YouVersion Logo
Search Icon

లూకా 10

10
1అటుతరువాత ప్రభువు డెబ్బదిమంది యితరులను నియమించి, తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతిచోటికిని తనకంటె ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. 2పంపినప్పుడాయన వారితో ఇట్లనెను–కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. 3మీరు వెళ్లుడి; ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెపిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. 4మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసికొనిపోవద్దు; 5త్రోవలో ఎవనినైనను కుశలప్రశ్న లడుగవద్దు; మీరు ఏ యింటనైనను ప్రవేశించునప్పుడు–ఈ యింటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి. 6సమాధానపాత్రుడు#10:6 మూలభాషలో–సమాధాన కుమారుడు. అక్కడ నుండినయెడల మీ సమాధానము అతనిమీద నిలుచును; లేనియెడల అది మీకు తిరిగి వచ్చును. 7వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ యింటిలోనే యుండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరుగవద్దు. 8మరియు మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొంటే మీ ముందరపెట్టునవి తినుడి. 9అందులో నున్న రోగులను స్వస్థపరచుడి–దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చియున్నదని వారితో చెప్పుడి. 10మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొనక పోయినయెడల 11మీరు దాని వీధులలోనికి పోయి–మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడ మీ యెదుటనే దులిపివేయుచున్నాము; అయినను దేవుని రాజ్యము సమీపించియున్నదని తెలిసికొనుడని చెప్పుడి. 12ఆ పట్టణపు గతికంటె సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.
13అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడినయెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిదె వేసికొని కూర్చుండి మారుమనస్సు పొందియుందురు. 14అయినను విమర్శకాలమునందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వదగినదై యుండును. 15ఓ కపెర్నహూమా, ఆకా శము మట్టుకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగిపోయెదవు. 16మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపినవానిని నిరాకరించుననెను.
17ఆ డెబ్బదిమంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి –ప్రభువా, దయ్యములు కూడ నీ నామమువలన మాకు లోబడుచున్నవని చెప్పగా 18ఆయన–సాతాను మెరుపు వలె ఆకాశమునుండి పడుట చూచితిని. 19ఇదిగో పాము లను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీ కెంతమాత్రమును హానిచేయదు. 20అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడని వారితో చెప్పెను.
21ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి–తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించుచున్నాను; అవును తండ్రీ, ఆలాగు నీ దృష్టికి అనుకూల మాయెను. 22సమస్తమును నా తండ్రిచేత నాకు అప్పగింప బడియున్నది; కుమారుడెవడో, తండ్రి తప్ప మరెవడును ఎరుగడు; తండ్రి ఎవడో, కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలు పరచనుద్దేశించునోవాడును తప్ప, మరెవడును ఎరుగడని చెప్పెను. 23అప్పుడాయన తన శిష్యులవైపు తిరిగి–మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి; 24అనేకమంది ప్రవక్తలును రాజులును, మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని యేకాంతమందు వారితో అనెను.
25ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి– బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను. 26అందు కాయన–ధర్మశాస్త్రమందేమి వ్రాయబడియున్నది? నీ వేమి చదువుచున్నావని అతని నడుగగా 27అతడు–నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణవివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు, వ్రాయబడియున్నదని చెప్పెను. 28అందుకాయన–నీవు సరిగా ఉత్తరమిచ్చితివి; ఆలాగు చేయుము అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను. 29అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొనగోరి, అతడు–అవును గాని నా పొరుగువాడెవడని యేసునడిగెను. 30అందుకు యేసు ఇట్లనెను–ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోపట్టణమునకు దిగి వెళ్లుచు దొంగల చేతిలో చిక్కెను; వారు అతని బట్టలు దోచుకొని, అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. 31అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్లుట తటస్థించెను. అతడు అతనిని చూచి, ప్రక్కగా పోయెను. 32ఆలాగుననే లేవీయుడొకడు ఆ చోటికివచ్చి చూచి ప్రక్కగా పోయెను. 33అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు, అతడు పడియున్నచోటికి వచ్చి 34అతనిని చూచి, అతనిమీద జాలిపడి, దగ్గరకుపోయి, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, తన వాహనముమీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యింటికి తీసికొనిపోయి అతని పరామర్శించెను. 35మరునాడతడు రెండు దేనారములు#10:35 ఇది ఇంచుమించు ఒక రూపాయి కావచ్చును. తీసి ఆ పూట కూళ్లవానికిచ్చి–ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసినయెడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను. 36కాగా దొంగలచేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెనని నీకు తోచు చున్నది అని యేసు అడుగగా అతడు–అతనిమీద జాలి పడినవాడే అనెను. 37అందుకు యేసు–నీవును వెళ్లి ఆలాగు చేయుమని అతనితో చెప్పెను.
38అంతట వారు ప్రయాణమై పోవుచుండగా, ఆయన యొక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్ర్తీ ఆయనను తన యింట చేర్చుకొనెను. 39ఆమెకు మరియ అను సహోదరి యుండెను. ఈమె యేసు పాదములయొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. 40మార్త విస్తారమైన పని పెట్టుకొనుటచేత తొందరపడి, ఆయనయొద్దకు వచ్చి–ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున, నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను. 41అందుకు ప్రభువు –మార్తా, మార్తా, నీవనేకమైన పనులనుగూర్చి విచారముకలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే#10:41 అనేక ప్రాచీన ప్రతులలో–అవసరమైనవి కొన్నియే అని పాఠాంతరము. 42మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను.

Currently Selected:

లూకా 10: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in