హోషేయ 4
4
1ఇశ్రాయేలువారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవునిగూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుచున్నాడు. 2అబద్ధసాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్యచేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యెను; జనులు కన్నము వేసెదరు, మానక నరహత్యచేసెదరు. 3కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులును ఆకాశపక్షులును కాపురస్థులందరును క్షీణించుచున్నారు, సముద్రమత్స్యములు కూడ గతించిపోవుచున్నవి. 4ఒకడు మరియొకనితో వాదించినను ప్రయోజనము లేదు; ఒకని గద్దించినను కార్యము కాకపోవును; నీ జనులు యాజకునితో జగడమాడువారిని పోలియున్నారు. 5కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతోకూడ ప్రవక్త కూలును. నీ తల్లిని నేను నాశనముచేతును. 6నా జనులు జ్ఞానములేనివారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును; నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. 7తమకు కలిమి కలిగినకొలది వారు నాయెడల అధికపాపము చేసిరి గనుక వారి ఘనతను నీచస్థితికి మార్చుదును. 8నా జనుల పాపములను#4:8 ప్రాతకూర్పులో–జనులపాపపరిహార బలిమాంసమును (యాజకులు) తిందురు అనియున్నది. ఆహారముగ చేసికొందురు గనుక జనులు మరి యధికముగా పాపము చేయవలెనని వారు కోరుదురు. 9కాబట్టి జనులకు ఏలాగో యాజకులకును ఆలాగే సంభవించును; వారి ప్రవర్తననుబట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలనుబట్టి వారికి ప్రతికారము చేతును. 10వారు యెహోవాను లక్ష్యపెట్టుటమానిరి గనుక వారు భోజనముచేసినను తృప్తి పొందక యుందురు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందక యుందురు. 11వ్యభిచారక్రియలు చేయుటచేతను ద్రాక్షారసము పానముచేయుటచేతను మద్యపానముచేతను వారు మతిచెడిరి. 12నా జనులు తాము పెట్టుకొనిన కఱ్ఱయొద్ద విచారణచేయుదురు, తమ చేతికఱ్ఱ వారికి సంగతి తెలియజేయును, వ్యభిచారమనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. 13పర్వతముల శిఖరములమీద బలులనర్పింతురు, కొండలమీద ధూపము వేయుదురు, సింధూరవృక్షముల క్రిందను చినారువృక్షముల క్రిందను మస్తకివృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే ధూపము వేయుదురు; అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడండ్లును వ్యభిచారిణులైరి. 14జనులు తామే వ్యభిచారిణులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యముచేయుచు బలులనర్పింతురు గనుక మీ కుమార్తెలు వేశ్యలగుటనుబట్టి నేను వారిని శిక్షింపను, మీ కోడండ్లు వ్యభిచరించుటనుబట్టి నేను వారిని శిక్షింపను; వివేచనలేని జనము నిర్మూలమగును. 15ఇశ్రాయేలూ, నీవు వేశ్యవైతివి; అయినను యూదా ఆ పాపములో పాలుపొందక పోవునుగాక. గిల్గాలునకు పోవద్దు; బేతావెనునకు పోవద్దు; యెహోవా జీవముతోడని ప్రమాణముచేయవద్దు. 16పెయ్య మొండి తనము చూపునట్టు ఇశ్రాయేలువారు మొండితనము చూపియున్నారు గనుక విశాలస్థలమందు మేయు గొఱ్ఱెపిల్లకు సంభవించునట్లు దేవుడు వారికి సంభవింపజేయును. 17ఎఫ్రాయిము విగ్రహములతో కలసికొనెను, వానిని ఆలాగుననే యుండనిమ్ము. 18వారికి ద్రాక్షారసము చేదాయెను, ఒళ్లు తెలియనివారు; మానక వ్యభిచారముచేయు వారు; వారి అధికారులు సిగ్గుమాలినవారై అవమానకరమైన దానిని ప్రేమింతురు. 19సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొనిపోవును; తాము అర్పించిన బలులనుబట్టి వారు సిగ్గునొందుదురు.
Currently Selected:
హోషేయ 4: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.