YouVersion Logo
Search Icon

హెబ్రీయులకు 12:1-12

హెబ్రీయులకు 12:1-12 TELUBSI

ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కార మంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు. మరియు –నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీక రించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారియందు భయభక్తులుకలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుకవలెనుగదా? వారు కొన్నిదినములమట్టుకు తమ కిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి.