YouVersion Logo
Search Icon

ఆదికాండము 37

37
1యాకోబు తన తండ్రి పరదేశవాసిగ ఉండిన కనాను దేశములో నివసించెను. 2యాకోబువంశావళి యిది. యోసేపు పదునేడేండ్లవాడై తన సహోదరులతోకూడ మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమునుగూర్చిన సమాచారము వారి తండ్రియొద్దకు తెచ్చుచుండు వాడు. 3మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కు వగా అతని ప్రేమించి అతనికొరకు విచిత్రమైన నిలువు టంగీ కుట్టించెను. 4అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటె ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతనిమీద పగపెట్టి, అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేక పోయిరి. 5యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతనిమీద మరి పగపెట్టిరి. 6అతడు వారినిచూచి–నేను కనిన యీ కలను మీరు దయచేసి వినుడి. 7అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి; నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెనని చెప్పెను. 8అందుకతని సహోదరులు– నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా? మామీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలనుబట్టియు అతని మాటలనుబట్టియు అతనిమీద మరింత పగపెట్టిరి. 9అతడింకొక కల కని తన సహోదరులకు తెలియచేసి– ఇదిగో నేను మరియొక కలకంటిని; అందులో సూర్య చంద్రులును పదకొండు నక్షత్రములును నాకు సాష్టాంగ పడెనని చెప్పెను. 10అతడు తన తండ్రితోను తన సహోదరులతోను అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన యీ కల యేమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులును నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడు దుమా అని అతని గద్దించెను. 11అతని సహోదరులు అతనియందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను.
12అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్లిరి. 13అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి–నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు. నిన్ను వారియొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు–మంచిదని అతనితో చెప్పెను. 14అప్పుడతడు నీవు వెళ్లి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలిసికొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలోనుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. 15అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి–నీవేమి వెదకుచున్నావని అతని నడిగెను. 16అందుకతడు–నేను నా సహోదరులను వెదుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపు మని అడిగెను. 17అందుకు ఆ మనుష్యుడు–ఇక్కడనుండి వారు సాగి వెళ్లిరి. వారు–దోతానుకు వెళ్లుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్లి దోతానులో వారిని కను గొనెను. 18అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచనచేసిరి. 19వారు–ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు; 20వీని చంపి యిక్కడనున్న ఒక గుంటలో పారవేసి, దుష్టమృగము వీని తినివేసెనని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. 21రూబేను ఆ మాట విని– మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండ అతని విడిపించెను. 22ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని నప్పగించుటకై వారి చేతులలో పడకుండ అతని విడిపింప దలచి–రక్తము చిందింపకుడి; అతనికి హాని ఏమియు చేయక అడవిలోనున్న యీ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను. 23యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని యుండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి, 24అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది అందులో నీళ్లులేవు. 25వారు భోజనముచేయ కూర్చుండి, కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసికొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదునుండి వచ్చుచుండిరి. 26అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనము? 27ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయుదము రండి;వాడు మన సహోదరుడు మన రక్త సంబంధిగదా? వానికి హాని యేమియు చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి. 28మిద్యానీయు లైన వర్తకులు ఆ మీదుగా వెళ్లుచుండగా, వారు ఆ గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి. 29రూబేను ఆ గుంటకు తిరిగివచ్చినప్పుడు యోసేపు గుంటలో లేక పోగా అతడు తన బట్టలు చింపుకొని 30తన సహోదరుల యొద్దకు తిరిగివెళ్లి–చిన్నవాడు లేడే; అయ్యో నేనెక్క డికి పోదుననగా 31వారు యోసేపు అంగీని తీసికొని, ఒక మేకపిల్లను చంపి, దాని రక్తములో ఆ అంగీ ముంచి 32ఆ విచిత్రమైన నిలువు టంగీని పంపగా వారు తండ్రియొద్దకు దానిని తెచ్చి–ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గురుతుపట్టుమని చెప్పిరి 33అతడు దానిని గురుతుపెట్టి –ఈ అంగీ నా కుమారునిదే; దుష్ట మృగము వానిని తినివేసెను; యోసేపు నిశ్చయముగా చీల్చబడెననెను. 34యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా 35అతని కుమారులందరును అతని కుమార్తెలందరును అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి; అయితే అతడు ఓదార్పు పొంద నొల్లక–నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్లెదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. 36మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసికొనిపోయి, ఫరోయొక్క ఉద్యోగస్థుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మి వేసిరి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in