లేవీయకాండము 4
4
1మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను 2–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము– యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనివిషయమైనను ఎవరైన పొరబాటున చేయరాని కార్యములు చేసి పాపియైనయెడల, ఎట్లనగా 3–ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసినయెడల, తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. 4అతడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసికొనివచ్చి కోడె తలమీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను 5అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను. 6ఆయాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరముయొక్క అడ్డతెర యెదుట ఆ రక్తములో కొంచెము ఏడు మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. 7అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ములమీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడెయొక్క రక్తశేషమంతయు పోయవలెను. 8మరియు అతడు పాపపరిహారార్థబలిరూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దానినుండి తీయవలెను. ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వంతటిని 9మూత్ర గ్రంథులను వాటిమీది డొక్కల పైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథుల పైనున్న కాలేజముమీది వపను 10సమాధాన బలియగు ఎద్దునుండి తీసినట్లు దీనినుండి తీయవలెను. యాజకుడు దహనబలిపీఠముమీద వాటిని ధూపము వేయవలెను. 11ఆ కోడెయొక్క శేషమంతయు, అనగా దాని చర్మము దాని మాంసమంతయు, దాని తల దాని కాళ్లు దాని ఆంత్రములు దాని పేడ 12పాళెము వెలుపల, బూడిదెను పారపోయు పవిత్ర స్థలమునకు తీసికొనిపోయి అగ్నిలో కట్టెలమీద కాల్చివేయవలెను. బూడిదె పారపోయు చోట దానిని కాల్చివేయవలెను.
13ఇశ్రాయేలీయుల సమాజమంతయు పొరబాటున ఏ తప్పిదముచేసి, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరానిపని చేసి అపరాధులైనయెడల 14వారు ఆయాజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడునప్పుడు, సంఘము పాపపరిహారార్థబలిగా ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు దానిని తీసికొని రావలెను. 15సమాజముయొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడెమీద తమ చేతులుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలెను. 16అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెయొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తీసికొని రావలెను. 17ఆయాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని ఏడుమారులు దాని ప్రోక్షింపవలెను. 18మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న బలిపీఠపు కొమ్ములమీద చమిరి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను. 19మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠముమీద దహింపవలెను. 20అతడు పాపపరిహారార్థబలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను; అట్లే దీని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా వారికి క్షమాపణ కలుగును. 21ఆ కోడెను పాళెము వెలుపలికి మోసికొనిపోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంఘమునకు పాపపరిహారార్థబలి.
22అధికారి పొరబాటున పాపముచేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధియైనయెడల 23అతడు ఏ పాపము చేసి పాపియాయెనో అది తనకు తెలియబడినయెడల, అతడు నిర్దోషమైన మగమేకపిల్లను అర్పణముగా తీసికొని వచ్చి 24ఆ మేకపిల్ల తలమీద చెయ్యి ఉంచి, దహనబలి పశువును వధించుచోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. 25ఇది పాపపరిహారార్థబలి. యాజకుడు పాపపరిహారార్థబలి పశురక్తములో కొంచెము తన వ్రేలితో తీసి, దహనబలిపీఠము కొమ్ములమీద చమిరి, దాని రక్తశేషమును దహనబలిపీఠము అడుగున పోయవలెను. 26సమాధానబలి పశువుయొక్క క్రొవ్వువలె దీని క్రొవ్వంతయు బలిపీఠముమీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా అతనికి క్షమాపణ కలుగును.
27మీ దేశస్థులలో ఎవడైనను పొరబాటున పాపము చేసి చేయరానిపనుల విషయములో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధియైనయెడల 28తాను చేసినది పాపమని యొకవేళ తనకు తెలియబడినయెడల, తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసికొని వచ్చి 29పాపపరిహారార్థబలి పశువుయొక్క తలమీద తన చెయ్యి ఉంచి, దహనబలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను. 30యాజకుడు దాని రక్తములో కొంచెము వ్రేలితో తీసి దహనబలిపీఠపు కొమ్ములమీద చమిరి, దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలెను. 31మరియు సమాధానబలి పశువుయొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠముమీద దానిని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా అతనికి క్షమాపణ కలుగును.
32ఎవడైనను పాపపరిహారార్థబలిగా అర్పించుటకు గొఱ్ఱెను తీసికొనివచ్చినయెడల నిర్దోషమైనదాని తీసికొనివచ్చి 33పాపపరిహారార్థబలియగు ఆ పశువు తలమీద చెయ్యి ఉంచి దహనబలి పశువులను వధించు చోటను పాపపరిహారార్థబలియగు దానిని వధింపవలెను. 34యాజకుడు పాపపరిహారార్థబలియగు పశువు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహనబలిపీఠపు కొమ్ములమీద చమిరి, ఆ పీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను. 35మరియు సమాధానబలి పశువుయొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠముమీద వాటిని ధూపము వేయవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా అతనికి క్షమాపణ కలుగును.
Currently Selected:
లేవీయకాండము 4: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.