YouVersion Logo
Search Icon

హోషేయ 9

9
1ఇశ్రాయేలూ, అన్యజనులు సంతోషించునట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు; నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి, నీ కళ్లములన్నిటిమీదనున్న ధాన్యమునుబట్టి నీవు పడుపుకూలిని ఆశించితివి. 2కళ్లములుగాని గానుగలుగాని వారికి ఆహారము నియ్యవు; క్రొత్త ద్రాక్షారసము లేకపోవును. 3ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరలుదురు, అష్షూరు దేశములో వారు అపవిత్రమైన వాటిని తిందురు, యెహోవా దేశములో వారు నివసింపకూడదు. 4యెహోవాకు ద్రాక్షారస పానా ర్పణమును వారర్పింపరు; వారర్పించు బలులయందు ఆయన కిష్టములేదు, వారు ఆహారముగా పుచ్చుకొనునది ప్రలాపము చేయువారి ఆహారమువలెనగును, దాని భుజించు వారందరు అపవిత్రులగుదురు; తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరములోనికిరాదు. 5నియామక దినములలోను యెహోవా పండుగ దినములలోను మీరేమి చేతురు? 6లయము సంభవించినందున జనులు వెళ్లిపోయి యున్నారు; ఐగుప్తుదేశము వారికి కూడు స్థలముగా ఉండును; నొపు#9:6 మెంఫెసు. పట్టణము వారికి శ్మశాన భూమిగా నుండును; వెండిమయమైన వారి ప్రియవస్తువులను దురదగొండ్లు ఆవరించును; ముండ్లకంప వారి నివాస స్థలములలో పెరుగును. 7శిక్షా దినములు వచ్చేయున్నవి; ప్రతికార దినములు వచ్చేయున్నవి; తాము చేసిన విస్తారమైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు, దురాత్మ ననుసరించినవారు వెఱ్ఱివారనియు ఇశ్రాయేలువారు తెలిసికొందురు. 8ఎఫ్రాయిము నా దేవునియొద్దనుండి వచ్చు దర్శనములను కనిపెట్టును; ప్రవక్తలు తమ చర్యయంతటిలోను వేటకాని వలవంటివారై యున్నారు; వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు. 9గిబియాలో చెడుకార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లువారు బహు దుర్మార్గులైరి; యెహోవావారి దోషమును జ్ఞాపకము చేసికొనుచున్నాడు, వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును. 10అరణ్యములో ద్రాక్షపండ్లు దొరికినట్లు ఇశ్రాయేలువారు నాకు దొరికిరి; చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టుమీద తొలి ఫలము దొరికినట్లు మీపితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి; తాము మోహించినదానివలెనే వారు హేయులైరి. 11ఎఫ్రాయిముయొక్క కీర్తి పక్షివలె ఎగిరి పోవును; జననమైనను, గర్భముతో ఉండుటయైనను, గర్భము ధరించుటయైనను వారికుండదు. 12వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరునులేకుండ అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసెదను; నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. 13లోయలో స్థాపింపబడిన తూరువంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని; అయితే నరహంతకుల కప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును. 14యెహోవా, వారికి ప్రతికారము చేయుము; వారికి నీవేమి ప్రతికారము చేయుదువు? వారి స్త్రీలను గొడ్రాండ్రుగాను ఎండు రొమ్ములుగల వారినిగాను చేయుము. 15వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది; అచ్చటనే నేను వారికి విరోధినైతిని, వారి దుష్టక్రియలనుబట్టి వారి నికను ప్రేమింపక నా మందిరములోనుండి వారిని వెలివేతును; వారి యధిపతులందరును తిరుగుబాటు చేయువారు. 16ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు. వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలోనుండివచ్చు సొత్తును నేను నాశనము చేసెదను. 17వారు నా దేవుని మాటల నాలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను. వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు.

Currently Selected:

హోషేయ 9: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in