యిర్మీయా 32
32
1యూదారాజైన సిద్కియా యేలుబడి పదియవ . సంవత్సరమున, అనగా నెబుకద్రెజరు ఏలుబడి పదునెనిమిదవ సంవత్సరమున యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. 2ఆ కాలమున బబులోనురాజు దండు యెరూషలేమునకు ముట్టడివేయుచుండగా సిద్కియా యిర్మీయాతో చెప్పినదేమనగా – యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోనురాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాని పట్టుకొనును, 3యూదారాజైన సిద్కియా కల్దీయుల చేతిలోనుండి తప్పించుకొనక బబులోనురాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును, సిద్కియా అతనితో ముఖాముఖిగా మాటలాడును, కన్నులార అతని చూచును, 4అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును, నేను అతని దర్శించువరకు అతడక్కడనే యుండును; ఇదే యెహోవా వాక్కు; 5మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయము నొందరు, అను మాటలు నీవేల ప్రకటించుచున్నావని యిర్మీయాతో చెప్పి అతనిని చెరలో వేయించి యుండెను; కాగా ప్రవక్తయైన యిర్మీయా యూదా రాజు మందిరములోనున్న చెరసాల ప్రాకారములో ఉంచబడియుండెను.
6అంతట యిర్మీయా ఇట్లనెను–యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 7–నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీయొద్దకు వచ్చి – అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాని కొనుక్కొనుమని చెప్పును. 8కావున నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హన మేలు యెహోవా మాటచొప్పున చెరసాల ప్రాకారములోనున్న నాయొద్దకు వచ్చి–బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసికొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీవలననే జరుగవలెను, దాని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలిసికొని 9నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు పొలమునుకొని, పదియేడు తులముల వెండి తూచి అతనికిచ్చితిని. 10నేను క్రయపత్రము వ్రాసి ముద్రవేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి 11క్రయపత్రమును, అనగా ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికను తీసికొంటిని. 12అప్పుడు నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు ఎదుటను, ఆ క్రయపత్రములో చేవ్రాలు చేసిన సాక్షుల యెదుటను, చెరసాల ప్రాకారములో కూర్చున్న యూదులందరియెదుటను, నేను మహసేయా కుమారుడగు నేరీయా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల యెదుట బారూకునకు ఈలాగు ఆజ్ఞాపించితిని. 13ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా 14–ఈ పత్రములను, అనగా ముద్రగల యీ క్రయపత్రమును ముద్రలేని క్రయపత్రమును, నీవు తీసికొని అవి బహు దినములుండునట్లు మంటికుండలో వాటిని దాచిపెట్టుము. 15ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఇండ్లును పొలములును ద్రాక్షతోటలును ఇంక ఈ దేశములో కొనబడును.
16నేరీయా కుమారుడైన బారూకుచేతికి ఆ క్రయ పత్రమును నేనప్పగించిన తరువాత యెహోవాకు ఈలాగున ప్రార్థన చేసితిని 17–యెహోవా, ప్రభువా సైన్యములకధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ యధిక బలముచేతను చాచిన బాహువుచేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు. 18నీవు వేవేలమందికి కృపచూపుచు, తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. 19ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలనుబట్టియు వారి క్రియా ఫలమునుబట్టియు అందరికి ప్రతిఫలమిచ్చుటకై నర పుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులార చూచుచున్నావు. 20నీవు ఐగుప్తుదేశములో చేసినట్టు నేటివరకు ఇశ్రాయేలు వారిమధ్యను ఇతర మనుష్యులమధ్యను సూచక క్రియలను మహత్కార్యములను చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. 21సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహా బలముకలిగి, చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి, ఐగుప్తు దేశములోనుండి నీ ప్రజలను రప్పించి 22మీ కిచ్చెదనని వారి పితరులకు ప్రమాణముచేసి, పాలు తేనెలు ప్రవహించు ఈ దేశమును వారి కిచ్చితివి. 23వారు ప్రవేశించి దాని స్వతంత్రించుకొనిరి గాని నీ మాట వినకపోయిరి, నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయిరి. వారు చేయవలెనని నీవాజ్ఞాపించినవాటిలో దేనిని చేయకపోయిరి గనుక ఈ కీడంతయు వారిమీదికి రప్పించియున్నావు. 24ముట్టడి దిబ్బలను చూడుము, పట్టణమును పట్టుకొనుటకు అవి దానికి సమీపించుచున్నవి, ఖడ్గము క్షామము తెగులు వచ్చుటవలన దానిమీద యుద్ధముచేయుచుండు కల్దీయుల చేతికి ఈ పట్టణము అప్పగింపబడును; నీవు సెలవిచ్చినది సంభవించెను, నీవే దాని చూచుచున్నావు గదా? 25యెహోవా ప్రభువా–ధనమిచ్చి యీ పొలమును కొను క్కొని సాక్షులను పిలుచుకొనుమని నీవే నాతో సెలవిచ్చితివి, అయితే ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడుచున్నది.
26అంతట యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 27–నేను యెహోవాను, సర్వశరీ రులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?
28కావున యెహోవా ఈమాట సెలవిచ్చుచున్నాడు –ఇదిగో నేను ఈ పట్టణమును కల్దీయుల చేతికిని బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని అప్పగింపబోవుచున్నాను; అతడు దాని పట్టుకొనగా 29ఈ పట్టణము మీద యుద్ధముచేయు కల్దీయులు వచ్చి, యీ పట్టణమునకు అగ్ని ముట్టించి, యే మిద్దెలమీద జనులు బయలునకు ధూపార్పణచేసి అన్యదేవతలకు పానార్పణములనర్పించి నాకు కోపము పుట్టించిరో ఆ మిద్దెలన్నిటిని కాల్చివేసెదరు. 30ఏలయనగా ఇశ్రాయేలువారును యూదావారును తమ బాల్యము మొదలుకొని నాయెదుట చెడుతనమే చేయుచు వచ్చుచున్నారు, తమ చేతుల క్రియవలనవారు నాకు కోపమే పుట్టించువారు; ఇదే యెహోవా వాక్కు. 31-32నాకోపము రేపుటకు ఇశ్రాయేలువారును యూదావారును వారి రాజులును వారి ప్రధానులును వారి యాజకులును వారి ప్రవక్తలును యూదా జనులును యెరూషలేము నివాసులును చూపిన దుష్‌ప్రవర్తన అంతటినిబట్టి, నా యెదుటనుండి వారి దుష్‌ప్రవర్తనను నేను నివారణచేయ ఉద్దేశించునట్లు, వారు ఈ పట్టణమును కట్టిన దినము మొదలుకొని ఇదివరకును అది నాకు కోపము పుట్టించుటకు కారణమాయెను. 33నేను పెందలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధ నంగీకరింపకపోయిరి, వారు నాతట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పు కొనిరి. 34మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైనవాటిని పెట్టిరి. 35వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలెనని బెన్‍హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠములను కట్టించిరి, ఆలాగు చేయుటకు నేను వారికాజ్ఞాపింప లేదు, యూదావారు పాపములో పడి, యెవరైన నిట్టి హేయక్రియలు చేయుదురన్నమాట నా కెన్నడును తోచలేదు.
36కావున ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈ పట్టణమునుగూర్చి యీ మాట సెలవిచ్చుచున్నాడు–అది ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను పీడింపబడినదై బబులోనురాజు చేతికి అప్పగింపబడునని మీరీ పట్టణమునుగూర్చి చెప్పుచున్నారు గదా. 37ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకముచేతను మహా రౌద్రముచేతను నేను వారిని వెళ్లగొట్టిన దేశములన్నిటిలోనుండి వారిని సమకూర్చి యీ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసెదను. 38వారు నాకు ప్రజలైయుందురు నేను వారికి దేవుడనై యుందును. 39మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏకమార్గమును దయచేయుదును. 40నేను వారికి మేలుచేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను. 41వారికి మేలుచేయుటకు వారియందు ఆనందించుచున్నాను, నా పూర్ణహృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. 42యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నేను ఈ ప్రజలమీదికి ఇంత గొప్పకీడు రప్పించిన రీతినే నేను వారినిగూర్చి చెప్పిన మేలంతటిని వారిమీదికి రప్పింపబోవుచున్నాను. 43ఇది పాడై పోయెను, దానిలో నరులు లేరు, పశువులు లేవు, ఇది కల్దీయులచేతికి ఇయ్యబడియున్నదని మీరు చెప్పుచున్న ఈ దేశమున పొలములు విక్రయింపబడును. 44నేను వారిలో చెరపోయినవారిని రప్పింపబోవుచున్నాను గనుక బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంతములలోను యూదా పట్టణములలోను మన్యములోని పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను మనుష్యులు క్రయమిచ్చి పొలములుకొందురు, క్రయపత్రములు వ్రాయించుకొందురు, ముద్రవేయుదురు, సాక్షులను పెట్టుదురు; ఇదే యెహోవా వాక్కు.
Currently Selected:
యిర్మీయా 32: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.