మలాకీ 1
1
1ఇశ్రాయేలీయులనుగూర్చి మలాకీద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. 2యెహోవా సెలవిచ్చునదేమనగా –నేను మీయెడల ప్రేమ చూపియున్నాను, అయితే మీరు–ఏ విషయమందు నీవు మాయెడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని; ఇదే యెహోవా వాక్కు. 3ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసితిని. 4మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములను మరల కట్టుకొందము రండని ఎదోమీయులు అనుకొందురు; అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–వారు కట్టుకొన్నను నేను వాటిని క్రింద పడద్రోయుదును; లోకులు–వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు, వారు యెహోవా నిత్యకోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. 5కన్నులార దానిని చూచి ఇశ్రాయేలీయుల సరిహద్దులలో#1:5 సరిహద్దులకావల. యెహోవా బహుఘనుడుగా ఉన్నాడని మీరందురు.
6కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా; నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? అని సైన్యములకధిపతియగు యెహోవా మిమ్మునడుగగా–ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు. 7నా బలిపీఠముమీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరచితిమని మీరందురు. యెహోవా భోజనపుబల్లను నీచపరచినందుచేతనే గదా 8గ్రుడ్డిదానిని తీసికొని బలిగా అర్పించినయెడల అది దోషముకాదా? కుంటిదానినైనను రోగముగలదానినైనను అర్పించినయెడల అది దోషముకాదా? అట్టివాటిని నీ యధికారికి నీవిచ్చినయెడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. 9దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి; మీ చేతనే గదా అది జరిగెను. ఆయన మిమ్మునుబట్టి యెవరినైన అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. 10మీలో ఒకడు నా బలిపీఠముమీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండినయెడల మేలు; మీయందు నాకిష్టములేదు, మీచేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 11తూర్పుదిశ మొదలుకొని పడమటి దిశవరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన యర్పణయును అర్పింపబడును, అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 12అయితే– యెహోవా భోజనపుబల్ల అపవిత్రమనియు, దానిమీద ఉంచియున్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు 13–అయ్యో, యెంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడినదానిని కుంటిదానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు; ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు; మీచేత నేనిట్టిదానిని అంగీకరింతునా? అని యెహోవా అడుగుచున్నాడు. 14నేను ఘనమైన మహారాజునైయున్నాను; అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగదియుండగా యెహోవాకు మ్రొక్కుబడిచేసి చెడిపోయినదానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు.
Currently Selected:
మలాకీ 1: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.