YouVersion Logo
Search Icon

యిర్మీయా 2

2
1మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. 2–నీవు వెళ్లి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చునదేమనగా–నీవు అరణ్యములోను, విత్తనములు వేయదగనిదేశములోను, నన్ను వెంబడించుచు నీ యౌవనకాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసికొనుచున్నాను. 3అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠితజనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయెను, అతని లయపరచువారందరు శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును; ఇదే యెహోవా వాక్కు.
4యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరందరు యెహోవా వాక్కు వినుడి. 5యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నాయందు ఏ దుర్నీతి చూచి మీపితరులు వ్యర్థమైనదాని ననుసరించి, తాము వ్యర్థులగునట్లు నాయొద్దనుండి దూరముగా తొలగి పోయిరి? 6ఐగుప్తుదేశములోనుండి మమ్మును రప్పించిన యెహోవా యెక్కడ నున్నాడని అరణ్యములో అనగా, ఎడారులు, గోతులుగల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి, యెవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా యెక్కడ ఉన్నాడని జనులు అడుగుట లేదు. 7దాని ఫలములను శ్రేష్ఠపదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి, నా దేశమును అపవిత్రపరచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి. 8యెహోవా యెక్కడ ఉన్నాడని యాజకులడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు, ఏలికలును నామీద తిరుగుబాటు చేయుదురు. ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్‍ప్రయోజనమైనవాటిని అనుసరింతురు 9కావున నేనికమీదట మీతోను మీ పిల్లల పిల్లలతోను వ్యాజ్యెమాడెదను; ఇది యెహోవా వాక్కు. 10కిత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలిసికొనుడి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనను జరిగినదా? 11దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనెనా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేనిదానికై తమ మహిమను మార్చుకొనిరి. 12ఆకాశమా, దీనిబట్టి విస్మయ పడుము, కంపించుము, బొత్తిగా పాడై పొమ్ము; ఇదే యెహోవా వాక్కు. 13నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు. 14ఇశ్రాయేలు కొనబడిన దాసుడా? యింటపుట్టిన దాసుడా? కాడు గదా; అతడేల దోపుడుసొమ్మాయెను? 15కొదమ సింహములు వానిపైని బొబ్బలు పెట్టెను గర్జించెను, అవి అతని దేశమును పాడుచేసెను, అతని పట్టణములు నివాసులులేక పాడాయెను. 16నోపు, తహపనేసు అను పట్టణములవారు నీ నెత్తిని బద్దలు చేసిరి#2:16 లేక, తినివేసిరి.. 17నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుటవలన నీకు నీవే యీ బాధ కలుగజేసికొంటివి గదా. 18నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పనియున్నది? యూఫ్రటీసునది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గములో నీకేమి పనియున్నది. 19నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయభక్తులులేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగు నని నీవు తెలిసికొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 20పూర్వకాలమునుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసితిని–నేను సేవచేయనని చెప్పుచున్నావు; ఎత్తయిన ప్రతి కొండమీదను పచ్చని ప్రతి చెట్టుక్రిందను వేశ్యవలె క్రీడించుచున్నావు. 21శ్రేష్ఠమైన ద్రాక్షావల్లివంటి దానిగా నేను నిన్ను నాటితిని; కేవలము నిక్కమైన విత్తనమువలని చెట్టు వంటిదానిగా నిన్ను నాటితిని; నాకు జాతిహీనపు ద్రాక్షావల్లివలె నీ వెట్లు భ్రష్టసంతానమైతివి? 22నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలె నాకు కనబడుచున్నది; ఇది ప్రభువగు యెహోవా వాక్కు. 23–నేను అపవిత్రత నొందినదానను కాను, బయలుదేవతల ననుసరించి పోవుదానను కాను అని నీవు ఎట్లనుకొందువు? లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసినదాని తెలిసికొనుము, నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల ఒంటెవు, 24అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురతవలన గాలి పీల్చును, కలిసికొనునప్పుడు దాని త్రిప్పగల వాడెవడు? దాని వెదకు గాడిదలలో ఏదియు అలసి యుండదు, దాని మాసములో అది కనబడును. 25జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుక దప్పిగొనకుండునట్లు జాగ్రత్తపడుము అని నేను చెప్పినను నీవు–ఆ మాట వ్యర్థము, వినను, అన్యులను మోహించితిని, వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు. 26దొరికిన దొంగ సిగ్గుపడునట్లు ఇశ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుదురు–నీవు మా తండ్రివని మ్రానుతోను –నీవే నన్ను పుట్టించితివని రాతితోను చెప్పుచు, వారును వారి రాజులును వారి అధిపతులును వారి యాజకులును వారి ప్రవక్తలును అవమానము నొందుదురు. 27వారు నాతట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి; అయినను ఆపత్కాలములో–లేచి మమ్మును రక్షింపుమని వారు మనవి చేయుదురు. 28నీకు నీవు చేసికొనిన దేవతలు ఎక్కడ నున్నవి? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించునేమో; యూదా, నీ పట్టణములెన్నో నీ దేవతలన్నియే గదా.
29మీరందరు నామీద తిరుగుబాటు చేసినవారు, నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచున్నాడు. 30నేను మీ పిల్లలను హతముచేయుట వ్యర్థమే; వారు శిక్షకు లోబడరు; నాశనవాంఛగల సింహమువలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది. 31ఈ తరమువారలారా, యెహోవా సెలవిచ్చుమాట లక్ష్యపెట్టుడి–నేను ఇశ్రాయేలునకు అరణ్యమువలెనైతినా? గాఢాంధకార దేశమువలెనైతినా? మేము స్వేచ్ఛగా తిరుగులాడువార మైతిమి; ఇకను నీయొద్దకు రామని నా ప్రజలేల చెప్పు చున్నారు? 32కన్యక తన ఆభరణములను మరచునా? పెండ్లికుమారి తన ఒడ్డాణమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు. 33కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు; అందువలన నీ కార్యములు చేయుటకు చెడుస్త్రీలకు నేర్పితివి గదా. 34మరియు నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగులమీద కనబడుచున్నది; కన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటిమీదను కనబడు చున్నది. 35అయినను నీవు–నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నామీదనుండి తొలగిపోయెనని చెప్పు కొనుచున్నావు. ఇదిగో–పాపము చేయలేదని నీవు చెప్పిన దానిబట్టి నీతో నాకు వ్యాజ్యెము కలిగినది. 36నీ మార్గము మార్చుకొనుటకు నీవేల ఇటు అటు తిరుగులాడుచున్నావు? నీవు అష్షూరును ఆధారము చేసికొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారము చేసికొని సిగ్గుపడెదవు. 37చేతులు నెత్తిని బెట్టుకొని ఆ జనమునొద్దనుండి బయలు వెళ్లెదవు; యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు. వాటివలన నీకు క్షేమము కలుగదు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for యిర్మీయా 2