YouVersion Logo
Search Icon

మత్తయి 11

11
1యేసు తన పండ్రెండుమంది శిష్యులకు ఆజ్ఞాపించుట. చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడనుండి వెళ్లిపోయెను.
2క్రీస్తు చేయుచున్న కార్యములనుగూర్చి యోహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా, మేము మరి యొకనికొరకు కనిపెట్టవలెనా? 3అని ఆయనను అడుగుటకు తన శిష్యులనంపెను. 4యేసు వారిని చూచి– మీరు వెళ్లి, విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. 5గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. 6మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని యుత్తర మిచ్చెను. 7వారు వెళ్లిపోవుచుండగా యేసు యోహా నునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను –మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్లితిరి? 8సన్నపు బట్టలు ధరించుకొన్న మనుష్యునా? ఇదిగో–సన్నపు బట్టలు ధరించుకొనువారు రాజగృహములలో నుందురు గదా. 9మరి ఏమి చూడ వెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను.–
10ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపు
చున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును.
అని యెవనిగూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను 11స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడు. 12బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటివరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు. 13యోహాను కాలమువరకు ప్రవక్తలందరును ప్రవచించుచువచ్చిరి; ధర్మశాస్త్రము సహా ప్రవచించుచునుండెను. 14ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే. 15వినుటకు చెవులుగలవాడు వినుగాక. 16ఈ తరమువారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చునియుండి– 17మీకు పిల్లనగ్రోవి ఊదితిమిగాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితిమి గాని మీరు రొమ్ముకొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్ల కాయలను పోలియున్నారు. 18యోహాను తినకయు త్రాగకయువచ్చెను గనుక–వీడు దయ్యముపెట్టినవాడని వారనుచున్నారు. 19మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక–ఇదిగో వీడు తిండిబోతును మద్య పానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి#11:19 అనేక ప్రాచీన ప్రతులలో–దాని పిల్లలనుబట్టి అని పాఠాంతరము. తీర్పుపొందుననెను.
20పిమ్మట ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు మారుమనస్సు పొందకపోవుటవలన ఆయన వారి నిట్లు గద్దింపసాగెను. 21–అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీమధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుపట్టణములలో చేయబడినయెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారుమనస్సు పొంది యుందురు. 22విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. 23కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగి పోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడినయెడల అది నేటివరకు నిలిచియుండును. 24విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను.
25ఆ సమయమున యేసు చెప్పినదేమనగా–తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను. 26అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. 27సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశిం చునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. 28ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. 29నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. 30ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in