లేవీయకాండము 15
15
1మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను 2–మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి– ఒకని దేహమందు స్రావమున్నయెడల ఆ స్రావమువలనవాడు అపవిత్రుడగును. 3వాని స్రావము కారినను కారక పోయినను ఆ దేహస్థితినిబట్టివాడు అపవిత్రుడగును. ఆ స్రావముగలవాడు పండుకొను ప్రతి పరుపు అప విత్రము; 4-5వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము. వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును. 6అట్టివాడు దేనిమీద కూర్చుండునో దానిమీద కూర్చుండువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును. 7స్రావముగల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును. 8స్రావముగలవాడు పవిత్రునిమీద ఉమ్మివేసినయెడలవాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును. 9స్రావముగలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము. 10వాని క్రిందనుండిన యే వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును. వాటిని మోయువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును. 11స్రావముగలవాడు నీళ్లతో చేతులు కడుగుకొనకయే ఎవని ముట్టునోవాడు తన బట్టలు ఉదుకుకొని స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును. 12స్రావము గలవాడు ముట్టుకొనిన మంటిపాత్రను పగలగొట్టవలెను, ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడుగవలెను. 13స్రావముగలవాడు తన స్రావమునుండి పవిత్రత పొందునప్పుడు, తన పవిత్రత విషయమై యేడు దినములు లెక్కించుకొని తన బట్టలు ఉదుకుకొని పారు నీటితో ఒడలును కడుగుకొని పవిత్రుడగును. 14ఎనిమిదవనాడు రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను తీసికొని ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకుని కప్పగింపవలెను. 15యాజకుడు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థబలిగాను ఒకదానిని దహనబలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని స్రావము విషయములో యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.
16ఒకనికి వీర్యస్ఖలనమైనయెడలవాడు సర్వాంగ స్నానము చేసికొని సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును. 17ఏ బట్టమీదను ఏ తోలుమీదను వీర్యస్ఖలనమగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉదుకబడి సాయంకాలమువరకు అపవిత్రమై యుండును. 18వీర్యస్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించినయెడల వారిద్దరు నీళ్లతో స్నానము చేసి సాయంకాలమువరకు అపవిత్రులైయుందురు.
19స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైనయెడల ఆమె యేడు దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరు సాయంకాలమువరకు అపవిత్రులగుదురు. 20ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేనిమీద పండుకొనునో అది అపవిత్రమగును; ఆమె దేనిమీద కూర్చుండునో అది అపవిత్రమగును. 21ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును. 22ఆమె దేనిమీద కూర్చుం డునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును. 23అది ఆమె పరుపుమీదనైనను ఆమె కూర్చుండిన దానిమీదనైనను ఉండినయెడల దానిని ముట్టువాడు సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును. 24ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలినయెడల,వాడు ఏడు దినములు అపవిత్రుడగును;వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము.
25ఒక స్త్రీ కడగా ఉండుకాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంక అనేకదినములు స్రవించినను ఆమె కడగానుండు కాలమైన తరువాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగానుండు దినములలోవలెనే ఆ స్రావదినములన్నియు ఉండును, ఆమె అపవిత్రురాలు. 26ఆమె స్రావదినములన్నియు ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచమువలె ఉండవలెను. ఆమె దేనిమీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రతవలె అపవిత్రమగును. 27వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు.వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును. 28ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైనయెడల ఆమె యేడుదినములు లెక్కించుకొని అవి తీరిన తరువాత పవిత్రురాలగును. 29ఎనిమిదవ నాడు ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తేవలెను. 30యాజకుడు ఒకదానిని పాపపరిహారార్థబలిగాను ఒకదానిని దహనబలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు ఆమె స్రావవిషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.
31ఇశ్రాయేలీయులు తమ మధ్యనుండు నా నివాసస్థలమును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రతవలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలుగకుండ మీరు వారిని కాపాడవలెను.
32స్రావముగలవానిగూర్చియు, వీర్యస్ఖలనమువలని అప విత్రతగలవానిగూర్చియు, కడగానున్న బలహీనురాలిని గూర్చియు, స్రావముగల స్త్రీ పురుషులనుగూర్చియు, అపవిత్రురాలితో శయనించువాని గూర్చియు విధింపబడి నది ఇదే.
Currently Selected:
లేవీయకాండము 15: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.