యిర్మీయా 11
11
1యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు 2–మీరు ఈ నిబంధనవాక్యములను వినుడి; యూదా మనుష్యులతోను యెరూషలేము నివాసులతోను నీవీలాగున మాటలాడి తెలియజేయవలెను 3–ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా–ఈ నిబంధన వాక్యములను విననొల్లనివాడు శాపగ్రస్తుడగును. 4ఐగుప్తుదేశములోనుండి, ఆ యినుప కొలిమిలోనుండి నేను మీపితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని–నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీపితరులకిచ్చెదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చునట్లు, మీరు నా వాక్యము విని నేను మీ కాజ్ఞాపించు విధులన్నిటినిబట్టి యీ నిబంధన వాక్యముల ననుసరించినయెడల మీరు నాకు జనులైయుందురు నేను మీకు దేవుడనైయుందును. 5అందుకు–యెహోవా, ఆప్రకారము జరుగును గాకని నేనంటిని.#11:5 మూలభాషలో–ఆమేన్ అని యున్నది.
6యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా – నీవు యూదాపట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటిని ప్రకటింపుము – మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిననుసరించి నడుచుకొనుడి. 7ఐగుప్తులోనుండి మీపితరులను రప్పించిన దినము మొదలుకొని నేటివరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచు వచ్చితిని; నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచు వచ్చితిని 8అయినను వారు తమ దుష్టహృదయములో పుట్టు మూర్ఖతచొప్పున నడుచుచు వినకపోయిరి; చెవి యొగ్గినవారు కాకపోయిరి, వారు అనుసరింపవలెనని నేను వారికాజ్ఞాపించిన యీ నిబంధన మాటలన్నిటి ననుసరించి నడువలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటిని వారిమీదికి రప్పించుచున్నాను.
9మరియు యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను– యూదావారిలోను యెరూషలేము నివాసులలోను కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది. 10ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయిన తమపితరుల దోషచర్యలను జరుప తిరిగియున్నారు; మరియు వారు అన్యదేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు, వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులును యూదావంశస్థులును భంగము చేసియున్నారు. 11కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు – తాము తప్పించుకొనజాలని కీడు వారిమీదికి రప్పింపబోవుచున్నాను, వారు నాకు మొఱ్ఱపెట్టినను నేను వారి మొఱ్ఱను వినకుందును. 12యూదాపట్టణస్థులును యెరూషలేము నివాసులును పోయి తాము ధూపార్పణముచేయు దేవతలకు మొఱ్ఱపెట్టెదరు గాని వారి ఆపత్కాలములో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు. 13యూదా, నీ పట్టణముల లెక్కచొప్పున నీకు దేవతలున్నవి గదా? యెరూషలేము నివాసులారా, బయలుదేవతకు ధూపము వేయవలెనని మీ వీధుల లెక్కచొప్పున లజ్జాకరమైన దానిపేరట బలిపీఠములను స్థాపించితిరి. 14కావున నీవు ఈ ప్రజలనిమిత్తము ప్రార్థనచేయకుము; వారి నిమిత్తము మొఱ్ఱపెట్టకుము ప్రార్థనచేయకుము, వారు తమ కీడును#11:14 కష్టములలో. బట్టి నాకు మొఱ్ఱపెట్టునప్పుడు నేను వినను.
15దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? మ్రొక్కుబళ్లచేతను ప్రతిష్ఠిత మాంసము తినుటచేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టు కొందువా? ఆలాగైతే నీవు ఉత్సహించుదువు. 16అది చక్కని ఫలముగల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను; గొప్ప తుపాను ధ్వనితో దానిమీద మంటపెట్టగా దాని కొమ్మలు విరిగిపోవుచున్నవి. 17ఇశ్రాయేలు వంశస్థులును యూదా వంశస్థులును బయలునకు ధూపార్పణముచేసి నాకు కోపము పుట్టించుటచేత తమం తట తామే చేసిన చెడుతనమునుబట్టి మిమ్మును నాటిన సైన్యములకధిపతియగు యెహోవా మీకు కీడుచేయ నిర్ణయించుకొని యున్నాడు.
18దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని; ఆయన#11:18 నీవు. వారి క్రియలను నాకు కనుపరచెను. 19అయితే నేను వధకు తేబడుచుండు సాధువైన గొఱ్ఱెపిల్లవలె ఉంటిని ; మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదము రండి, వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రదుకువారిలో నుండకుండ వాని నిర్మూలము చేయుదము రండని వారు నామీద చేసిన దురాలోచనలను నేనెరుగకయుంటిని. 20నీతినిబట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను, హృదయమును శోధించు వాడు సైన్యములకధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్యెభారమును నీమీదనే వేయుచున్నాను; వారికి నీవుచేయు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము. 21కావున –నీవు మాచేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారినిగూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు 22–సైన్యములకధిపతియగు యెహోవావారినిగూర్చి సెలవిచ్చునదేమనగా – నేను వారిని శిక్షింపబోవుచున్నాను, వారి యౌవనులు ఖడ్గముచేత చంపబడెదరు, వారి కుమారులును కుమార్తెలును క్షామమువలన చచ్చెదరు; 23వారికి శేషమేమియు లేకపోవును, నేను వారిని దర్శించు సంవత్సరమున అనాతోతు కీడును వారిమీదికి రప్పింతును.
Currently Selected:
యిర్మీయా 11: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.