YouVersion Logo
Search Icon

ఆదికాండము 46

46
1అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసికొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రియైన ఇస్సాకు దేవునికి బలులనర్పించెను. 2అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు–యాకోబూ యాకోబూ అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు–చిత్తము ప్రభువా అనెను. 3ఆయన–నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్లుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసెదను. 4నేను ఐగుప్తునకు నీతోగూడ వచ్చెదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసికొని వచ్చెదను, యోసేపు నీ కన్నులమీద తన చెయ్యి యుంచునని సెలవియ్యగా 5యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్లెను. ఫరో అతని నెక్కించి తీసికొని వచ్చుటకు పంపిన బండ్లమీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రియైన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి. 6వారు, అనగా యాకోబును అతని యావత్తు సంతానమును, తమ పశువులను తాము కనానులో సంపా దించిన సంపద యావత్తును తీసికొని ఐగుప్తునకు వచ్చిరి. 7అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతోకూడ తీసికొనివచ్చెను.
8యాకోబును అతని కుమారులును ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేళ్లు ఇవే; 9యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారులైన హనోకు పల్లు హెస్రోను కర్మీ. 10షిమ్యోను కుమారులైన యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనానీయురాలి కుమారుడైన షావూలు. 11లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి 12యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరెసు జెరహు. ఆ ఏరును ఓనానును కనాను దేశములో చనిపోయిరి. పెరెసు కుమారులైన హెస్రోను హామూలు. 13ఇశ్శాఖారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను. 14జెబూలూను కుమారులైన సెరెదు ఏలోను యహలేలు. 15వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబునకు వారిని అతని కుమార్తెయైన దీనాను కనెను. అతని కుమారులును అతని కుమార్తెలును అందరును ముప్పది ముగ్గురు. 16గాదు కుమారులైన సిప్యోను హగ్గీ షూనీ ఎస్బోను ఏరీ ఆరోదీ అరేలీ. 17ఆషేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా; వారి సహోదరియైన శెరహు. ఆ బెరీయా కుమారులైన హెబెరు మల్కీయేలు. 18లాబాను తన కుమార్తెయైన లేయా కిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె యీ పదునారు మందిని యాకోబునకు కనెను. 19యాకోబు భార్యయైన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను. 20యోసేపునకు మనష్షే ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తుదేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫెర కుమార్తెయైన ఆసెనతు అతనికి కనెను. 21బెన్యామీను కుమారులైన బెల బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహీ రోషు ముప్పీము హుప్పీము ఆర్దు. 22యాకోబునకు రాహేలు కనిన కుమారులగు వీరందరు పదునలుగురు. 23దాను కుమారుడైన హుషీము. 24నఫ్తాలి కుమారులైన యహసేలు గూనీ యేసెరు షిల్లేము. 25లాబాను తన కుమార్తెయైన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరు ఏడుగురు. 26యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరు అరువది ఆరుగురు. 27ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు; ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరు డెబ్బదిమంది.
28అతడు గోషెనుకు త్రోవ చూపుటకు యోసేపునొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషెను దేశమునకు రాగా 29యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రియైన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషెనుకు వెళ్లి అతనికి కనబడెను. అప్పుడతడు అతని మెడమీదపడి అతని మెడ పట్టుకొని యెంతో ఏడ్చెను. 30అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో–నీవింక బ్రదికియున్నావు; నీ ముఖము చూచితిని గనుక నేనికను చనిపోవుదునని చెప్పెను. 31యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారినిచూచి–నేను వెళ్లి యిది ఫరోకు తెలియచేసి, కనానుదేశములో ఉండిన నా సహోదరులును నా తండ్రి కుటుంబపువారును నాయొద్దకు వచ్చిరి; 32ఆ మనుష్యులు పశువులు గలవారు, వారు గొఱ్ఱెల కాపరులు. వారు తమ గొఱ్ఱెలను పశువులను తమకు కలిగినదంతయు తీసికొనివచ్చిరని అతనితో చెప్పెదను. 33గొఱ్ఱెల కాపరియైన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి యేమిటని అడిగినయెడల 34మీరు గోషెను దేశమందు కాపురముండునట్లు–మా చిన్నతనమునుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వికులును పశువులు గలవారమై యున్నామని ఉత్తరమియ్యుడని చెప్పెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in