YouVersion Logo
Search Icon

యిర్మీయా 22

22
1యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నీవు . యూదారాజు నగరుదిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపుము 2దావీదు సింహాసనముమీద కూర్చుండు యూదా రాజా, నీవును ఈ గుమ్మములద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్థులును నీ జనులును యెహోవా మాట వినుడని ప్రకటింపుము. 3యెహోవా ఈలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు –మీరు నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలోనుండి విడి పించుడి, పరదేశులనైనను తండ్రిలేనివారినైనను విధవ రాండ్రనైనను బాధింపకుడి వారికి ఉపద్రవము కలుగజేయకుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి. 4మీరు నిశ్చయముగా ఈలాగున చేసినయెడల దావీదు సింహాసనముమీద కూర్చుండు రాజులు రథములను గుఱ్ఱములను ఎక్కి తిరుగుచు, ఉద్యోగస్థుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగరు ద్వారములగుండ ప్రవేశింతురు. 5మీరు ఈ మాటలు విననియెడల ఈ నగరుపాడై పోవును, నా తోడని ప్రమాణము చేయుచున్నాను; ఇదే యెహోవా వాక్కు. 6యూదారాజు వంశస్థులనుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నా యెన్నికలో నీవు గిలాదువలెనున్నావు, లెబానోను శిఖరమువలె ఉన్నావు; అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును. 7నీమీదికి వచ్చుటకైయొక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొను సంహారకులను నేను ప్రతిష్ఠించుచున్నాను, వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్ఠమైనవాటిని నరికి అగ్నిలో పడ వేతురు. 8అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవుచు –యెహోవా యెందునిమిత్తము ఈ గొప్పపట్టణమును ఈలాగు చేసెనని యొకని నొకడు అడుగగా 9అచ్చటి వారు–వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్యదేవతలను పూజించి వాటికి నమస్కారము చేసినందున ఆయన ఈలాగున చేసియున్నాడని చెప్పుదురు.
10చనిపోయినవానిగూర్చి యేడవవద్దు, వానిగూర్చి అంగలార్చవద్దు; వెళ్లిపోవుచున్నవానిగూర్చి బహు రోదనము చేయుడి. వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. 11తన తండ్రియైన యోషీయాకు ప్రతిగా ఏలిన వాడై యీ స్థలములోనుండి వెళ్లిపోయిన యూదారాజైన యోషీయా కుమారుడగు షల్లూమునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–అతడు ఇక్కడికి తిరిగి రాడు; 12ఈ దేశమునిక చూడక వారు అతని తీసికొనిపోయిన స్థలమునందే అతడు చచ్చును.
13నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ; న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు, జీతమియ్యక తన పొరుగువానిచేత ఊరకయే కొలువు చేయించుకొనువానికి శ్రమ. 14వాడు విశాలమైన మేడ గదులుగల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని, విస్తారమైన కిటికీలు చేసికొనుచు, దేవదారు పలకలను దానికి సరంబీవేయుచు, ఇంగిలీకముతో#22:14 సింధూరము. రంగువేయుచు నున్నాడే; 15నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుటచేత రాజవగుదువా? నీ తండ్రి అన్నపానములుకలిగి నీతిన్యాయముల ననుసరించుచు క్షేమముగా ఉండలేదా? 16అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రదికెను, ఆలాగున చేయుటే నన్ను తెలిసికొనుట కాదా? యిదే యెహోవా వాక్కు. 17అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే, నిరపరాధుల రక్తము ఒలికించుటయందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు. 18కావున యోషీయా కుమారుడగు యెహోయాకీమను యూదారాజునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు – జనులు– అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరీ, అని అతని గూర్చి అంగలార్చరు; అయ్యో నా యేలినవాడా, అయ్యో, శోభావంతుడా; అని అతనికొరకు అంగలార్చరు. 19అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడురీతిగా పాతిపెట్టబడును.
20నీ విటకాండ్రు నాశనమైరి. లెబానోనును ఎక్కి కేకలువేయుము; బాషానులో బిగ్గరగా అరువుము, అబారీమునుండి కేకలువేయుము. 21నీ క్షేమకాలములలో నీతో మాటలాడితిని గాని–నేను విననని నీవంటివి; నామాట వినకపోవుటే నీ బాల్యమునుండి నీకు వాడుక. 22నీ కాపరులందరు గాలి పీల్చుదురు, నీ విటకాండ్రు చెరలోనికి పోవుదురు, నీ చెడుతనమంతటినిబట్టి నీవు అవమానమునొంది సిగ్గుపడుదువు. 23లెబానోను నివాసినీ, దేవదారు వృక్షములలో గూడు కట్టుకొనినదానా, ప్రసవించు స్త్రీకి కలుగు వేదనవంటి కష్టము నీకు వచ్చునప్పుడు నీవు బహుగా కేకలువేయుదువు గదా! 24యెహోవా సెలవిచ్చునదేమనగా – యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడిచేతికి శిఖా ఉంగరముగా ఉండినను దానిమీదనుండియు నిన్ను ఊడదీసివేసెదనని నాతోడని ప్రమాణముచేయుచున్నాను. 25నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని కల్దీయుల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను. 26నిన్నును నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మ భూమికాని పరదేశములోనికి విసరివేసెదను, మీరు అక్కడనే చచ్చెదరు. 27వారు తిరిగి రావలెనని బహుగా ఆశ పడు దేశమునకు వారు తిరిగి రారు. 28కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా? పనికిమాలిన ఘటమా? అతడును అతని సంతానమును విసరివేయబడి, తామెరుగని దేశములోనికి ఏల త్రోయబడిరి? 29దేశమా, దేశమా, దేశమా, యెహోవా మాట వినుము. 30యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–సంతానహీనుడనియు, తన దినములలో వర్ధిల్లనివాడనియు ఈ మనుష్యునిగూర్చి వ్రాయుడి; అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు; ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా నుండడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for యిర్మీయా 22