YouVersion Logo
Search Icon

యిర్మీయా 28

28
1యూదారాజైన సిద్కియా యేలుబడి ఆరంభమున . నాల్గవ సంవత్సరము అయిదవ నెలలో గిబియోనువాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడునైన హనన్యా యాజకుల యెదుటను ప్రజలందరియెదుటను యెహోవా మందిరములో నాతో ఈలాగనెను 2–ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు – నేను బబులోనురాజు కాడిని విరిచియున్నాను. 3రెండు సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఈ స్థలములోనుండి బబులోనునకు తీసికొనిపోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటిని ఇచ్చటికి మరల తెప్పించెదను. 4బబులోను రాజు కాడిని విరుగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదారాజునైన యెకోన్యాను, బబులోనునకు చెరగొని పోయిన యూదులనందరిని, యీ స్థలమునకు తిరిగి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు. 5అప్పుడు ప్రవక్తయైన యిర్మీయా యాజకులయెదుటను యెహోవా మందిరములో నిలిచియున్న ప్రజలందరియెదుటను ప్రవక్తయైన హనన్యాతో ఇట్లనెను 6–ఆలాగున జరుగునుగాక, యెహోవా ఆలాగుననే చేయునుగాక, యెహోవా మందిరపు ఉపకరణములన్నిటిని, చెరగొనిపోబడిన వారినందరిని యెహోవా బబులోనులోనుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక. 7అయినను నేను నీ చెవులలోను ఈ ప్రజలందరి చెవులలోను చెప్పుచున్నమాటను చిత్తగించి వినుము. 8నాకును నీకును ముందుగా నున్న ప్రవక్తలు, అనేకదేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు, కీడు సంభవించుననియు, తెగులుకలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచు వచ్చిరి. 9అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త యున్నాడే, అతని మాట నెరవేరినయెడల యెహోవా నిజముగా అతని పంపెనని యొప్పుకొనదగునని ప్రవక్తయైన యిర్మీయా చెప్పగా 10ప్రవక్తయైన హనన్యా ప్రవక్తయైన యిర్మీయా మెడ మీదనుండి ఆ కాడిని తీసి దాని విరిచి 11ప్రజలందరి యెదుట ఇట్లనెను–యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–రెండు సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్రెజరు కాడిని సర్వజనముల మెడమీద నుండి తొలగించి దాని విరిచివేసెదను; అంతట ప్రవక్తయైన యిర్మీయా వెళ్లిపోయెను.
12ప్రవక్తయైన హనన్యా ప్రవక్తయైన యిర్మీయా మెడ మీదనున్న కాడిని విరిచినతరువాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 13– నీవు పోయి హనన్యాతో ఇట్లనుము – యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు – నీవు కొయ్యకాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుపకాడిని చేయించవలెను. 14ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఈ జనులందరును బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాసులు కావలెనని వారి మెడమీద ఇనుపకాడి యుంచితిని గనుక వారు అతనికి దాసులగుదురు, భూజంతువులను కూడ నేను అతనికప్పగించియున్నాను. 15అంతట ప్రవక్తయైన యిర్మీయా ప్రవక్తయైన హనన్యాతో ఇట్లనెను–హనన్యా వినుము; యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు. 16కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–భూమిమీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను, యెహోవా మీద తిరుగుబాటుచేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమౌదువు అని చెప్పెను. 17ఆ సంవత్సరమే యేడవ నెలలో ప్రవక్తయైన హనన్యా మృతినొందెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for యిర్మీయా 28