YouVersion Logo
Search Icon

హబక్కూకు 1

1
1ప్రవక్తయగు హబక్కూకునొద్దకు దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి.
2యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింప కుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షింపక యున్నావు. 3నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. 4అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడును జరుగకుండ మానిపోయెను, భక్తి హీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది. 5అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునొందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, ఆలాగు జరుగునని యొకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు. 6ఆలకించుడి, తమవికాని ఉనికిపట్టులను ఆక్రమించవలెనని భూదిగంతములవరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను. 7వారు ఘోరమైన భీకరజనముగా ఉన్నారు, వారు ప్రభుత్వమును విధులను తమ యిచ్ఛవచ్చినట్లు ఏర్పరచుకొందురు. 8వారి గుఱ్ఱములు చిరుతపులులకంటె వేగముగా పరుగులెత్తును, రాత్రియందు తిరుగులాడు తోడేళ్లకంటెను అవి చురుకైనవి; వారి రౌతులు దూరమునుండి వచ్చి తటాలున జొరబడుదురు, ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లువారు పరుగులెత్తి వత్తురు. 9వెనుక చూడకుండ బలాత్కారము చేయుటకై వారు వత్తురు, ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు. 10రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారముగల దుర్గములన్నిటిని తృణీకరింతురు, మంటి దిబ్బవేసి వాటిని పట్టుకొందురు. 11తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలికొట్టుకొని పోవునట్లువారు కొట్టుకొని పోవుచు అపరాధులగుదురు. 12యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నీవున్నవాడవు కావా? మేము మరణమునొందము; యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించియున్నావు; ఆశ్రయ దుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి. 13నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారుచేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా; కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటె ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు? 14ఏలికలేని చేపలతోను ప్రాకుపురుగులతోను నీవు నరులను సమానులనుగా చేసితివి. 15వాడు గాలమువేసి మానవులనందరిని గుచ్చి లాగి యున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులువేయుచున్నాడు. 16కావున వలవలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్న వని వాడు తన వలకు బలులనర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపము వేయుచున్నాడు. 17వాడు ఎల్లప్పుడును తన వలలోనుండి దిమ్మరించుచుండవలెనా? ఎప్పటికిని మానకుండ వాడు జనములను హతము చేయుచుండవలెనా?

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for హబక్కూకు 1