YouVersion Logo
Search Icon

యెహోషువ 11

11
1హాసోరు రాజైన యాబీను జరిగినవాటినిగూర్చి విని మాదోనురాజైన యోబాబుకును షిమ్రోను రాజుకును అక్షాపు రాజుకును 2ఉత్తరదిక్కుననున్న మన్యదేశములోను కిన్నెరెతు దక్షిణదిక్కుననున్న అరాబాలోను షెఫేలాలోను పడమటనున్న దోరు మన్యములోను ఉన్న రాజు లకును 3తూర్పు పడమటి దిక్కులయందలి కనానీయులకును అమోరీయులకును హిత్తీయులకును పెరిజ్జీయులకును మన్యములోనున్న యెబూసీయులకును మిస్పా దేశమందలి హెర్మోను దిగువనుండు హివ్వీయులకును వర్తమానము పంపగా 4వారు సముద్రతీరమందలి యిసుకరేణువులంత విస్తారముగానున్న తమ సైనికులనందరిని సమకూర్చుకొని, విస్తారమైన గుఱ్ఱములతోను రథములతోను బయలుదేరిరి. 5ఆ రాజులందరు కూడుకొని ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మేరోము నీళ్లయొద్దకు వచ్చి దిగగా 6యెహోవా –వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడినవారినిగా నేను వారినందరిని అప్పగించెదను. నీవు వారి గుఱ్ఱముల గుదికాలి నరములను తెగ కోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదువని యెహోషు వతో సెలవిచ్చెను. 7కాబట్టి యెహోషువయు అతనితోకూడనున్న యోధులందరును హఠాత్తుగా మేరోము నీళ్ల యొద్దకు వారిమీదికి వచ్చి వారిమీద పడగా 8యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతముచేసి మహాసీదోనువరకును మిశ్రేపొత్మాయిమువరకును తూర్పువైపున మిస్పే లోయవరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి. 9యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుఱ్ఱముల గుదికాలి నరములను తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చివేసెను.
10ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకొని దాని రాజును కత్తివాతను హతము చేసెను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము. 11ఇశ్రాయేలీయులు దానిలోనున్న ప్రతివానిని కత్తివాతను హతముచేసిరి. ఎవరును తప్పించుకొనకుండ యెహోషువ వారినందరిని నిర్మూలము చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను. 12యెహోషువ ఆ రాజులనందరిని హతముచేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టెను; యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేసెను. 13అయితే యెహోషువ హాసోరును కాల్చివేసెనుగాని మెట్టలమీద కట్టబడియున్న పట్టణములను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. 14ఆ పట్టణముల సంబంధమైన కొల్లసొమ్మును పశువులను ఇశ్రాయేలీయులు దోచుకొనిరి. నరులలో ఒకనిని విడువకుండ అందరిని నశింపజేయువరకు కత్తివాతను హతము చేయుచు వచ్చిరి. 15యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను, యెహోషువ ఆలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో నొకటియు అతడు చేయక విడువలేదు.
16యెహోషువ శేయీరుకు పోవు హాలాకు కొండ మొదలుకొని 17లెబానోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదువరకు ఆ దేశమంతటిని, అనగా మన్యమును దక్షిణదేశమంతటిని గోషేనుదేశమంతటిని షెఫేలాప్రదేశమును మైదానమును ఇశ్రాయేలు కొండలను వాటి లోయలను వాటి రాజులనందరిని పట్టుకొని వారిని కొట్టిచంపెను. 18బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధము చేసెను. గిబియోను నివాసులైన హివ్వీయులుగాక 19ఇశ్రాయేలీయులతో సంధిచేసిన పట్టణము మరి ఏదియులేదు. ఆ పట్టణములన్నిటిని వారు యుద్ధములో పట్టుకొనిరి. 20వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనముచేయు నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు వచ్చునట్లు యెహోవావారి హృదయములను కఠినపరచియుండెను. 21ఆ కాలమున యెహోషువ వచ్చి మన్యదేశములోను, అనగా హెబ్రోనులోను దెబీరులోను అనాబులోను యూదా మన్యములన్నిటిలోను ఇశ్రాయేలీయుల మన్య ప్రదేశములన్నిటిలోను ఉన్న అనాకీయులను నాశనము చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలము చేసెను. 22ఇశ్రాయేలీయుల దేశమందు అనాకీయులలో ఎవడును మిగిలియుండలేదు; గాజాలోను గాతులోను అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలియుండిరి.
23యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశ మంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాని నప్ప గించెను. అప్పుడు యుద్ధములేకుండ దేశము సుభిక్షముగా నుండెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in