యిర్మీయా 52
52
1సిద్కియా యేలనారంభించినప్పుడు అతడు ఇరువదియొక్క సంవత్సరములవాడు. అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను, అతని తల్లిపేరు హమూటలు; ఈమె లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తె. 2యెహోయాకీము నడిచిన చెడ్డనడత ప్రకారముగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డనడత నడిచెను. 3యెహోవా కోపపడి తనయెదుట నుండకుండ వారిని తోలివేయునంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోను జరిగెను. సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటుచేయగా 4అతని యేలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదియవ నెల పదియవదినమున బబులోను రాజైన నెబుకద్రెజరు తన సైన్యమంతటితో యెరూషలేముమీదికి వచ్చి, దానికి ఎదురుగా దండు దిగి నప్పుడు పట్టణమునకు చుట్టు కోటలు కట్టిరి. 5ఆలాగు జరుగగా సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవ త్సరమువరకు పట్టణము ముట్టడిలో నుంచబడెను. 6నాల్గవ నెల తొమ్మిదవదినమున క్షామము పట్టణములో హెచ్చుగా నున్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను. 7పట్టణప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరు పారిపోయి రాజుతోటకు దాపైన రెండు గోడలమధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణములోనుండి బయలు వెళ్లిరి; కల్దీయులు పట్టణమును చుట్టుకొని యుండగా సైనికులు యొర్దానునది మార్గముగా తరలిపోయిరి. 8కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానములో అతని కలిసికొనగా అతని దండంతయు అతనియొద్దనుండి చెదరిపోయెను. 9వారు రాజును పట్టుకొని హమాతు దేశమునందలి రిబ్లాపట్టణమున నున్న బబులోను రాజునొద్దకు అతని తీసికొనిపోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్షవిధించెను. 10బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నులయెదుట చంపించెను; మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతుల నందరిని చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడ దీయించి 11రెండు సంకెళ్లతో అతని బంధించి, బబులోనునకు అతని తీసికొనిపోయి, మరణమగువరకు చెరసాలలో అతనిపెట్టించెను.
12అయిదవ నెల పదియవ దినమున, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఏలుబడియందు పందొమ్మిదవ సంవత్సరమున బబులోనురాజు ఎదుట నిలుచు నెబూజర దానను రాజదేహసంరక్షకుల యధిపతి యెరూషలేమునకు వచ్చెను. 13-14అతడు యెహోవా మందిరమును రాజునగరును యెరూషలేములోని గొప్పవారి యిండ్లనన్నిటిని కాల్చి వేసెను. మరియు రాజదేహసంరక్షకుల యధిపతితోకూడ నుండిన కల్దీయుల సేనాసంబంధులందరు యెరూషలేము చుట్టునున్న ప్రాకారములన్నిటిని పడగొట్టిరి 15మరియు రాజదేహసంరక్షకుల యధిపతియైన నెబూజరదాను ప్రజలలో కడుబీదలైన కొందరిని, పట్టణములో శేషించిన కొదువ ప్రజలను, బబులోనురాజు పక్షము చేరినవారిని, గట్టి పనివారిలో శేషించినవారిని చెరగొని పోయెను. 16అయితే రాజదేహసంరక్షకుల యధిపతియైన నెబూజరదాను ద్రాక్షావనములను చక్కపరచుటకును సేద్యము చేయుటకును కడుబీదలలో కొందరిని ఉండనిచ్చెను. 17మరియు యెహోవా మందిరములోనుండిన ఇత్తడి స్తంభములను మందిరములోనుండిన మట్లను ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనునకు గొనిపోయిరి. 18అదియుగాక వారు బిందెలనుకుండలను కత్తెరలను గిన్నెలను గరిటెలను యాజకులు సేవచేయు ఇత్తడి ఉపకరణములన్నిటిని గొనిపోయిరి. 19మరియు పళ్లెములను ధూపార్తులను గిన్నెలను పాత్రలను, బంగారు వాటిని బంగారునకును వెండివాటిని వెండికిని చేర్చుకొని రాజదేహసంరక్షకుల యధిపతి గొనిపోయెను. 20రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లక్రిందనుండిన పండ్రెండు ఇత్తడి వృషభములను గొనిపోయెను. వీటి కన్నిటికున్న ఇత్తడి యెత్తువేయుటకు అసాధ్యము. 21వాటిలో ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల యెత్తుగలది, పండ్రెండు మూరల నూలు దాని చుట్టు తిరుగును, దాని దళసరి నాలుగు వ్రేళ్లు; అది గుల్లది. 22దానిమీద ఇత్తడి పైపీట యుండెను; ఒక్క పైపీట అయి దేసి మూరల ఎత్తుగలది, పైపీటకు చుట్టు అల్లిన వల అల్లి కయు దానిమ్మ పండ్లును ఉండెను; అవి యన్నియు ఇత్త డివి. ఈ స్తంభమునకును ఆ స్తంభమునకును ఆలాగుననే దానిమ్మ పండ్లుండెను. 23ప్రక్కలయందు తొంబది యారు దానిమ్మపండ్లుండెను; చుట్టు ఉండిన వల అల్లికమీద దానిమ్మపండ్లన్నియు నూరు. 24మరియు రాజదేహసంరక్ష కుల యధిపతి ప్రధానయాజకుడైన శెరాయాను రెండవ యాజకుడైన జెఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకొనెను. 25అతడు పట్టణములోనుండి యోధులమీద నియమింపబడిన యొక ఉద్యోగస్థుని, పట్టణములో దొరికిన రాజసన్నిధిలో నిలుచు ఏడుగురు మనుష్యులను, దేశ సైన్యాధిపతియగువానియొక్క లేఖరిని, పట్టణపుమధ్యను దొరికిన అరువదిమంది దేశప్రజలను పట్టుకొనెను. 26రాజదేహసంరక్షకుల యధిపతియైన నెబూజరదాను వీరిని పట్టుకొని రిబ్లాలోనుండిన బబులోనురాజు నొద్దకు తీసికొని వచ్చెను. 27బబులోనురాజు హమాతుదేశమందలి రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యూదా వారిని తమ దేశములోనుండి చెరగొనిపోయెను. 28నెబుకద్రెజరు తన యేలుబడియందు ఏడవ సంవత్సరమున మూడువేల ఇరువది ముగ్గురు యూదులను చెరగొనిపోయెను 29నెబుకద్రెజరు ఏలుబడియందు పదునెనిమిదవ సంవత్సరమున అతడు యెరూషలేమునుండి ఎనిమిదివందల ముప్పది యిద్దరిని చెరగొని పోయెను. 30నెబుకద్రెజరు ఏలుబడియందు ఇరువది మూడవ సంవత్సరమున రాజదేహసంరక్షకుల యధిపతియగు నెబూజరదాను యూదులలో ఏడువందల నలుబది యయిదుగురు మనుష్యులను చెరగొనిపోయెను; ఆ మనుష్యుల వెరసి నాలుగువేల ఆరువందలు.
31యూదారాజైన యెహోయాకీను చెరపట్టబడిన ముప్పది యేడవ సంవత్సరమున పండ్రెండవనెల యిరువదియైదవదినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తన యేలుబడియందు మొదటి సంవత్సరమున యూదారాజైన యెహోయాకీనునకు దయచూపి, బందీగృహములోనుండి అతని తెప్పించి 32అతనితో దయగా మాటలాడి అతనితోకూడ బబులోనులోనుండు రాజుల సింహాసనముకంటె ఎత్తయిన సింహాసనము అతనికి నియమించెను. 33మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవితకాలమంతయు ఎవీల్మెరోదకు సన్నిధిని భోజనముచేయుచువచ్చెను. 34మరియు అతడు చనిపోవువరకు అతడు బ్రతికిన దినములన్నియు అనుదినము అతని పోషణకై బబులోనురాజుచేత భోజనపదార్థములు ఇయ్యబడుచుండెను.
Currently Selected:
యిర్మీయా 52: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.