లేవీయకాండము 23
23
1మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను 2–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–మీరు చాటింపవలసిన యెహోవా నియామకకాలములు ఇవే; ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను; నా నియామకకాలములు ఇవి. 3ఆరు దినములు పనిచేయవలెను; వారము వారము ఏడవ దినము విశ్రాంతిదినము; అది పరిశుద్ధసంఘపు దినము. అందులో మీరు ఏ పనియైనను చేయకూడదు. మీ సమస్త నివాసములయందు అది యెహోవా నియమించిన విశ్రాంతిదినము.
4ఇవి యెహోవా నియామకకాలములు, నియమించిన కాలములనుబట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధసంఘపు దినములు ఇవి. 5మొదటి నెల పదునాలుగవదినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును. 6ఆ నెల పదునయిదవదినమున యెహోవాకు పొంగనిరొట్టెల పండుగ జరుగును; ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలెను 7మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి యైన ఏ పనియు చేయకూడదు. 8ఏడు దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. ఏడవదినమున పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పుము.
9మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను 10–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–నేను మీ కిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయు నప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. 11యెహోవా మిమ్ము నంగీకరించునట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతిదినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. 12మీరు ఆ పనను అర్పించుదినమున నిర్దోషమైన యేడాది పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పింపవలెను 13దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు పదియవ వంతుల గోధుమపిండి. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. దాని పానార్పణము ముప్పావు ద్రాక్షారసము. 14మీరు మీ దేవునికి అర్పణము తెచ్చువరకు ఆ దినమెల్ల మీరు రొట్టె యేమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తర తరములకు మీ నివాసస్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ.
15మీరు విశ్రాంతిదినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని యేడు వారములు లెక్కింపవలెను; లెక్కకు తక్కువ కాకుండ ఏడు వారములు ఉండవలెను. 16ఏడవ విశ్రాంతిదినపు మరుదినమువరకు మీరు ఏబది దినములు లెక్కించి యెహోవాకు క్రొత్తఫలముతో నైవేద్యము అర్పింపవలెను. 17మీరు మీ నివాసములలోనుండి తూములో రెండేసి పదియవవంతుల పిండిగల రెండు రొట్టెలను అల్లా డించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమపిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమఫలముల అర్పణము. 18మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన యేడు ఏడాది మగ గొఱ్ఱెపిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోను వారి పానార్పణములతోను దహనబలియై యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగును. 19అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాపపరిహారార్థబలిగా అర్పించి రెండు ఏడాది గొఱ్ఱెపిల్లలను సమాధానబలిగా అర్పింపవలెను. 20యాజకుడు ప్రథమఫలముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతి ష్ఠింపబడినవై యాజకునివగును. 21ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదు. ఇది మీ సమస్తనివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ.
22మీరు మీ పంటచేను కోయునప్పుడు నీ పొలముయొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను; నేను మీ దేవుడనైన యెహోవాను.
23మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. 24–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతిదినము. అందులో జ్ఞాపకార్థశృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. 25అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను.
26మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. 27–ఈ యేడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము; అందులో మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను. 28ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు; మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసికొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. 29ఆ దినమున తన్నుతాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును. 30ఆ దినమున ఏ పనినైననుచేయు ప్రతివానిని వాని ప్రజలలోనుండకుండ నాశము చేసెదను. 31అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. 32అది మీకు మహా విశ్రాంతిదినము, మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఆ నెల తొమ్మిదవనాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలమువరకు మీరు విశ్రాంతిదినముగా ఆచరింపవలెను.
33మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను 34–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–ఈ యేడవ నెల పదునయిదవ దినము మొదలుకొని యేడు దినములవరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను. 35వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు. 36ఏడు దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. ఎనిమిదవదినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రతదినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు.
37యెహోవా నియమించిన విశ్రాంతిదినములు గాకయు, మీరు దానములనిచ్చు దినములుగాకయు, మీ మ్రొక్కు బడి దినములుగాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములుగాకయు, యెహోవాకు హోమ ద్రవ్యమునేమి దహనబలి ద్రవ్యము నేమి నైవేద్యమునేమి బలినేమి పానీయార్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి. 38ఏ అర్పణదినమున ఆ అర్పణమును తీసికొని రావలెను.
39అయితే ఏడవ నెల పదునయిదవదినమున మీరు భూమిపంటను కూర్చుకొనగా ఏడు దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతిదినము, ఎనిమిదవ దినము విశ్రాంతిదినము. 40మొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను గొంజి చెట్లకొమ్మలను కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. 41అట్లు మీరు ఏటేట ఏడు దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. ఏడవ నెలలో దానిని ఆచరింపవలెను. 42నేను ఐగుప్తుదేశములోనుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలలో నివసింప చేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరు పర్ణశాలలలో నివసింపవలెను. 43నేను మీ దేవుడనైన యెహోవాను. 44అట్లు మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలములను తెలియ చెప్పెను.
Currently Selected:
లేవీయకాండము 23: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.