యిర్మీయా 13
13
1యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను–నీవు వెళ్లి అవిసెనార నడికట్టుకొని నీ నడుమున దానిని కట్టుకొనుము, నీళ్లలో దాని వేయకుము. 2కావున యెహోవా మాటచొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని. 3రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై 4–నీవు కొని నడుమున కట్టుకొనిన నడి కట్టును తీసికొని, లేచి యూఫ్రటీసునొద్దకు పోయి అక్కడ నున్న బండబీటలో దానిని దాచిపెట్టుమనగా 5యెహోవా నాకాజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసునొద్ద దాని దాచిపెట్టితిని. 6అనేక దినములైన తరువాత యెహోవా– నీవు లేచి యూఫ్రటీసునొద్దకు పోయి, నేను అక్కడ దాచి పెట్టుమని నీకాజ్ఞాపించిన నడికట్టును అక్కడనుండి తీసికొనుమని నాతో చెప్పగా 7నేను యూఫ్రటీసునొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచి పెట్టినచోటనుండి దాని తీసికొంటిని; నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి యుండెను; అది దేనికిని పనికిరానిదాయెను. 8కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 9–యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు –ఈ విధముగానే యూదావారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. 10అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదుమని వాటిననుసరించుచు, నా మాటలు విన నొల్లక తమ హృదయకాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికిని పనికిరాని యీ నడికట్టువలె అగుదురు. 11నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థుల నందరిని యూదా వంశస్థులనందరిని, నడికట్టు నరుని నడుముకు అంటియున్నరీతిగా నన్ను అంటియుండజేసితిని గాని వారు నా మాటలు వినకపోయి యున్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 12కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ప్రతి సిద్దెయు ద్రాక్షారసముతో నింపబడును. –ప్రతి సిద్దెయు ద్రాక్షారసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అనినయెడల 13నీవు వారితో ఈ మాట చెప్పుము –యెహోవా సెలవిచ్చునదేమనగా–ఈ దేశనివాసుల నందరిని, దావీదు సింహాసనముమీద కూర్చుండు రాజులనేమి యాజకులనేమి ప్రవక్తలనేమి యెరూషలేము నివాసులనందరిని నేను మత్తులుగా చేయబోవుచున్నాను. 14అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరిని ఏకముగా ఒకనిమీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు; వారిని కరుణింపను శిక్షింపక పోను; వారియెడల జాలిపడక నేను వారిని నశింప జేసెదను.
15చెవి యొగ్గి వినుడి; యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. 16ఆయన చీకటి కమ్మజేయకమునుపే, మీ కాళ్లు చీకటి కొండలకు తగులకమునుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయకమునుపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. 17అయినను మీరు ఆ మాట విననొల్లని యెడల మీ గర్వమునుబట్టి నేను చాటున ఏడ్చుదును; యెహోవామంద చెరపట్టబడి నందున నా నేత్రము బహుగా వలపోయుచు కన్నీరు విడుచుచు నుండును. 18రాజును తల్లియైన రాణిని చూచి ఇట్లనుము–మీ శిరోభూషణములును తలమీదనున్న మీ సుందరకిరీటమును పడిపోయెను; క్రుంగి కూర్చుండుడి. 19దక్షిణదేశ పట్టణములు మూయబడియున్నవి; వాటిని తెరువగలవాడెవడును లేడు; యూదావారందరు చెరపట్ట బడిరి; ఏమియులేకుండ సమస్తము కొనిపోబడెను.
20కన్నులెత్తి ఉత్తరమునుండి వచ్చుచున్నవారిని చూడుడి; నీకియ్యబడిన మంద నీ సౌందర్యమైన మంద ఎక్కడ నున్నది? 21నీవు నీకు స్నేహితులుగా చేసికొనినవారిని ఆయన నీమీద అధిపతులుగా నియమించునప్పుడు నీవేమి చెప్పెదవు? ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నిన్ను పట్టును గదా? 22నీవు–ఇవి నా కేల సంభవించెనని నీ మనస్సులో అనుకొనినయెడల నీవు చేసిన విస్తారమైన దోషములనుబట్టి నీ బట్టచెంగులు తొలగిపోయెను, నీ మడిమెలు సిగ్గు నొందెను. 23కూషుదేశస్ధుడు తన చర్మమును మార్చు కొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగినయెడల కీడుచేయుటకు అలవాటుపడిన మీరును మేలుచేయ వల్లపడును. 24కాబట్టి అడవిగాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టెదను. 25నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు, నాచేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 26కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖముమీదికి ఎత్తు చున్నాను. 27నీ వ్యభిచారమును నీ సకిలింపును నీ జార కార్యములను కామాతురతను నేనెరుగుదును; పొలములలో నున్న మెట్టలమీద నీ హేయక్రియలు నాకు కనబడుచున్నవి; యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్ర పరచుకొననొల్లవు; ఇక నెంత కాలము ఈలాగు జరుగును?
Currently Selected:
యిర్మీయా 13: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.