న్యాయాధిపతులు 11
11
1గిలాదువాడైన యెఫ్తా పరాక్రమముగల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు; గిలాదు యెఫ్తాను కనెను. 2గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్ద వారై యెఫ్తాతో–నీవు అన్యస్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రియింట నీకు స్వాస్థ్యము లేదనిరి. 3యెఫ్తా తన సహోదరులయొద్దనుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరిజనము యెఫ్తాయొద్దకు వచ్చి అతనితోకూడ సంచరించుచుండెను.
4కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయగా 5అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసినందున 6గిలాదు పెద్దలు టోబుదేశమునుండి యెఫ్తాను రప్పించుటకు పోయి–నీవు వచ్చి మాకు అధిపతివై యుండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయుదమని యెఫ్తాతో చెప్పిరి. 7అందుకు యెఫ్తా–మీరు నాయందు పగపెట్టి నా తండ్రి యింటనుండి నన్ను తోలివేసితిరే. ఇప్పుడు మీకు కలిగినశ్రమలో మీరు నాయొద్దకు రానేల? అని గిలాదు పెద్దలతో చెప్పెను. 8అప్పుడు గిలాదు పెద్దలు–అందుచేతనే మేము నీయొద్దకు మళ్లి వచ్చితిమి; నీవు మాతోకూడ వచ్చి అమ్మోనీయులతో యుద్ధముచేసినయెడల, గిలాదు నివాసులమైన మా అందరిమీద నీవు అధికారివవుదువని యెఫ్తాతో అనిరి. 9అందుకు యెఫ్తా–అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసికొనిపోయినమీదట యెహోవావారిని నా చేతి కప్పగించినయెడల నేనే మీకు ప్రధానుడనవుదునా? అని గిలాదు పెద్దల నడుగగా 10గిలాదు పెద్దలు–నిశ్చయముగా మేము నీ మాటచొప్పున చేయుదుము; యెహోవా మన యుభయులమధ్యను సాక్షిగా ఉండునుగాకని యెఫ్తాతో అనిరి. 11కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతోకూడ పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి యంతయు వినిపించెను.
12యెఫ్తా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలనుపంపి– నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశము మీదికి యుద్ధమునకు వచ్చియున్నావని యడుగగా 13అమ్మోనీయుల రాజు–ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యొర్దానువరకును నా దేశము ఆక్రమించుకొని నందుననే నేను వచ్చియున్నాను. కాబట్టి మనము సమాధానముగా నుండునట్లు ఆ దేశములను మరల మాకప్పగించుమని యెఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పెను. 14అంతట యెఫ్తా మరల అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి యిట్లనెను 15–యెఫ్తా సెలవిచ్చినదేమనగా–ఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు. 16ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా వారు ఎఱ్ఱసముద్రమువరకు అరణ్యములో నడిచి కాదేషునకు వచ్చిరి. 17అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజునొద్దకు దూతలను పంపి –నీ దేశము గుండ పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని యడుగగా, ఎదోమురాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరిగాని అతడును–నేను సెలవియ్యనని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేషులో నివసించిరి. 18తరువాత వారు అరణ్యప్రయాణముచేయుచు ఎదోమీయులయొక్కయు మోయాబీయులయొక్కయు దేశముల చుట్టు తిరిగి, మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దుగదా. 19మరియు ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోనను హెష్బోను రాజునొద్దకు దూతలను పంపి–నీ దేశముగుండ మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతనియొద్ద మనవిచేయగా 20సీహోను ఇశ్రాయేలీయులను నమ్మక, తన దేశములోబడి వెళ్లనియ్యక, తన జనులనందరిని సమకూర్చుకొని యాహసులో దిగి ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసెను. 21అప్పుడు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలీయుల చేతి కప్పగింపగా వారు ఆ జనమును హతముచేసిన తరువాత ఆ దేశనివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరచుకొని 22అర్నోను నది మొదలుకొని యబ్బోకువరకును అరణ్యము మొదలుకొని యొర్దానువరకును అమోరీయుల ప్రాంతములన్నిటిని స్వాధీనపరచుకొనిరి. 23కాబట్టి ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా అమోరీయులను తన జనులయెదుట నిలువకుండ తోలివేసిన తరువాత నీవు దానిని స్వతంత్రించు కొందువా? 24స్వాధీన పరచుకొనుటకు కెమోషను నీ దేవత నీకిచ్చిన దానిని నీవనుభవించుచున్నావుగదా? మా దేవుడైన యెహోవా మా యెదుటనుండి యెవరిని తోలివేయునో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకొందుము. 25మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకుకంటె నీవు ఏమాత్రమును అధికుడవు కావుగదా? అతడు ఇశ్రాయేలీయులతో ఎప్పుడైనను కలహించెనా? ఎప్పుడైనను వారితో యుద్ధము చేసెనా? 26ఇశ్రాయేలీయులు హెష్బోనులోను దాని ఊరులలోను అరోయేరులోను దాని ఊరులలోను అర్నోను తీరముల పట్టణములన్నిటిలోను మూడు వందల సంవత్సరములనుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేల వాటిని పట్టుకొనలేదు? 27ఇట్లుండగా నేను నీ యెడల తప్పు చేయలేదుగాని నీవు నామీదికి యుద్ధమునకు వచ్చుటవలన నాయెడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతియైన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకును అమ్మోనీయులకును న్యాయము తీర్చును గాక. 28అయితే అమ్మోనీయులరాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు.
29యెహోవా ఆత్మ యెఫ్తామీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు, గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పేనుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. 30అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కు కొనెను, ఎట్లనగా–నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించినయెడల 31నేను అమ్మోనీయులయొద్ద నుండి క్షేమముగా తిరిగివచ్చునప్పుడు, నన్ను ఎదుర్కొనుటకు నా యింటిద్వారమునుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును; మరియు#11:31 లేదా. దహనబలిగా దాని నర్పించెదననెను. 32అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారియొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతనిచేతికి వారినప్పగించెను గనుక అతడు వారిని 33అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చువరకు ఆబేల్కెరామీమువరకును ఇరువది పట్టణముల వారిని నిశ్శేషముగా హతముచేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల యెదుట నిలువకుండ అణచి వేయబడిరి.
34యెఫ్తా మిస్పాలోనున్న తన యింటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోను నాట్యముతోను బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమేగాని ఆడుసంతానమేగానిలేదు. 35కాబట్టి అతడు ఆమెను చూచి, తన బట్టలను చింపుకొని–అయ్యో నా కుమారీ, నీవు నన్ను బహుగా క్రుంగచేసితివి, నీవు నన్ను తల్లడింపచేయువారిలో ఒకతెవైయున్నావు; నేను యెహోవాకు మాట యిచ్చియున్నాను గనుక వెనుకతీయ లేననగా 36ఆమె–నా తండ్రీ, యెహోవాకు మాట యిచ్చి యుంటివా? నీ నోటినుండి బయలుదేరిన మాటచొప్పున నాకు చేయుము; యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయులమీద పగతీర్చుకొని యున్నాడని అతనితోననెను. 37మరియు ఆమె–నాకొరకు చేయవలసినదేదనగా రెండు నెలలవరకు నన్ను విడువుము, నేనును నా చెలికత్తెలును పోయి కొండలమీద ఉండి, నా కన్యాత్వమునుగూర్చి ప్రలాపించెదనని తండ్రితో చెప్పగా 38అతడు పొమ్మనిచెప్పి రెండు నెలలవరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తెలతోకూడ పోయి కొండలమీద తన కన్యాత్వమునుగూర్చి ప్రలాపించెను. 39ఆ రెండు నెలల అంతమున ఆమె తన తండ్రియొద్దకు తిరిగిరాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిచొప్పున ఆమెకు చేసెను. 40ఆమె పురుషుని ఎరుగనేలేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు నాలుగు దినములు గిలాదుదేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధిచేయుటకద్దు.
Currently Selected:
న్యాయాధిపతులు 11: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.