YouVersion Logo
Search Icon

లూకా 12:39-48

లూకా 12:39-48 TELUBSI

దొంగ యే గడియను వచ్చునో యింటి యజమానునికి తెలిసినయెడల అతడు మెలకువగా ఉండి, తన యింటికి కన్నము వేయనియ్యడని తెలిసికొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. అప్పుడు పేతురు–ప్రభువా, యీ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా అందరితోను చెప్పుచున్నావా? అని ఆయన నడుగగా ప్రభువు ఇట్లనెను–తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు, యజమానుడు తన యింటివారిమీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి, వాడు ఆలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగినదానియంతటిమీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు–నా యజమానుడు వచ్చుట కాలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని, దాసులను దాసీలనుకొట్టి, తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి, అపనమ్మకస్థులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్త మెరిగి యుండియు సిద్ధపడక, అతని చిత్తముచొప్పున జరిగింపకఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసినవానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు.