YouVersion Logo
Search Icon

యిర్మీయా 30

30
1యెహోవాయొద్దనుండి వచ్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. 2ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు 3–రాబోవు దినములలో నేను ఇశ్రాయేలువారును యూదావారునగు నా ప్రజలను చెరలోనుండి విడిపించి, వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకొనునట్లు వారిని తిరిగి రప్పించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకములో వ్రాసియుంచుకొనుము.
4యెహోవా ఇశ్రాయేలువారినిగూర్చియు యూదా వారినిగూర్చియు సెలవిచ్చినమాటలివి. 5యెహోవా యిట్లనెను–సమాధానములేనికాలమున భీతిచేతను దిగులు చేతను జనులు కేకవేయగా వినుచున్నాము. 6మీరు విచారించి తెలిసికొనుడి; పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా? ప్రసవవేదనపడు స్త్రీలవలె పురుషులందరును నడుముమీద చేతులుంచుకొనుటయు, వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి? 7అయ్యో, యెంత భయంకరమైన దినము ! అట్టి దినము మరియొకటి రాదు; అది యాకోబు సంతతివారికి ఆపద తెచ్చుదినము; అయినను వారు దానిలో పడకుండ రక్షింపబడుదురు. 8సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నీకున్న కాడి నీ మెడ నుండకుండ ఆ దినమున నేను దాని విరిచి నీ కట్లను తెంపెదను; ఇకను అన్యులు యాకోబు సంతతివారిచేత దాస్యము చేయించు కొనరు గాని 9వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారిమీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. 10మరియు యెహోవా సెలవిచ్చునదేమనగా–నా సేవకుడవైన యాకోబూ, భయపడకుము; ఇశ్రాయేలూ, విస్మయమొందకుము, నేను దూరముననుండు నిన్నును, చెరలోనికి పోయిన దేశముననుండు నీ సంతానపువారిని రక్షించుచున్నాను; బెదరించువాడులేకుండ యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును. 11యెహోవా వాక్కు ఇదే–నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటిని నేను సమూలనాశనము చేసెదను గాని నిన్ను సమూల నాశనము చేయను, అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండనే నిన్ను మితముగా శిక్షించుదును.
12యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది; 13నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమునుబట్టి నేను నీకు కఠినశిక్షచేసి నిన్ను గాయపరచియున్నాను; కాగా నీ పక్షమున వ్యాజ్యెమాడువాడెవడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగినమందు నీకు లేదు. 14నీ స్నేహితులందరు నిన్ను మరచియున్నారు, వారు నిన్నుగూర్చి విచారింపరు. 15నీ గాయముచేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు; నీ పాపములు విస్త రించినందున నీ దోషములనుబట్టి నేను నిన్ను ఈలాగు చేయుచున్నాను. 16నిన్ను మ్రింగువారందరు మ్రింగి వేయబడుదురు, నిన్ను బాధించువారందరు ఎవడును తప్పకుండ చెరలోనికి పోవుదురు, నిన్ను దోచుకొనువారు దోపుడు సొమ్మగుదురు, నిన్ను అపహరించువారినందరిని దోపుడు సొమ్ముగా అప్పగించెదను. 17వారు–ఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరుపెట్టుచున్నారు; అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు. 18యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు– యాకోబు నివాసస్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలోనుండి రప్పింతును; అప్పుడు పట్టణము దాని కొండమీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. 19వాటిలో కృతజ్ఞతాస్తోత్రములను సంభ్రమపడువారి స్వరమును వినబడును, జనులు తక్కువ మంది కాకుండ నేను వారిని విస్తరింపజేసెదను, అల్పులు కాకుండ నేను వారిని ఘనులుగా జేసెదను. 20వారి కుమారులుమునుపటివలెనుందురు, వారి సమాజము నా యెదుట స్థాపింపబడును, వారిని బాధపరచువారినందరిని శిక్షించెదను. 21వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారిమధ్యను పుట్టినవాడొకడు వారి నేలును, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొనువాడెవడు? నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వానిని చేరదీసెదను; ఇదే యెహోవా వాక్కు. 22అప్పుడు మీరు నాకు ప్రజలైయుందురు నేను మీకు దేవుడనై యుందును.
23ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిర తిరుగు సుడిగాలి, అది దుష్టులమీద పెళ్లున దిగును. 24తన కార్యము ముగించువరకు తన హృదయాలోచనలను నెరవేర్చువరకు యెహోవా కోపాగ్ని చల్లారదు, అంత్యదినములలో మీరీ సంగతిని గ్రహింతురు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for యిర్మీయా 30