YouVersion Logo
Search Icon

లేవీయకాండము 1

1
1యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములోనుండి అతనికీలాగు సెలవిచ్చెను. 2–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించునప్పుడు, గోవులమందలోనుండిగాని గొఱ్ఱెల మందలోనుండిగాని మేకల మందలోనుండిగాని దానిని తీసికొని రావలెను. 3అతడు దహనబలిరూపముగా అర్పించునది గోవులలోనిదైనయెడల నిర్దోషమైన మగ దానిని తీసికొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు దానిని తీసికొని రావలెను. 4అతడు దహనబలిగా అర్పించు పశువు తలమీద తన చెయ్యినుంచవలెను; అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. 5అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠముచుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను. 6అప్పుడతడు దహనబలిరూపమైన ఆ పశుచర్మమును ఒలిచి, దాని అవయవములను విడదీసిన తరువాత 7యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠముమీద అగ్నియుంచి ఆ అగ్నిమీద కట్టెలను చక్కగా పేర్చవలెను. 8అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను తలను క్రొవ్వును బలిపీఠము మీదనున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. 9దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలియగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠముమీద దహింపవలెను.
10దహనబలిగా అతడు అర్పించునది గొఱ్ఱెలయొక్కగాని మేకలయొక్కగాని మందలోనిదైనయెడల అతడు నిర్దోషమైన మగదాని తీసికొని వచ్చి 11బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులగు అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను. 12దాని అవయవములను దాని తలను క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠముమీద నున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. 13దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠముమీద దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము.
14అతడు యెహోవాకు దహనబలిగా అర్పించునది పక్షి జాతిలోనిదైనయెడల తెల్ల గువ్వలలోనుండిగాని పావురపు పిల్లలలోనుండిగాని తేవలెను. 15యాజకుడు బలిపీఠముదగ్గరకు దాని తీసికొనివచ్చి దాని తలను త్రుంచి బలిపీఠముమీద దాని దహింపవలెను, దాని రక్తమును బలిపీఠము ప్రక్కను పిండవలెను.
16మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠము తూర్పుదిక్కున బూడిదెను వేయుచోట దానిని పారవేయవలెను. 17అతడు దాని రెక్కలసందున దాని చీల్చవలెనుగాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠముమీద, అనగా అగ్ని మీది కట్టెలపైని దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for లేవీయకాండము 1