండి శాస్త్రులును పరిసయ్యులును యేసునొద్దకు వచ్చి 2నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండ భోజనముచేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి 3అందుకాయన మీరును మీపారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? 4–తలిదండ్రులను ఘనపరచుమనియు, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలచిచ్చెను. 5మీరైతే– ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి –నావలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పినయెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. 6మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. 7-9వేషధారులారా –
ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు
అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి 10జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి; 11నోటపడునది మనుష్యుని అపవిత్ర పరచదు గాని నోటనుండి వచ్చున దియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను.
12అంతట ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా అని ఆయనను అడుగగా 13ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును. 14వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపినయెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను. 15అందుకు పేతురు ఈ ఉపమానభావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా 16ఆయన మీరును ఇంతవరకు అవివేకులైయున్నారా? 17నోటిలోనికి పోవునదంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని 18నోటనుండి బయటికి వచ్చునవి హృదయములోనుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? 19దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములోనుండియే వచ్చును 20ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను.
21-22యేసు అక్కడనుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లగా, ఇదిగో ఆ ప్రాంతములనుండి కనాను స్త్రీ యొకతె వచ్చి ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపెట్టి, బహు బాధపడుచున్నదని కేకలువేసెను. 23అందుకాయన ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి–ఈమె మన వెంబడి వచ్చి కేకలువేయు చున్నది గనుక ఈమెను పంపి వేయుమని ఆయనను వేడు కొనగా 24ఆయన–ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడ లేదనెను 25అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి– ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను. 26అందుకాయన–పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకువేయుట యుక్తము కాదని చెప్పగా 27ఆమె–నిజమే ప్రభువా, కుక్కపిల్లలు కూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. 28అందుకు యేసు –అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను.
29యేసు అక్కడనుండి వెళ్లి, గలిలయ సముద్రతీరమునకు వచ్చి, కొండ యెక్కి అక్కడ కూర్చుండగా 30బహుజనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనే కులను తీసికొనివచ్చి ఆయన పాదములయొద్ద పడవేసిరి; ఆయన వారిని స్వస్థపరచెను. 31మూగవారు మాటలాడుటయును అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి.
32అంతట యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడుదినములనుండి నాయొద్ద నున్నారు; వారికి తిన నేమియు లేదు గనుక వారిమీద కనికరపడుచున్నాను; వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా 33ఆయన శిష్యులు–ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్యప్రదేశములో మనకు ఎక్కడనుండి వచ్చునని ఆయనతో అనిరి. 34యేసు మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారి నడుగగా వారు–ఏడు రొట్టెలును కొన్ని చిన్న చేపలును ఉన్నవని చెప్పిరి. 35అప్పుడాయన– నేలమీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి 36ఆ యేడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను, శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి 37వారందరు తిని తృప్తి పొందినమీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండ ఎత్తిరి. 38స్త్రీలును పిల్లలును గాక తినినవారు నాలుగువేలమంది పురుషులు. 39తరువాత ఆయన జనసమూహములను పంపివేసి, దోనెయెక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను.
Currently Selected:
మత్తయి 15: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.